Begin typing your search above and press return to search.

మోడీపై కాంగ్రెస్ సిద్ధం చేసిన పది అస్త్రాలు ఇవే..

By:  Tupaki Desk   |   10 Oct 2020 10:15 AM IST
మోడీపై కాంగ్రెస్ సిద్ధం చేసిన పది అస్త్రాలు ఇవే..
X
ప్రధానమంత్రిగా తిరుగులేని రీతిలో దూసుకెళుతున్న నరేంద్ర మోడీకి తొలిసారి కాస్తంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఓవైపు కరోనా విషయంలో ఆయన సర్కారు అంచనాలకు తగ్గట్లు పని చేయలేదన్న విమర్శలతో పాటు.. ఆర్థిక రంగం నీరసించిపోవటంతో ఆయన ప్రభుత్వ వైఫల్యంతో పాటు.. హాథ్రస్ ఎపిసోడ్ లో వ్యవహరించాల్సిన తీరుతో రియాక్టు కాలేదన్న విమర్శల్ని ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు.. ఇప్పటివరకు మోడీ సర్కారుకు వెంట ఉన్న మిత్రులు ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్న పరిస్థితి. ఇదే సమయంలో.. ఇంతకాలం సరైన సమయం కోసం వెయిట్ చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు అలెర్టు అయ్యింది.

మోడీ సర్కారుపై ఇప్పుడిప్పుడే విమర్శలు.. ఆరోపణలు రావటంతో పాటు.. ప్రజల్లోనూ ఒకలాంటి సందేహాలు చుట్టుముడుతున్న వేళ.. రాజకీయ దాడికి దిగేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు తగ్గట్లే ఒకట్రెండు అస్త్రాలతో కాకుండా ఏకంగా పది అస్త్రాలతో బరిలోకి దిగటం ఆసక్తికరంగా మారింది. మోడీ వైఫల్యాలతో దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతిందని.. వాటిని పరిష్కరించటం బీజేపీ వల్ల కాదు సుమా అంటూ కాంగ్రెస్ మండిపడుతోంది. తన విమర్శలకు తగ్గట్లు పలు అంశాల్ని తెర మీదకు తీసుకొచ్చింది.

ఎన్డీయే పాలనను ప్రశ్నించే పది అస్త్రాల్ని తన అమ్ములపొదిలో చేర్చుకున్న కాంగ్రెస్.. వాటితో మోడీ సర్కారుపై పోరు సాగించనుంది.ఇంతకూ ఆ పది అస్త్రాలు ఏమిటన్నది చూస్తే..

1. కరోనా వ్యాప్తి సందర్భంగా ఎలాంటి ప్రణాళిక లేకుండా హడావుడిగా లాక్ డౌన్ ను తెర మీదకు తీసుకురావటం. వైరస్ గొలుసును తెగగొట్టటానికి 21 రోజుల పాటు లాక్ డౌన్ పాటించటం ఒక్కటే మార్గమంటూ మోడీ చేసిన ప్రకటన
2. లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా లక్షలాది వలస కూలీలు ఉపాధి కోల్పోయారు. పెద్ద వయస్కుల్ని.. పిల్లల్ని వెంట పెట్టుకొని వందలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ స్వగ్రామాలకు నడక దారిని వెళ్లాల్సిన మహా సంక్షోభానికి కారణమయ్యారు
3. కరోనా వేళ విధించిన లాక్ డౌన్ కాలంలో భారీ ఎత్తున కుంభకోణాలు చోటు చేసుకున్నాయి (వాటి వివరాల్ని మాత్రం వెల్లడించకపోవటం గమనార్హం)
4. తూర్పు లద్దాఖ్ వాస్తవాధీన రేఖ వెంట చైనా సైనికుల చొరబాట్లకు సంబంధించిన వాస్తవాల్ని మోడీ సర్కారు దాచేస్తోంది. చైనా సైన్యం పలు చోట్ల దేశంలోకి చొచ్చుకొచ్చినట్లుగా కేంద్ర రక్షణ మంత్రి ప్రకటన చేసి.. రెండు రోజులకే అలాంటిదేమీ లేదని బుకాయించటం.
5. కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ వేళ.. వివిధ రంగాల్ని ఆదుకోవటానికి కేంద్రం ప్రకటించిన రూ.20లక్షల కోట్ల ప్యాకేజీ కారణంగా పేదలకు ఒక్కరూపాయి కూడా ప్రయోజనం కలగకపోవటం
6. కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రైతుల్ని దెబ్బ తీసేలా ఉన్నాయి.
7. హాథ్రస్ ఉదంతంలో మాన హక్కుల ఉల్లంఘన తీవ్రంగా సాగింది. బాధితురాలి అంత్యక్రియల వేళ.. వారి కుటుంబ సభ్యుల్ని ఇంట్లో నిర్బంధించి.. గుట్టుగా అర్థరాత్రి వేళ నిర్వహించటం
8. లాక్ డౌన్ వేళ వలస కూలీలకు సంబంధించిన గణాంకాలు కేంద్రం వద్ద లేకపోవటం. నడకతో స్వస్థలాలకు వెళ్లే క్రమంలో ఎంతమంది మరణించారంటే.. అలాంటి రికార్డులు లేవని చెప్పటం
9. ఉద్యోగాల కల్పనలో తీవ్ర వైఫల్యం
10. కోవిడ్ 19కు సంబంధించిన పలు వాస్తవాల్ని వెల్లడించకుండా దాచి పెట్టటం.