Begin typing your search above and press return to search.

ఈ ఘటన గురించి తెలిస్తే.. డిజిటల్ ఇండియా మాట వింటే ఒళ్లు మండుద్ది!

By:  Tupaki Desk   |   28 April 2021 11:30 AM GMT
ఈ ఘటన గురించి తెలిస్తే.. డిజిటల్ ఇండియా మాట వింటే ఒళ్లు మండుద్ది!
X
నిజంగా నిజం. ఇదేదో కావాలని కల్పించి రాస్తున్నది కాదు. పాలకులు చెప్పే మాటలకు.. వాస్తవాలకు మధ్య అంతరం ఎంతన్న విషయాన్ని తాజా ఉదంతం చెప్పకనే చెప్పేస్తుంది. కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న వేళ.. ఆసుపత్రుల దుర్మార్గాలు.. కాసుల వేట సగటు జీవుల ప్రాణాల్ని గాల్లో కలిసిపోయేలా చేస్తున్నాయి. అదే సమయంలో వ్యవస్థలోని లోపాలు.. ప్రాణాలు పోవటానికి కారణంగా మారటం ఇప్పుడు ఆవేదన కలిగించే అంశం. ఒక ప్రైవేటు ఆసుపత్రి దుర్మార్గం.. వారు డిమాండ్ చేసినంత మొత్తం చేతిలో లేక.. ఏటీఎంలో డబ్బుల్లేక నిండు ప్రాణం గాల్లో కలిసిపోయిన విషాద ఉదంతం శ్రీకాకుళం జిల్లా రాజాంలో చోటు చేసుకున్నాయి.

చేతిలో డబ్బుల్లేక ప్రాణాలు పోవటం ఇప్పటివరకు చేశాం. చేతిలో డబ్బులు ఉండి కూడా ప్రాణం పోవటం పలువురిని కలిసివేసేలా చేస్తోంది. అంజలి అనే మహిళకు కరోనా సోకింది. రాజాంలోని పెంట అగ్రహానికి చెందిన ఆమె పరిస్థితి సీరియస్ గా మారింది. దీంతో ఆమెను జిల్లాలోని జీఎంఆర్ వరలక్ష్మి కేర్ ఆసుపత్రికి బంధువులు తీసుకొచ్చారు. తమ ఆసుపత్రులో చేర్చుకోవాలంటే కేవలం క్యాష్ మాత్రమే చెల్లించాలని.. డిజిటల్ చెల్లింపులు అవకాశం లేదన్నారు. క్రెడిట్ కార్డు ఇస్తామన్నా ఒప్పుకోలేదు. బ్యాంకు ఖాతాలో డబ్బులు ఉన్నప్పటికీ..చేతిలో నోట్ల కట్టలు పెడితే కానీ చేర్చుకోమని కరాఖండిగా చెప్పేశారు.

ఆసుపత్రి వారికి ఎంత చెప్పినా.. డబ్బుల విషయంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చేయటంతో.. చేసేదేమీ లేక ఏటీఎంల చుట్టూ తిరగటం మొదలు పెట్టారు. మూడు గంటల పాటు తిరిగారు. ఏటీఎంలు పని చేయలేదు. నిమిషాల వ్యవధిలో ఆక్సిజన్ అందించాల్సిన వేళ.. గంటల కొద్దీ సమయం రోడ్డు మీదనే ఉంచటంతో ఊపిరి ఆడక.. ప్రాణాలు విడిచింది. డిజిటల్ ఇండియాలో ఆన్ లైన్ పేమెంట్స్ ఎక్కువగా జరుగుతుంటే.. ఈ ఆసుపత్రిలో మాత్రం క్యాష్ మాత్రమే తీసుకుంటాం.. మరెలాంటి పద్దతుల్లో డబ్బులు తీసుకోమని చెప్పిన వైనం.. ఒక అమాయకపు ప్రాణం పోయేలా చేసింది.

ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త.. జీఎంఆర్ కు చెందిన ఆసుపత్రిలో ఇలాంటి చోటు చేసుకోవటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. చెక్కు ఇచ్చి సమయానికి ఖాతాలో డబ్బులు లేకపోతే.. సిబిల్ స్కోర్ కు కోత పెట్టటంతో పాటు.. చెక్ బౌన్స్ ఛార్జీలు వసూలు చేయటం తెలిసిందే. మరి.. బ్యాంకు ఖాతాలో డబ్బులు ఉండి.. ఏటీఎంలో డబ్బులు లేకపోవటానికి సదరు బ్యాంకులకు ఎంత ఫైన్ వేయాలి? కేవలం.. క్యాష్ కు మాత్రమే వైద్యం చేస్తానన్న ఆసుపత్రి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి? లాంటి ప్రశ్నల్ని పలువురు సంధిస్తున్నారు.