Begin typing your search above and press return to search.

బిహార్ ఎన్నికల నిర్వహణ కారణంగా అన్ని లక్షల కేజీల చెత్త?

By:  Tupaki Desk   |   16 Nov 2020 11:30 AM IST
బిహార్ ఎన్నికల నిర్వహణ కారణంగా అన్ని లక్షల కేజీల చెత్త?
X
దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిని రేపిన బిహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలకు సంబంధించి ఊహించని విషయం ఒకటి బయటకు వచ్చింది. మూడు దశల్లో జరిగిన ఈ ఎన్నికల్లో ఎన్డీయే పక్షం విజయం సాధించటమే కాదు.. మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ బాధ్యతల్ని చేపట్టనున్నారు. ఈ ఎన్నికల కారణంగా విడుదలైన జీవ వ్యర్థాల లెక్క ఒకటి బయటకు వచ్చి.. షాకింగ్ గా మారింది.

ఒక రాష్ట్ర ఎన్నికల కోసం ఇంత భారీగా వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయా? అన్నది ప్రశ్నగా మారింది. కరోనా నేపథ్యంలో విడుదలైన ఈ వ్యర్థాలు లక్షల కేజీల్లో ఉండటం గమనార్హం. తాజాగా ముగిసిన బిహార్ ఎన్నికల్లో మొత్తం 160 టన్నులు (ఒక్కో టన్ను వెయ్యి కేజీలు) జీవ వైద్య వ్యర్థాలు ఉత్పత్తి అయినట్లుగా పేర్కొన్నారు.

కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ పోలింగ్.. ఎన్నికల కౌంటింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికల కోసం 18 లక్షల ఫేస్ షీల్డ్స్ ఉపయోగించగా.. 70 లక్షల మాస్కులు.. 5.4 లక్షల వన్ టైం గ్లౌజ్ లు.. 20 లక్షల (ఒక్కొక్కటి 100.. 150 మిల్లీలీటర్లు) శానిటైజర్ బాటిళ్లు ఉన్నాయి. ఎన్నికలు జరిగిన పోలింగ్ కేంద్రాల్లో ఉత్పత్తి అయిన ఈ వ్యర్థాల్ని తొలగించటానికి రెండు రోజుల సమయం పట్టిందని చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో నిర్వహించిన ఈ ఎన్నికల్లో ముందు జాగ్రత్తల కారణంగా ఖర్చు సైతం భారీగా ఉంది.