Begin typing your search above and press return to search.

కాసుల కక్కుర్తితో లక్షలు కొట్టేసి వీధి కుక్కల్ని చంపేశారట

By:  Tupaki Desk   |   21 Jan 2023 4:51 AM GMT
కాసుల కక్కుర్తితో లక్షలు కొట్టేసి వీధి కుక్కల్ని చంపేశారట
X
మీకు తెలుసా? మనకు ఎలా అయితే హక్కులు ఉంటాయో.. వీధుల్లో తిరిగే వీధి కుక్కలకు హక్కులు ఉంటాయి. వీటి విషయంలో చట్టం ఎంత కఠినంగా ఉంటుందో తెలిస్తే ఆశ్చర్యపోతాం. ఒక ప్రాంతంలో నివసించే వీధి కుక్కల్ని.. వేరే ప్రాంతానికి తరలించేందుకు సైతం చట్టాలు ఒప్పుకోవు. ఒకవేళ అలా చేయాలంటే బోలెడంత కసరత్తు ఉంటుంది. ఎవరైనా చట్టాన్ని పట్టించుకోకుండా వీధి కుక్కల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే జైలుకు వెళ్లే పరిస్థితి ఉందని చట్టాలు స్పష్టం చేస్తున్నాయి.

అయితే.. తాజాగా వనపర్తి జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న ఒక ఉదంతం గురించి తెలిస్తే మాత్రం నోటి వెంట మాట రాదు కదా? మరి.. ఇంత అమానుషంగా వ్యవహరిస్తారా? అన్నది ప్రశ్నగా మారుతుంది. ఇంతకూ జరిగిదేమంటే.. వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో కుక్కల బెడద ఎక్కువ ఉందని.. వీటి కారణంగా మనుషులు.. ముఖ్యంగా చిన్నారులకు అవి ప్రమాదకరంగా మారాయన్న వాదన పెరిగింది.

దీనికి పరిష్కారంగా కుక్కల్ని మున్సిపాలిటీ నుంచి తరలించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రెండునెలల క్రితం కౌన్సిల్లో తీర్మానం చేశారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 138 కుక్కల్ని పట్టి బంధించి.. వాటిని ఇతర ప్రాంతాలకు తరలించినట్లుగా పేర్కొంటూ ఒక్కోకుక్కను పట్టుకోవటానికి రూ.400 ఖర్చు చేయాలని నిర్ణయించారు.

అయితే.. తాజాగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం ఒక్కో కుక్కను పట్టుకోవటానికి రూ.500 ఖర్చు చేయటం ఒక ఎత్తు అయితే.. అలా పట్టుకున్న వీధి కుక్కలకు విషపు ఇంజెక్షన్లు ఇచ్చి ప్రాణాలు తీశారన్న సమాచారం కలకలాన్ని రేపుతోంది. కుక్కల్ని పట్టుకొని వేరే ప్రాంతాల్లో విడిచిపెట్టేందుకుఖర్చు చేసినట్లుగా చెబుతున్న రూ.16.5లక్షల పంచాయితీ ఒకటైతే.. బంధించిన తర్వాత వేరే ప్రాంతానికి తరలించకుండా వాటిని చంపేశారన్న ప్రచారం ఇప్పుడు షాకింగ్ గా మారింది.

ఇలా చంపేసిన శునకాల్ని డంపింగ్ యార్డులో పడేశారన్న వాదన వివాదాస్పదంగా మారింది. ఈ అంశంపై అధికార.. విపక్షాల మీద ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. కాసుల కక్కుర్తి ఉండొచ్చు.కానీ.. మూగజీవాల్ని భారీగా చంపేసి సొమ్ము చేసుకోవటం ఏమిటి ఛండాలంగా? ఇదిలా ఉంటే వీధి కుక్కుల్ని దగ్గర్లోని అడవుల్లో వదిలి పెట్టాలని చెప్పామని.. అయితే చంపారన్న అంశంపై విచారణ చేయిస్తామని చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.