Begin typing your search above and press return to search.

స్పీకర్ రేసు.. జగన్ మనసులో ఆ నలుగురు

By:  Tupaki Desk   |   4 Jun 2019 3:21 PM IST
స్పీకర్ రేసు.. జగన్ మనసులో ఆ నలుగురు
X
ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఎవరు.? ఇప్పుడీ ప్రశ్న ఏపీ ప్రజలనే కాదు.. గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలను కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. ఈనెల 8న మంత్రివర్గ విస్తరణ చేపడుతానని ప్రకటించారు. దాంతోపాటే స్పీకర్ , డిప్యూటీ స్పీకర్ పదవులను కూడా తేల్చేస్తాడు. మరి అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ స్పీకర్ రేసులో ఎవరుంటారనే ప్రశ్న పార్టీ వర్గాల్లో విస్తృతంగా సాగుతోంది.

వైసీపీ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రధానంగా నలుగురి మధ్య స్పీకర్ కుర్చీ దోబూచులాడుతోంది. అందులో మొదటి వరుసలో వైసీపీ సీనియర్ ఎమ్మెల్యేలు తమ్మినేని సీతారాం - ధర్మాన ప్రసాదరావుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక వీరిద్దరితోపాటు ఫైర్ బ్రాండ్స్ అంబటి రాంబాబు - రోజాల పేర్లు చివరలో వినపడుతున్నాయి. ఈ నలుగురి చుట్టే స్పీకర్ పోస్టు చక్కర్లు కొడుతోందని పార్టీలో చర్చ జరుగుతోంది.

అయితే ధర్మానా ప్రసాదరావు సీనియర్ నేత. రాజకీయాల్లో దశాబ్ధాల అనుభవం ఉంది. పైగా మాటకారి.. ప్రత్యర్థిని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేయగల నేత.. ఇక వెనుకబడిన శ్రీకాకుళం నుంచి గెలవడంతో ఈయనను స్పీకర్ చైర్ లో కూర్చుండబెడితే వైసీపీ మంచి హ్యాండ్ కోల్పోతుందని వైసీపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఈయన మంత్రి పదవే కరెక్ట్ అంటున్నారు..

ఇక తమ్మినేని సీతారాం.. మృదుస్వభావి అయిన ఈయన చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రిగా చేశారు. ఈయన ప్రశాంతతత్త్వం స్పీకర్ పదవికి సరిగ్గా సరిపోతుందని.. సౌమ్యుడు కావడం.. వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన వాడు కావడం ప్లస్ అంటున్నారు.

మూడో పేరుగా మాజీ స్పీకర్ కోడెలను ఓడించిన అంబటి రాంబాబు పేరు వినిపిస్తోంది. మంచి మాటకారి - దూకుడు కలగలిసిన అంబటిని.. కోడెల వలే స్పీకర్ ను చేయవచ్చు అంటున్నారు. కానీ అంబటి దూకుడు - మాటకారి తనం వైసీపీకి మిస్ అవుతుందని.. ఈ శైలి స్పీకర్ పోస్టుకు సూట్ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి..అంబటి అసెంబ్లీలో ఉంటేనే ప్రతిపక్షాన్ని తుత్తునియలు చేస్తాడని అంటున్నారు.

ఇక రోజాను స్పీకర్ ను చేయడం కష్టమే.. ఎందుకంటే సీఎం రెడ్డి సామాజికవర్గం.. రోజాది అదే.. పైగా సీఎం రాయలసీమకు చెందిన వారు.. రోజా కూడా రాయలసీమ నుంచి గెలిచిన ఎమ్మెల్యేనే.. ఇలా ఏపీలో రెండు ముఖ్యపదవులు సీఎం - స్పీకర్ ఉంటే.. పైగా రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే తప్పుడు సంకేతాలు పార్టీలో ప్రభుత్వంలో వెళతాయి. అందుకే రోజాకు మంత్రి పదవే ఇస్తారని.. స్పీకర్ ఇవ్వరని అంటున్నారు. రోజా లాంటి ఫైర్ బ్రాండ్ - మాటకారి అసెంబ్లీలో ఉంటే ప్రతిపక్షాన్ని చెడుగుడు ఆడించేయగలరు.

అందుకే ఇప్పుడు ఈ నలుగురిని గమనిస్తే తమ్మినేని అయితేనే స్పీకర్ పోస్టుకు సరిపోతాడని అంటున్నారు. మరి జగన్ మనసులో స్పీకర్ గా ఎవరున్నారన్నది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..