Begin typing your search above and press return to search.

2 నిమిషాల్లో 20 కోట్లు దోపిడీ.. అమెరికాలో భారతీయ బంగారు దుకాణాలను దోచుకున్నారిలా..

By:  Tupaki Desk   |   11 Jun 2022 12:49 PM GMT
2 నిమిషాల్లో 20 కోట్లు దోపిడీ.. అమెరికాలో భారతీయ బంగారు దుకాణాలను దోచుకున్నారిలా..
X
భారతీయులకు బంగారం అంటే ప్రాణం. వారు దేశంలో ఉన్నా.. విదేశాల్లో ఉన్నా బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తారు. ప్రవాస భారతీయుల్లోని ఆడవారు కూడా ఇబ్బడి ముబ్బడిగా బంగారాన్ని కొని వేసుకుంటారు. అమెరికాలోనూ మన వాళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బంగారం షాపులున్నాయి. ఇదే కొందరు అమెరికన్ దుండగులకు వరమైంది.

భారతీయ దుకాణాలు ఎక్కువగా ఉండే అమెరికాలోని న్యూజెర్సీలో కొందరు దొంగలు చొరబడ్డారు. భారతీయ-అమెరికన్‌లకు చెందిన ఆభరణాల దుకాణాలను దోపిడీ దొంగలు లక్ష్యంగా చేసుకున్నారు. భారీగా దోపిడీకి పాల్పడ్డారు.

దొంగలు బంగారం షాపులను లూటీ చేసిన వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ గా మారాయి. న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో గల భారతీయ ఆభరణాల దుకాణంలోకి దొంగల గుంపు చేరి దోచుకెళ్లింది. దుకాణం యజమాని, మరికొంతమందిని బెదిరించి డిస్‌ప్లే అద్దాలు పగులగొట్టి ఆభరణాలను ఎత్తుకెళ్లారు.

నగల దుకాణం యజమానులను భయభ్రాంతులకు గురిచేశారు. 18 వరుస దొంగతనాలు చేసిన దొంగలే ఈ దోపిడీలతో ముడిపడి ఉండవచ్చని స్టోర్ యజమాని చెప్పారు.

ఈ భారీ బంగారం లూటీలో సుమారు $250000 డాలర్ల విలువైన బంగారం వస్తువులతో దొంగలు పారిపోయినట్లు సమాచారం. భారతీయ దుకాణాలు.. వారు కొనుగోలు చేసే షాపులే లక్ష్యంగా ఈ భారీ దోపిడీ జరిగిందని చెబుతున్నారు.