పాపం: వైసీపీలో టిక్కెట్ లేదు... టీడీపీలోకి వెళ్లినా అదే సీన్..!

Wed Jan 19 2022 11:10:31 GMT+0530 (IST)

there is no ticket in YCP same scene even In TDP

సాధారణంగా.. ఏ పార్టీలో అయినా.. రెబల్గా మారిన నాయకుడిపై సొంత పార్టీనేతలు.. నిప్పులు చెరుగుతారు. ఉదాహరణకు టీడీపీ తరఫున 2019 ఎన్నికల్లో విజయం దక్కించుకు న్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఆ పార్టీ నేతలు తీవ్రస్తాయిలో టార్గెట్ చేశారు. ఆయనను తూర్పారబట్టారు. నిత్యం విమర్శల వర్షం కురిపించారు. చంద్రబాబు భిక్షతోనే వంశీ గెలిచారంటూ.. వర్ల రామయ్య యనమల రామకృష్ణుడు వంటివారు కీలక విమర్శలు చేశారు. అంతేకాదు.. వంశీకి దమ్ముంటే.. రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు.అయితే.. ఈ తరహా.. వ్యూహం ఇతర నేతల విషయంలో ఎందుకు కనిపించడం లేదనేది.. విశ్లేషకుల మాట. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున 23 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వీరిలో నలుగురు పార్టీ మారిపోయారు. అయితే.. ఒక్క వంశీ విషయంలోనే టీడీపీ టార్గెట్ చేసింది. కానీ చీరాల నుంచి పోటీ చేసి విజయం దక్కించుకున్న సీనియర్ నాయకుడు.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ కరణం బలరాం విషయానికి వస్తే.. ఒక్క మాట కూడా టీడీపీ నేతలు జారడం లేదు. వాస్తవానికి టీడీపీ టికెట్పై గెలిచిన వారు.. ఇతర పార్టీ్లోకి వెళ్తే.. అందరినీ ఒకే విధంగా ట్రీట్ చేయాలి. కానీ కరణం విషయానికి వస్తే.. టీడీపీ నేతలు ఎవరూ.. ఆయనను ఒక్క మాటంటే ఒక్క మాట కూడా అనడం లేదు.

అంతేకాదు.. చీరాలలో పార్టీని బలోపేతం చేసుకునేందుకు కూడా వారు ప్రయత్నించడం లేదు. దీనికి కారణం ఏంటి? అనేది ఆసక్తికర చర్చగా మారింది. దీనికి సంబంధించి కొందరు టీడీపీ సీనియర్లు.. లోపాయికారీగా.. కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. కేవలం సొంత పనుల కోసమే.. కరణం పార్టీ మారారని.. ఆయన ఎప్పటికీ.. టీడీపీ నాయకుడేనని.. వారు అంటున్నారట. అంతేకాదు.. ఆయన మనసు మనదగ్గరే ఉందని.. మనకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడరని చెబుతున్నారు.

అంతేకాదు.. కరణం.. వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ సైకిల్ ఎక్కుతారని కూడా అంటున్నారు. దీంతో టీడీపీ చీరాల ఇంచార్జ్ ఎడమ బాలాజీ వర్గం తీవ్రస్తాయిలో ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటి వరకు మేం పార్టీకో సం కష్టపడుతున్నాం.. వచ్చే ఎన్నికల్లోఅయినా.. టికెట్ దక్కుతుందని భావిస్తున్నాం.. కానీ.. ఇలా వ్యవహరిస్తే.. మాకు అన్యాయం చేసినట్టు కాదా? అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. అన్నీ బలరాం కు తెలిసే జరుగుతున్నట్టుగా ఉందని..వారు ఆవేదన చెందుతున్నారు.

నిజానికి గత ఎన్నికల తర్వాత.. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన బాలాజీ లక్ష్యం వచ్చే ఎన్నికల్లో అయినా.. టికెట్ దక్కించుకోవాలనే. అయితే.. ఇప్పుడు టీడీపీ సీనియర్ల నుంచి వస్తున్న సంకేతాలతో ఆయన తర్జన భర్జనకు గురవుతున్నారు. స్థానిక ఎమ్మెల్యేపై విమర్శలు చేయాలంటే కూడా వారు అంగీకరించడం లేదని.. ఇలా అయితే.. ఎలా? అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి తనకు టీడీపీలో నూ ఎసరు తప్పదనే భావన వ్యక్తం చేస్తున్నారట. మరి ఏం జరుగుతుందో చూడాలి.