Begin typing your search above and press return to search.

ఈ ఏడాదిలో గూగుల్ లో అత్యధికంగా వెతికినోళ్లు వీరేనట

By:  Tupaki Desk   |   9 Dec 2021 10:42 AM GMT
ఈ ఏడాదిలో గూగుల్ లో అత్యధికంగా వెతికినోళ్లు వీరేనట
X
కాలగర్భంలో మరో ఏడాది కలిసిపోనుంది. మరో మూడు వారాల్లో ఈ ఏడాది ముగియనుంది. 2020లో తగిని కరోనా షాక్ నుంచి.. హమ్మయ్య బయటపడ్డామన్న రీతిలో 2021లోకి అడుగు పెట్టినప్పటికీ.. ఏప్రిల్ లో మొదలైన సెకండ్ వేవ్.. దేశాన్ని ఎంతలా అతలాకుతలం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటివేవ్ లో కష్టాలు ఎక్కువగా.. కన్నీళ్లు తక్కువగా ఉంటే.. అందుకు భిన్నంగా 2021లో భయంతో వణుకుతూ బతకటం అంటే ఏమిటో అందరికి అనుభవంలోకి వచ్చింది.

కరోనా సెకండ్ వేవ్ ఎంతలా దేశాన్ని హిట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాని నుంచి బయటపడి.. కరోనా పీడకల నుంచి దూరమవుతున్న వేళ.. ఒమిక్రాన్ బూచి మళ్లీ తెర మీదకు రావటం తెలిసిందే. అయితే.. దీని గురించి ఎక్కువగా అనుకుంటున్నా.. దాని తీవ్రత ఇప్పటికైతే మనకు ఎదురుకాలేదు. ఇక.. మరికొద్ది రోజుల్లో ముగియనున్న ఏడాది గురించి చూస్తే.. తాజాగా ప్రముఖ సెర్చింజన్ గూగుల్ ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది. ఈ ఏడాది ఎక్కువ మంది గూగుల్ లో వెతికిన వ్యక్తుల జాబితాను విడుదల చేసింది.

అందులో మొదటి స్థానాన్ని సొంతం చేసుకున్న వ్యక్తి కాస్తంత స్పెషల్ గా చెప్పాలి. టోక్యో ఒలింపిక్స లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్న నీరజ్ చోప్రా నిలిచారు. ఆ తర్వాతి స్థానంలో డ్రగ్స్ కేసులో చిక్కుకున్న బాలీవుడ్ బాద్షా షారుక్ తనయుడు ఆర్యన్ ఖాన్ నిలిచారు. మూడో స్థానంలో పంజాబీ నటి షెహనాజ్ గిల్.. బాలీవుడ్ నటి శిల్పా షెట్టి భర్త రాజ్ కుంద్రా.. ఆ తర్వాతి స్థానంలో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఉన్నారు.

వీరితో పాటు బాలీవుడ్ నటుడు.. ప్రముఖ నటి కత్రినా కైఫ్ ను పెళ్లాడనున్న విక్కీ కౌశల్.. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సిందు.. రెజ్లర్లు బజరంగ్ పునియా.. సుశీల్ కుమార్.. బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ సతీమణి నటాషా దలాలు ఉన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. సినిమా.. క్రీడాకారులే తప్పించి ఒక్క రాజకీయ నేత కూడా ఈ జాబితాలో లేకపోవటం గమనార్హం. వ్యాపారవేత్తల్లోనూ టెస్లా అధినేత తప్పించి మరింకెవరు లేకపోవటం గమనార్హం.