Begin typing your search above and press return to search.

ముంద‌స్తు బ్రిట‌న్ ను ముంచేసింది

By:  Tupaki Desk   |   9 Jun 2017 7:43 AM GMT
ముంద‌స్తు బ్రిట‌న్ ను ముంచేసింది
X
ఆశ ఉండ‌టం త‌ప్పు కాదు. కానీ.. అత్యాశ‌కు పోతే అస‌లుకే ఎస‌రు వ‌స్తుంది. ఈ విష‌యం రాజ‌కీయాల్లో ఉన్న వారికి బాగా తెలిసి ఉండాలి. లేకుంటే ఎంతగా న‌ష్ట‌పోతామ‌న్న విష‌యం బ్రిట‌న్ అధికార‌పార్టీకి తాజాగా తెలిసి వ‌చ్చింది. బ్రిట‌న్ ఉదంతం ప్ర‌పంచంలోని ప‌లు దేశాల్లోని అధికార‌ప‌క్షాల‌కు ఒక గుణ‌పాఠంగా మారుతుంద‌న‌టంలో సందేహం లేదు.

అధికార‌ప‌క్షంగా తాము ప‌వ‌ర్ ఫుల్ గా ఉన్నామ‌ని ఫీల్ కావ‌టం మామూలే. అయితే.. ఇలా తాము ఫీల్ అయినా ప్ర‌జ‌లు ఫీల్‌ కాకుంటే మొద‌టికే మోసం వ‌చ్చే ప‌రిస్థితి. ఇంకా బాగా అర్థం కావాలంటే 2004 సార్వ‌త్రిక‌ ఎన్నిక‌ల్ని గుర్తుకు తెచ్చుకుంటే విష‌యం ఇట్టే అర్థ‌మ‌వుతుంది. అప్ప‌ట్లో ఉమ్మ‌డి ఏపీ ముఖ్య‌మంత్రిగా ఉన్న చంద్ర‌బాబు.. త‌మ ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌ల్లో మంచి ఆద‌ర‌ణ ఉంద‌ని ఫీల‌య్యారు. ప్ర‌భుత్వ కాల‌ప‌రిమితి ముగియ‌కున్నా.. ఆశ‌తో ముంద‌స్తుకు వెళ్లారు అయితే.. ఊహించ‌నిరీతిలో ఆయ‌న ఓట‌మి పాలు కావ‌ట‌మే కాదు.. దాదాపు ప‌దేళ్లు ప్ర‌తిప‌క్షంలో ఉండాల్సి వ‌చ్చింది.

బ్రెగ్జిట్ నేప‌థ్యంలో బ్రిట‌న్ పార్ల‌మెంటులో త‌మ బ‌లాన్ని మ‌రింత పెంచుకోవాల‌ని ఫీల్ అయిన అధికార క‌న్జ‌ర్వేటివ్ పార్టీకి అక్క‌డి ప్ర‌జ‌లు భారీ షాకిచ్చారు. మూడేళ్ల పాటు పాలించే అవ‌కాశం ఉన్నా.. మ‌రింత ప‌వ‌ర్ ఫుల్ కావాల‌న్న అత్యాశ‌తో ముంద‌స్తుకు తెర తీశారు. అయితే.. అధికార‌ప‌క్షం అంచనాల‌కు భిన్నంగా ఓట‌ర్లు రియాక్ట్ కావ‌టంతో ఇప్పుడు హంగ్ ఏర్ప‌డిన ప‌రిస్థితి.

తాజాగా వెలువ‌డిన ఫ‌లితాలు బ్రిట‌న్ అధికార‌ప‌క్షానికి.. ప్ర‌ధాని థెరిసా మేకు షాకింగ్ గా మారాయి. మొత్తం 643 స్థానాల్లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో అధికార క‌న్జ‌ర్వేటివ్ పార్టీ 313 స్థానాల్లో విజ‌యం సాధించ‌గా.. విప‌క్ష లేబ‌ర్ పార్టీ 260 స్థానాల్ని సొంతం చేసుకుంది. అధికారానికి మేజిక్ ఫిగ‌ర్ అయిన 326 స్థానాలు ఎవ‌రికీ రాక‌పోవ‌టంతో హంగ్ ప్ర‌భుత్వం ఏర్పాటు అయ్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. అయితే.. మేజిక్ ఫిగ‌ర్‌ కు స్వ‌ల్ప దూరంలో ఆగిన నేప‌థ్యంలో.. భారీగా గెలుపొందిన ఇండిపెండెంట్ అభ్య‌ర్థుల్ని క‌లుపుకొని ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే దిశ‌గా క‌న్జ‌ర్వేటివ్ పార్టీ ప్ర‌య‌త్నిస్తుందా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ఇదిలా ఉండ‌గా.. ముంద‌స్తుకు వెళ్లి.. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజార్టీని సాధించ‌ని నేప‌థ్యంలో ప్ర‌ధానిగా ఉన్న థెరిసా మేను రాజీనామా చేయాల‌ని విప‌క్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అత్యాశ‌తో భారీగా బ‌లం పెంచుకోవాల‌న్న ఆశ.. బ్రిట‌న్ అధికార‌ప‌క్షానికి మొద‌టికే మోసం తెచ్చింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/