Begin typing your search above and press return to search.

తెలంగాణ‌కు అవ‌స‌రం లేదు.. అందుకే ప్ర‌త్యేక హోదా తొల‌గించారు!

By:  Tupaki Desk   |   14 Feb 2022 9:51 AM GMT
తెలంగాణ‌కు అవ‌స‌రం లేదు.. అందుకే ప్ర‌త్యేక హోదా తొల‌గించారు!
X
ప్రత్యేక హోదా కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు ఎప్ప‌టి నుంచో ఎదురుచూస్తున్నారు. ఉమ్మ‌డి ఏపీ విభ‌జ‌న సంద‌ర్భంగా ఇచ్చిన హామీని అమ‌లు చేయాల‌ని ఏపీ కేంద్రాన్ని ఎప్ప‌టి నుంచో కోరుతుంది. కానీ ఆ అంశం ముందుకు క‌ద‌ల‌డం లేదు. ఈ నేప‌థ్యంలో కేంద్రంపై ఒత్తిడి తేవ‌డంలో వైపీసీ ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మ‌రోవైపు ఏపీపై కేంద్రం వివ‌క్ష చూపిస్తుంద‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న త‌ర్వాత మిగిలిపోయిన స‌మ‌స్యల ప‌రిష్కారం కోసం కేంద్ర ప్ర‌భుత్వం త్రిస‌భ్య క‌మిటీని ఏర్పాటు చేస్తూ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

ఫిబ్ర‌వ‌రి 17న ఉద‌యం 11 గంట‌ల‌కు వ‌ర్చువ‌ల్‌గా క‌మిటీ తొలి భేటీ నిర్వ‌హించ‌నుంది. ఈ క‌మిటీ అజెండాలో భాగంగా మొద‌ట ప్ర‌త్యేక హోదా అంశం కూడా చ‌ర్చిస్తామ‌ని ప్ర‌క‌టించింది. కానీ ఆ త‌ర్వాత అజెండాలో మార్పులు చేసి ప్ర‌త్యేక హోదా అంశాన్ని తొలగించింది. దీంతో కేంద్రం నిర్ణ‌యంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ప్ర‌త్యేక హోదా అంశాన్ని తొల‌గించ‌డం వెన‌క టీడీపీ హస్తం ఉంద‌ని వైసీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ఆ అంశాన్ని త‌ప్పించ‌డం వెన‌క ఓ కార‌ణం ఉంద‌ని బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు వెల్ల‌డించారు. ప్ర‌త్యేక హోదా అంశం కేవ‌లం ఏపీకి సంబంధించింద‌ని దీంతో తెలంగాణ‌కు సంబంధం లేదు కాబ‌ట్టి అజెండా నుంచి తొల‌గించింద‌ని ఆయ‌న వివ‌ర‌ణ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మ‌డి స‌మస్య‌ల ప‌రిష్కారం కోసం నిర్వ‌హించే ఈ స‌మావేశంలో ఏపీ ప్ర‌త్యేక హోదా అంశం అవ‌స‌రం లేద‌ని అన్నారు.

తెలంగాణ పాల్గొంటున్న స‌మావేశంలో ఏపీ ప్ర‌త్యేక హోదా గురించి ఎలా చ‌ర్చిస్తార‌ని వీర్రాజు ప్ర‌శ్నించారు. కావాలంటే ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక హోదా గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌తిపాద‌న చేస్తే అప్పుడు క‌మిటీతో స‌మావేశం ఏర్పాటు చేయ‌వ‌చ్చ‌ని తెలిపారు. మ‌రోవైపు కేంద్రం హోం శాఖ స‌మావేశం అజెండాలో మొద‌ట ప్ర‌త్యేక హోదా అంశాన్ని పొర‌పాటున చేర్చార‌ని బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యులు జీవీఎల్ న‌ర‌సింహారావు వెల్ల‌డించారు. ఏపీ, తెలంగాణ మ‌ధ్య విభేదాల ప‌రిష్కారం కోస‌మే ఫిబ్ర‌వ‌రి 17న స‌మావేశం జ‌రుగుతుంద‌న్నారు. ప్ర‌త్యేక హోదా అనేది ఉభ‌య రాష్ట్రాల మ‌ధ్య వివాదం కాద‌ని చెప్పారు. కాబ‌ట్టి అన‌వ‌స‌రంగా ప్ర‌త్యేక హోదా అంశాన్ని తెలంగాణ విభేదాల‌తో ముడిపెట్టొద్ద‌ని సూచించారు.

ప్ర‌త్యేక హోదా కోసం ఎవ‌రి ప్ర‌య్న‌తాలు వాళ్లు చేసుకోవ‌చ్చ‌ని ఆయ‌న అన్నారు. విభ‌జ‌న త‌ర్వాత ఏ రాష్ట్రానికి ఇవ్వ‌ని విధంగా ఏపీకి కేంద్రం రెవెన్యూ లోటు భ‌ర్తీ చేస్తుంద‌న్నారు.