Begin typing your search above and press return to search.

వాయిస్ పెంచి వాయించేస్తున్నారు... ?

By:  Tupaki Desk   |   6 Jan 2022 5:00 PM IST
వాయిస్ పెంచి వాయించేస్తున్నారు... ?
X
సీనియర్లతో సరిగమపదనిసగా వైసీపీ తీరు మారింది. వారి నస ఎక్కువైంది అని కూడా అంటున్నారు. సీనియర్లకు అనుభవం ఉంది. ఎన్నో ప్రభుత్వాలను వారు చూశారు, దాంతో ప్రస్తుతం తాము ఉన్న పార్టీలోని పరిణామాలను కూడా పోల్చుకుంటూ ఎలాంటి తేడా పాడా లేకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తున్నారు. పైగా చాలా మంది సీనియర్లు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో పొలిటికల్ లైఫ్ మొత్తం చూసిన వారు. అక్కడ ఉన్న స్వేచ్చతో ఏమైనా అనేసేవారు. కానీ ఇపుడు వారి వైసీపీ లాంటి ప్రాంతీయ పార్టీల్లో ఉన్నారు. ఫ్యాన్ నీడన కూడా ఉక్కబోతతో భరించలేకుండా ఉన్నారు.

వారు కోరుకున్న పదవులు రాలేదన్న అసంతృప్తి కూడా వాయిస్ పెంచేలా చేస్తోంది. వైసీపీలో చూసుకుంటే జగన్ సర్వాధికారి, పార్టీ అయినా ప్రభుత్వం అయినా ఆయనే లీడర్, అక్కడ రెండవ వాయిస్ వినిపించడానికి లేదు. కానీ వైసీపీ సగం పాలన పూర్తి అవుతూనే కొన్ని గొంతులు లేస్తున్నాయి. గట్టిగానే గర్జిస్తున్నాయి. తమ ప్రభుత్వం మీదనే అసహనంతో విమర్శలు చేసే నాయకులు తయారయ్యారు. అలాంటి వారిలో నెల్లూరు పెద్దాయన మాజీ మంత్రి ఆనం రాం నారాయణ రెడ్డి ముందు వరసలో ఉన్నారు.

ఆయన తరచూ ప్రభుత్వాన్ని చికాకు పెట్టే కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. అధికారులను టార్గెట్ చేస్తూ ఆయన కామెంట్స్ చేస్తున్నా అవి ఇండైరెక్ట్ గా ప్రభుత్వానికే చాలా గట్టిగానే తగులుతున్నాయి. ఏపీలో లోకల్ మాఫియా బాగా పెరిగిపోయింది అని ఆనం చేసిన ఘాటు కామెంట్స్ వైసీపీ పెద్దలకు అసలు మింగుడుపడడంలేదు. టెర్రరిజం, నక్సలిజం పోయిన చోట లోకల్ మాఫియా చెలరేగుతోందని, ఇది ప్రమాదకరమని ఆనం ఈ మధ్యనే హాట్ హాట్ కామెంట్స్ చేశారు.

ఇపుడు మరో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వంతు వచ్చినట్లుంది. ఆయన ప్రభుత్వం మీద మరో సారి గొంతు సవరించారు. ఏపీలో అభివృద్ధి అన్నది పనులు ఆలస్యం కావడానికి కారణాలు ఏంటో గుట్టు కనిపెట్టి మరీ ధర్మాన చెప్పేశారు. సంక్షేమ పధకాల పేరిట డబ్బులు పంచుతూంటే రోడ్లు వేయడానికి అభివృద్ధి పనులు చేయడానికి డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయని ధర్మాన బాగానే విసుర్లు విసిరారు.

అంతేనా పెన్షన్ డబ్బులు పెంచామని గొప్పగా చెప్పుకుంటూంటే మరో వైపు వంట నూనెలు పెరిగి జనాలు రివర్స్ లో అటాక్ ఇస్తున్నారని ఆయన అనడమూ వైసీపీ ప్రభుత్వ పెద్దలకు గట్టి రిటార్ట్ గానే చూడాలంటున్నారు. పనిలో పని అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పధకం తీరు తెన్నుల మీద కూడా ధర్మాన గట్టిగానే తగులుకున్నారు. కేవలం రెండు గంటలు పనిచేస్తూంటే కూలీలకు డబ్బులు వేస్తున్నారని, మరో వైపు రైతులకు కూలీలు దొరకని పరిస్థితి ఉందని వాపోయారు.

ఒక విధంగా ఉపాధి హామీ పధకంతో దేశంలో పోరంబోకులను తయారుచేసే పరిస్థితి ఏర్పడింది అని ధర్మాన అన్నారు. వ్యవసాయ కూలీలు పనులకు దొరకక రైతన్న నానా అవస్థలు పడుతున్నారని ఆయన అన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రైతులు అసలు బతకరని కూడా ఆయన అన్నారు.

రైతుల పరిస్థితి ఎలా తయారైంది అంటే కష్టపడి వరి పండిస్తే కొనేవాడు లేడని, ఒకవేళ అమ్ముకున్న సరిగ్గా డబ్బులు ఇచ్చేవారూ లేరని ధర్మాన అన్నారు. రైతులు ఇపుడు ఎక్కడా సంతోషంగా లేనే లేరని కూడా ఆయన అన్నారు. మొత్తానికి చూస్తే ధర్మాన తన హాట్ హాట్ కామెంట్స్ వాయించేశారు అనే అంటున్నారు. మరి దీని మీద వైసీపీ పెద్దల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.