Begin typing your search above and press return to search.

గుడికి వెళ్లిన ఏపీ ఎమ్మెల్యే జేబు కొట్టేశారు!

By:  Tupaki Desk   |   15 Jun 2019 6:04 AM GMT
గుడికి వెళ్లిన ఏపీ ఎమ్మెల్యే జేబు కొట్టేశారు!
X
దొంగ‌లందు జేబు దొంగ‌లు వేర‌యా అన్న‌ట్లు ఉంటుంది జేబు దొంగ‌ల య‌వ్వారం. క‌నిక‌ట్టు చేసిన‌ట్లుగా.. మ‌న‌కు కూడా తెలీకుండా మ‌న జేబుకు చిల్లు పెట్టేసే హ‌స్త‌లాఘ‌వం వారి సొంతం. జేబుదొంగ‌ల ఆర్ట్ కు బలైనోళ్లు ఎంద‌రో. ఇప్పుడు ఆ జాబితాలో చేరారు ఏపీకి చెందిన ఎమ్మెల్యే ఒక‌రు.

గుడికి వెళ్లిన ఆయ‌న‌.. దేవుడి ద‌ర్శ‌నంతో మంచి జ‌రుగుతుంద‌ని భావిస్తే.. వ్య‌వ‌హారం మ‌రోలా జ‌రిగింది. గుడికి వెళ్లి స్వామిని ద‌ర్శించుకున్న ఆయ‌న ఆనందం ఆవిరి అయ్యేలా చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గంలో హాట్ టాపిక్ గా మారింది. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా గోపాల‌పురం ఎమ్మెల్యే త‌లారి వెంక‌ట్రావుకు ఇబ్బందిక‌ర అనుభ‌వం ఎదురైంది.

ద్వార‌కా తిరుమ‌లేశుని ద‌ర్శ‌నానికి వెళ్లారాయ‌న‌. ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన నేప‌థ్యంలో.. స్వామివారిని ద‌ర్శించుకుందామ‌ని వీలు చూసుకొని వెళ్లిన ఆయ‌న‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. స్వామివారిని ద‌ర్శించుకొని బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆయ‌న్ను చూసిన అభిమానులు పెద్ద ఎత్తున ఆయ‌న చుట్టుముట్టారు.

మొన్నీ మ‌ధ్య‌నే ఎన్నిక‌ల్లో గెలిచిన నేప‌థ్యంలో కొత్త‌ద‌నం అభిమానుల్లోనే కాదు.. ఆయ‌న‌లోనూ క‌నిపించింది. త‌న‌ను చుట్టుముట్టిన వేళ‌.. వారితో మాట్లాడుతున్న స‌మ‌యంలో.. ఎక్క‌డి నుంచి వ‌చ్చాడో కానీ ఓ జేబు దొంగ.. ఎమ్మెల్యే జేబులో ఉన్న రూ.30వేల క్యాష్ కొట్టేసి చ‌క్కాపోయాడు. అభిమానులతో మాట్లాడి కారెక్కిన ఎమ్మెల్యే వారికి జేబు బ‌రువులో తేడా రావ‌టంతో చూసుకుంటే జేబుదొంగ నిర్వాకం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ జేబుదొంగను ప‌ట్టుకోవ‌టం కోసం పోలీసులు విప‌రీతంగా ట్రై చేస్తున్నార‌ట‌.