Begin typing your search above and press return to search.

బిడ్డ‌ల‌కు త‌న పోలిక‌లు లేవ‌ని.. ఐదుగురిని చంపేశాడు!

By:  Tupaki Desk   |   1 May 2021 6:00 PM IST
బిడ్డ‌ల‌కు త‌న పోలిక‌లు లేవ‌ని.. ఐదుగురిని చంపేశాడు!
X
వేరు పురుగు జొరబడిందంటే.. చెట్టునే నాశనం చేస్తుంది. అదేవిధంగా.. అనుమానం అనే పురుగు మనసులో చేరిందంటే.. కుటుంబాన్నే స‌ర్వ నాశనం చేసేస్తుంది. భార్య ఎవ‌రితోనో వివాహేతర సంబంధం పెట్టుకుంద‌ని ఏళ్ల క్రితం మొదలైన అనుమానం.. పెరిగి పెద్ద‌ద‌వుతూ వ‌చ్చింది. అది ఎంత‌గా అంటే.. క‌ట్టుకున్న పెళ్లాన్ని, క‌డుపులో ఉన్న బిడ్డ‌ను, క‌న్న ఇద్ద‌రు కొడుకుల‌ను, అత్త‌గారిని విచ‌క్ష‌ణా ర‌హితంగా చంపేసేంత‌గా పెరిగిపోయింది!

క‌ర్నాట‌క‌లోని మైసూరు జిల్లా చామేగౌడ హుండీ గ్రామం. మ‌ణికంఠ స్వామి అనే వ్య‌క్తి ఏడేళ్ల క్రితం గంగ (28)ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్ద‌రు మ‌గ పిల్ల‌లు జ‌న్మించారు. పేర్లు సామ్రాట్(4), రోహిత్ (2). ఎప్పుడు మొద‌లైందో తెలియ‌దు.. భార్య‌మీద అనుమానం మొద‌లైంది. ఎవ‌రితోనో వివాహేత‌ర సంబంధం పెట్టుకుంద‌ని గంగ‌ను హింసించ‌డం మొద‌లు పెట్టాడ‌ట‌. పుట్టిన ఇద్ద‌రు పిల్ల‌ల్లో త‌న పోలిక‌లు లేవు అన్న‌దే అత‌ని ప్ర‌ధాన అనుమానానికి కార‌ణంగా తెలుస్తోంది.

ఈ అనుమానంతో భార్య గంగ‌ను నిత్యం.. మాన‌సికంగా, శారీర‌కంగా వేధించ‌డం మొద‌లు పెట్టాడట‌. ఈ క్ర‌మంలోనే తాగుడుకు బానిస‌య్యాడు. మ‌న‌సులో బ‌లంగా నాటుకుపోయిన ఈ అనుమానం ఏళ్లు గ‌డుస్తున్న‌కొద్దీ పెరిగింది. త‌ర‌చూ ఇదే అనుమానంతో ఆమెను కొట్టేవాడ‌ట‌. పెద్ద‌లు ఎన్నిసార్లు న‌చ్చ‌జెప్పినా.. అనుమానం తీర‌లేదని స‌మాచారం.

ప్ర‌స్తుతం గంగ మూడోసారి గ‌ర్భ‌వ‌తి. రెండు రోజుల్లో డెలివ‌రీ చేస్తామ‌ని వైద్యులు చెప్పార‌ట‌. పుట్టింటికి పంపించ‌మ‌ని అడిగితే మ‌ణికంఠ స్వామి నిరాక‌రించాడ‌ట‌. దీంతో.. నిండు చూలాల‌ని చెప్పి ఆమె త‌ల్లి కెంపాల‌మ్మ‌(60) అల్లుడి ఇంటికే వ‌చ్చింది. ఇప్ప‌టికే ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌న పోలిక‌లు లేవ‌ని గొడ‌వ పెడుతున్న మ‌ణికంఠ‌.. శుక్ర‌వారం రాత్రి కూడా ఇదే విష‌య‌మై గొడ‌వ మొద‌లు పెట్టాడ‌ట‌.

అర్ధ‌రాత్రి వ‌ర‌కు గొడ‌వ పెట్టిన మ‌ణికంఠ‌.. మ‌ద్యం మ‌త్తులో తీవ్ర ఆవేశానికి లోనై ఇనుప రాడ్డుతో భార్య త‌ల‌పై బాదాడ‌ట‌. ఆ త‌ర్వాత క‌న్న బిడ్డ‌ల‌ని కూడా చూడ‌కుండా.. ఇద్ద‌రు కొడుకుల‌ను, అత్త‌ను సైతం రాడ్డుతో బ‌లంగా బాద‌డంతో అంద‌రూ ప్రాణాలు కోల్పోయారని స‌మాచారం. గంగ‌తోపాటు క‌డుపులో ఉన్న బిడ్డ కూడా క‌ళ్లు తెర‌వ‌కుండానే.. క‌న్ను మూసిందట‌. మ‌ణికంఠ అనుమానానికి ఏకంగా ఐదు ప్రాణాలు బ‌ల‌య్యాయి. ఈ దారుణ ఘ‌ట‌న స్థానికంగా తీవ్ర సంచ‌ల‌నం రేకెత్తించింది. వారందరినీ చంపేసిన త‌ర్వాత మ‌ణికంఠ ప‌రార‌య్యాడ‌ట‌. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుడిని గాలించి ప‌ట్టుకున్నారని తెలుస్తోంది.