Begin typing your search above and press return to search.

రన్నింగ్ కంటైనర్లో సెల్ ఫోన్ల చోరీ..ఖాకీ మూవీ రేంజిలో దొంగల పట్టివేత

By:  Tupaki Desk   |   4 Oct 2020 9:00 PM IST
రన్నింగ్ కంటైనర్లో సెల్ ఫోన్ల చోరీ..ఖాకీ మూవీ రేంజిలో దొంగల పట్టివేత
X
గుంటూరు జిల్లాలో కొద్ది రోజుల కిందట నడుస్తున్న కంటైనర్లో సెల్ ఫోన్లను చోరీ చేసిన గ్యాంగ్ ని పోలీసులు ఎంతో సాహసోపేతంగా అరెస్ట్ చేశారు. వాళ్ళ చేజింగ్ అచ్చు సినిమాల్లో చూపించినట్టుగానే సాగింది. పోలీసులు ప్రాణాలను పణంగా పెట్టి ఎంతో ధైర్య సాహసాలతో దుండగులను కేవలం 13 రోజుల వ్యవధి లోనే పట్టుకుని అభినందనలు అందుకుంటున్నారు. దొంగలు సాంకేతికంగా భలే ఆరితేరినట్లు ఉన్నారు. కొన్ని రోజుల కిందట రిజర్వ్ బ్యాంకు సుమారు రూ.4 కోట్ల సొమ్మును ఓ గూడ్స్ ట్రైన్లో పెట్టి చెన్నై నుంచి పంపగా.. దొంగలు ఎంతో చాకచక్యంగా రన్నింగ్ ట్రైన్ లోని డబ్బును దోచేశారు. అచ్చు అలాగే 13 రోజుల కిందట గుంటూరు చెన్నై జాతీయ రహదారి పై నడుస్తున్న కంటైనర్లో సెల్ ఫోన్లను ఓ గ్యాంగ్ అత్యంత చాకచక్యంగా, కంటైనర్ ను డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ కు కూడా తెలియకుండా చోరీ చేసింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

దీనిని ఛేదించడం పోలీసులకు సవాల్ గా మారింది. ఈ చోరీ నిగ్గు తేల్చేందుకు గుంటూరు అర్బన్ పోలీసులు తీవ్ర ప్రయత్నాలు సాగించారు. చివరకు ఈ చోరీకి పాల్పడింది మహారాష్ట్రకు చెందిన కంజర భట్ ముఠాగా తేల్చారు. అయితే వారిని పట్టుకోవడం పోలీసులకు తలకు మించిన పనైంది. నిందితుల జాడ కోసం దాదాపుగా 1200పైగా కిలోమీటర్ల మేర 850కి పైగా సీసీ కెమె రాలను వారు పరిశీలించారు. వారు మహారాష్ట్ర అడవుల్లో నక్కినట్లు గుర్తించి ఎంతో ప్రయాసలతో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అతి కష్టం మీద ఆ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారు దోచుకున్న సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిజంగా దుండగుల జాడ కోసం పోలీసులు పడ్డ శ్రమ కార్తీ ఖాకీ మూవీ సినిమాను తలపించింది.