Begin typing your search above and press return to search.

ఆర్యన్ పై బుక్ చేసిన కేసులివే.. సదరు సెక్షన్లకు పడే శిక్ష ఇదే

By:  Tupaki Desk   |   7 Oct 2021 12:48 AM GMT
ఆర్యన్ పై బుక్ చేసిన కేసులివే.. సదరు సెక్షన్లకు పడే శిక్ష ఇదే
X
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కుమారుడు డ్రగ్స్ తో పట్టుబడిన సంగతి తెలిసిందే. అసలేం జరిగిందన్న దానిపై భిన్నాభిప్రాయాలు నెలకొని ఉన్నాయి. కొందరు తగిన శాస్తి జరిగిందంటే.. మరికొందరు పాపం చిన్న పిల్లాడు.. అతనికి అలా జరిగి ఉండాల్సింది కాదన్నట్లుగా వాపోతున్నారు. ఏమైనా.. ఈ వ్యవహారందేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. మరికొందరు మాత్రం.. ఇదంతా పొలిటికల్ గేమ్ అని.. అనుకోకుండా ఆర్యన్ దొరికి అడ్డంగా బుక్ అయ్యారని విశ్లేషించే వారు లేకపోలేదు. మరోవైపు షారుక్ లాయర్ మాత్రం.. ముందస్తుగా ప్లాన్ చేసి అతన్ని పట్టుకునేలా చేశారని వాదిస్తున్నారు.

అధికారులు తనిఖీ చేసిన క్రూయిజ్ లో 1500 మంది వరకు ఉంటే.. వారిలో ఎనిమిది మందిని తనిఖీ చేయటం ఏమిటి? అదుపులోకి తసీుకోవటం ఏమిటి? అని ప్రశ్నిస్తున్న వారు లేకపోలేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆర్యన్ మీద పెట్టిన కేసులు ఏమిటి? అందుకు వాడిన సెక్షన్లు.. కేసు నిరూపితమైతే.. అతగాడికి పడే శిక్షలు ఏ విధంగా ఉంటాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఆ సందేహాలకు సమాధానాలు వెతికితే..

నార్కోటిక్ డ్రగ్స్.. సైకోట్రోపిక్ సబ్ స్టాన్ యాక్ట్ 1985 (ఎన్డీపీఎస్) చట్టంలోని పలు నిబంధనలకు తగ్గట్లు అతడి మీద వెల్లువెత్తిన ఆరోపణలకు అనుగుణంగా కేసులు నమోదు చేశారు. అరెస్టు మెమోను చూస్తే.. ఆర్యన్ తో పాటు అదుపులోకి తీసుకున్న మిగిలిన ఏడుగురిలో 13 గ్రాముల కొకైన్.. ఐదు గ్రాముల ఎండీ.. 21 గ్రాముల చరస్.. ఎండీఎంఏ 22 టాబ్లెట్లను ఎన్ సీబీ స్వాధీనం చేసుకుంది.

అరెస్టు అయిన వారిపై ఎన్ డీపీఎస్ చట్టంలోని సెక్షన్‌ 8(సీ), 20 (బీ), 27 రెడ్‌ విత్‌ సెక్షన్‌ 35 కింద కేసులు నమోదు చేసింది. దోషులుగా తేలితే శిక్షలు తీవ్రంగానే ఉంటాయని చెబుతున్నారు.
సెక్షన్ 8(సీ) ప్రకారం.. ఎలాంటి మాదక ద్రవ్యాలను ఎవరూ ఉత్పత్తి.. అమ్మకం.. కొనుగోలు.. రవాణా.. నిల్వ.. వినియోగం కలిగి ఉండటం.. విదేశాల నుంచి ఎగుమతి.. దిగుమతి.. సరఫరా లాంటివి చేయకూడదు.

సెక్షన్ 20 (బీ) ప్రకారం... తక్కువ మొత్తంలో మాదక ద్రవ్యాలు దొరికితే కఠిన కారాగార శిక్ష ఏడాది వరకు లేదంటే రూ.10వేల జరిమానా లేదంటే రెండు కలిపి అమలు చేస్తారు. అదే సమయంలో ఎక్కువ మొత్తంలోదొరికితే పదేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష.. లక్ష రూపాయిల వరకు జరిమానా..ఒకవేళ వాణిజ్యపరమైన మొత్తంలో దొరికితే.. పదేళ్ల నుంచి 20ఏళ్ల వరకు కఠిన కారాగార శిక్ష.. రూ.లక్ష వరకు ఫైన్ వేయొచ్చు. తాజా ఉదంతంలో చూస్తే.. తక్కువ మొత్తంలోనే దొరికినందున శిక్ష ఏడాదికి పరిమితమై.. ఫైన్ కూడా విధించొచ్చు.

సెక్షన్ 27 (ఎ) ప్రకారం.. నిషేధిత డ్రగ్స్ ను వినియోగిస్తే ఏడాది పాటు కఠిన కారాగార శిక్ష.. రూ.20వేలు జరిమానా.. లేదంటే రెండింటిని కలిసి విధించొచ్చు. అయితే.. (బి) ప్రకారం చూస్తే.. తక్కువ మొత్తంలో అయితే ఆర్నెల్లు జైలు.. రూ.10 వేలు ఫైన్ విధించే వీలుంది. దొరికిన నిషేధిత డ్రగ్ పరిమాణాన్ని అనుసరించి సెక్షన్ 20కింద శిక్ష పడే వీలుంది. వాణిజ్య పరంగా డ్రగ్స్ కలిగి ఉంటే.. ప్రభుత్వ న్యాయవాది అంగీకారం లేనిదే బెయిల్ రాదు.