Begin typing your search above and press return to search.

కరోనా ట్రీట్మెంట్ లో ఈ మందు వాడాలంటే ఒకసారి ఆలోచించండి !

By:  Tupaki Desk   |   28 May 2021 5:30 AM GMT
కరోనా ట్రీట్మెంట్ లో ఈ మందు వాడాలంటే ఒకసారి ఆలోచించండి !
X
దేశంలో కరోనా సెకండ్ వేవ్ జోరు కొనసాగుతోంది. లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు, వేల సంఖ్యలో మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక వ్యాక్సిన్ల కొరత కూడా దేశాన్ని వేధిస్తోంది. ఈ తరుణంలో మరో ముఖ్యమైన విషయం వెలుగులోకి వచ్చింది. కరోనా మహమ్మారి చికిత్సలో బ్రహ్మాస్త్రం లాంటి మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ మందును అవసరమున్న వారికే ఉపయోగించాలి తప్ప విచక్షణరహితంగా వాడొద్దని ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్‌ డా.డి.నాగేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మందు ధర దాదాపు రూ.70 వేలు కావడంతో పాటు దీని వల్ల వచ్చే దుష్ప్రభావాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని పేర్కొన్నారు.

అవసరం లేకపోయినా దీన్ని ఉపయోగిస్తే వైరస్‌ మ్యూటెంట్లు మరింత ముదిరే అవకాశం ఉందని, యాంటీబాడీ చికిత్సకు కూడా లొంగని పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆర్టీ పీసీఆర్‌ టెస్ట్‌ లో పాజిటివ్‌ వచ్చాక మూడు రోజుల్లో లేదా వారంలోనే దీన్ని తీసుకోవాలని, ఆ తర్వాత దీని ప్రభావం ఉండదని చెప్పారు. తమ ఆస్పత్రిలో ‘కసిరివిమాబ్, ఇమ్దెవిమాబ్‌ కాంబినేషన్‌ లోని యాంటీబాడీస్‌ మందు వేయడం ప్రారంభించినట్లు తెలిపారు. కరోనా వైరస్ తొలిదశలో స్వల్ప, ఒక మోస్తరు లక్షణాలు ఉన్న వారిపైనే ఇది పనిచేస్తుందని, అయితే ఇది ఇచ్చాక త్వరగా కోలుకుంటారని చెప్పారు. ప్రస్తుతం మన దగ్గర ఇంజెక్షన్‌ రూపంలో దీనిని ఇస్తున్నట్టు చెప్పారు. ఈ మందు తీసుకున్నాక ఆస్పత్రుల్లో చేర్చాల్సిన అవసరం తగ్గిపోవడమే కాకుండా 70 శాతం వరకు మరణించే అవకాశాలు తగ్గి వైరల్‌ క్లియరెన్స్‌ లోనూ చెప్పుకోదగ్గ మార్పు కనిపిస్తున్నట్లు వెల్లడైందన్నారు. ప్రస్తుతం అత్యవసర వినియోగానికి కేంద్రం అనుమతి ఇచ్చిందన్నారు. అయితే ఇండియాలో డబుల్‌ మ్యుటెంట్‌ పై ఇది ఏ మేరకు సమర్థంగా పనిచేస్తుందన్న దానికి సంబంధించి వంద మందిపై నిర్వహిస్తున్న పరిశోధన ఫలితాలు నెలలో వెల్లడి అవుతాయని చెప్పారు. ఈ మందు తీసుకున్న వారికి కనీసం 3 నెలల ద్వారా వ్యాక్సిన్‌ వేయకూడదని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో 12 ఏళ్లకు పైబడిన పిల్లలకు కనీస బరువు 40 కిలోలు ఉన్న వారికి ఈ చికిత్సకు అనుమతిస్తారు. ఇక ఆ మందు ఎవరికి ఇవ్వొచ్చ అంటే .. 65 ఏళ్లు పైబడిన వారు, అనియంత్రిత మధుమేహం ఉన్న స్థూలకాయులు గుండెజబ్బులున్న వారు, ఇమ్యునో సప్రెషన్స్‌ తీసుకునే కేన్సర్, ఇతర జబ్బుల వారు, 55 ఏళ్లకు పైగా వయసున్న వారిలో అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులున్న వారు ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు.