Begin typing your search above and press return to search.

మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లా ?

By:  Tupaki Desk   |   4 Aug 2022 4:59 AM GMT
మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లా ?
X
మామూలుగా మావోయిస్టుల పేరుతో పోస్టర్లు వెలుస్తుంటాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ విదానాలను వ్యతిరేకిస్తు మావోయిస్టుల పేర్లతో పోస్టర్లు వెలవటమే ఇప్పటి వరకు జనాలకు తెలిసింది. కానీ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరులో మాత్రం మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు కనబడటం సంచలనంగామారింది.

ఈ పోస్టర్లు కూడా అల్లూరి ఆదివాసి యువజన సంఘం పేరుతో చాలాచోట్ల కనబడ్డాయి. దాంతో యువజన సంఘం ఎవరిది ? ఎప్పుడు ఏర్పాటైంది ? పోస్టర్లను అంటించింది ఎవరనే విషయమై పోలీసులతో పాటు జనాల్లో కూడా ఆసక్తి పెరిగిపోతోంది.

గిరిజనులకు ఏమాత్రం ఉపయోగపడని వారోత్సవాలు అవసరంలేదని సంఘం స్పష్టంగా చెప్పింది. అమాయక గిరిజులను ఇన్ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు చంపేస్తున్నట్లు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తంచేసింది. సెల్ టవర్లను పేల్చేసి ప్రభుత్వ పథకాలను, గిరిజన విజ్ఞాన అవకాశాలను గిరిజన యువతకు దూరంచేస్తున్నట్లు మావోయిస్టులను తప్పుపట్టింది. రోడ్లను రాకుండా చేసి, వేసిన రోడ్లను ధ్వంసంచేసి గిరిజనులను దుర్భరంగా బతకమని మావోయిస్టులు చెబుతున్నట్లు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తించేసింది.

మావోయిస్టులు ఎక్కడుంటే అక్కడల్లా విధ్వంసం, వినాశమే తప్ప అభివృద్ధి జరగదని యువజనసంఘం తీవ్రంగా దుయ్యబట్టింది. పోస్టర్లో ఉన్న పాయింట్లన్నీ కరెక్టే అనటంలో సందేహం అవసరంలేదు. గిరిజన గూడెలకు బయటప్రాంతాలను కలపటం కోసం రోడ్లను నిర్మించాలని ప్రభుత్వం అనుకుంటే మావోయిస్టులు ధ్వంసం చేస్తున్నారు. రోడ్లుంటే పోలీసుల రాకపోకలకు సౌకర్యంగా ఉంటుందన్న కారణంతో మావోయిస్టులు అడ్డుకుంటున్నారు.

బయటప్రపంచంతో గిరిజనులకు కమ్యూనికేషన్ వ్యవస్ధను ఏర్పాటుచేయాలన్న ఉద్దేశ్యంతో సెల్ టవర్లను ప్రభుత్వం ఏర్పాటుచేస్తే వాటిని పేల్చేస్తున్నారు. దీనివల్ల మావోయిస్టుల సంగతేమో కానీ గిరిజనులు మాత్రం నానా అవస్తలు పడుతున్నారు.

పోలీసులకు సమాచారాన్ని అందిస్తున్నారన్న నెపంతో ఇప్పటికే వందలమంది గిరిజనులపై ఇన్ఫార్మర్ల ముద్రవేసి కాల్చి చంపేశారు. ఆసుపత్రులను ఏర్పాటు చేద్దామని ప్రభుత్వం ప్రయత్నిస్తే డాక్టర్లు, వైద్య సిబ్బందిని భయపెట్టి తరిమేస్తున్నారు. దీంతో కడపుమండిపోయిన గిరిజనులే మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు వేసినట్లు అనుమానిస్తున్నారు.