Begin typing your search above and press return to search.

నాలుగు రాక ముందే అక్కడ ఐదో వేవ్ కలకలం

By:  Tupaki Desk   |   30 April 2022 8:30 AM GMT
నాలుగు రాక ముందే అక్కడ ఐదో వేవ్ కలకలం
X
మనదేశంలో ఇంకా మొదలుకాని కోవిడ్ నాలుగో వేవ్ గురించే టెన్షన్ పడుతుంటే దక్షిణాఫ్రికాలో అప్పుడే ఐదో వేవ్ మొదలైపోయింది. ఐదో వేవ్ కారణంగా రోజు వారీ కేసులు వేలల్లో నమోదవుతున్నట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి జో ఫాహ్లా ఆందోళన వ్యక్తంచేశారు. గడచిన రెండు వారాలుగా ఆసుపత్రుల్లో చేరుతున్న రోగుల సంఖ్య పెరిగిపోతున్నట్లు మంత్రి చెప్పారు. కొన్ని వారాల క్రితం కేవలం వందల సంఖ్యల్లో ఉండే కేసులు ఇపుడు వేలల్లో పెరిగిపోయినట్లు మంత్రి ఆందోళన వ్యక్తంచేశారు.

ప్రపంచాన్ని గడగడలాడించిన ఒమిక్రాన్ వేరియంట్ కూడా మొదటి దక్షిణాఫ్రికాలోనే వెలుగుచూసిన విషయం గుర్తుండే ఉంటుంది. అప్పటినుండి రెగ్యులర్ గా ఒమిక్రాన్లోని కొత్త కొత్త వేరియంట్లు దేశాన్ని బాగా ఇబ్బందులు పెట్టేస్తున్నాయి.

కొత్త వైరస్ దేశంలోకి వచ్చినట్లు నిపుణులు గుర్తించకపోయినా ఉన్న వేరియంట్లే కొత్త రూపాల్లో జనాలకు సోకుతున్నట్లు మంత్రి ప్రకటించారు. ఒమిక్రాన్ వెలుగుచూసిన కొత్తల్లో దక్షిణాఫ్రికా నుండి విమాన రాకపోకలను ప్రపంచ దేశాలు నిషేధించిన విషయం గుర్తుండే ఉంటుంది.

మళ్ళీ అలాంటి పరిస్థితులు కనబడకపోయినా దేశంలో కేసులు వేలల్లో నమోదవుతుండటంతో ప్రపంచదేశాల్లో మళ్ళీ టెన్షన్ పెరిగిపోతోంది. దక్షిణాఫ్రికాలో మే నెలలో చలికాలం మొదలవుతున్న కారణంగా కేసుల తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోతోందని మంత్రన్నారు. అంటే చలికాలంలో పెరిగిపోయే కొత్త రకమేదో తయారైనట్లే నిపుణులు అనుమానిస్తున్నారు. ఒకవేళ ఇదే గనుక నిజమైతే ప్రపంచ దేశాలు చలికాలం విషయంలో చాలా జాగ్రత్తలే తీసుకోవాల్సి ఉంటుంది.

దేశంలోని గొటెంగ్, క్వాజులు-నాటల్, పశ్చిమ కేప్ ప్రావిన్స్ లో కొత్త కేసులు 85 శాతం పెరిగాయి. పై ప్రాంతాల్లో కేసుల పాజిటివిటి రేటు 20 శాతం ఉన్నది. పాజిటివిటి రేటు 20 శాతమంటే చాలా చాలా ఎక్కువున్నట్లే అనుకోవాలి.

ఇదే పరిస్ధితి చైనాలో కూడా కనబడుతోంది. ఇప్పటికే షాంఘై నాలుగువారాలుగా లాక్ డౌన్లో ఉంది. దీనికి తొందరలోనే బీజింగ్ తోడవ్వబోతోందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. చైనాలో రోజుకు 25 వేల కేసులు నమోదవుతున్నాయి. ఎంత కఠినంగా ఆంక్షలను విధిస్తున్నా కోవిడ్ కేసులు ఎలా పెరుగుతున్నాయో డ్రాగన్ దేశానికి అర్ధం కావటంలేదు.