Begin typing your search above and press return to search.

మాల్దీవుల్లో ఘోరం.. మంటల్లో 9 మంది భారతీయులు దుర్మరణం

By:  Tupaki Desk   |   10 Nov 2022 7:30 AM GMT
మాల్దీవుల్లో ఘోరం.. మంటల్లో 9 మంది భారతీయులు దుర్మరణం
X
మాల్దీవుల్లో దారుణం చోటుచేసుకుంది. అగ్ని కీలలకు 9 మంది భారతీయులు ఆహుతయ్యారు. ఈ ఘటనలో మొత్తం 10 మంది చనిపోగా.. ఇందులో 9 మంది మనవారే కావడం విషాదం. ఓ భవనంలో మంటలు చెలరేగడంతో దుర్ఘటన చోటుచేసుకుంది. వాహనాల మరమ్మతు గ్యారేజీలోని గ్రౌండ్ ఫ్లోర్ లో అగ్ని ప్రమాదం సంభవించినట్లు కథనాలు వస్తున్నాయి. కాగా, మంటల కారణంగా పలువురికి గాయాలైనట్లు సమాచారం.

విదేశీ కార్మికుల బసలో అగ్ని ప్రమాద ఘటన మాల్దీవుల రాజధాని మాలెలో జరిగింది. విదేశీ కార్మికులు బస చేస్తున్న భవనంలో మంటలు చెలరేగాయి. ఇప్పటివరకు 10 డెడ్ బాడీలను బయటకు తీశారు. వీరందరూ భవనం మొదటి అంతస్తులో విగతజీవులయ్యారు. గ్రౌండ్ ఫ్లోర్ లో మంటలు చెలరేగిన నేపథ్యంలో ప్రాణ భయంతో పైకి వెళ్లిన వీరు పొగ కారణంగా ఊపిరాడక ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

అగ్ని కీలలు.. 4 గంటలు భవనంలో గురువారం తెల్లవారుజామున అగ్రి ప్రమాదం జరిగింది. పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో వాటిని ఆర్పేందుకు 4 గంటలు పట్టింది. అనంతరమే 10 మంది చనిపోయినట్లు గుర్తించామని అగ్నిమాపక అధికారి తెలిపారు. కాగా, ఈ ఘటనపై మాల్దీవుల్లోని భారత హై కమిషనర్ తీవ్రం దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. దీనిపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకునేందుకు మాల్దీవుల యంత్రాంగంతో టచ్ లో ఉన్నట్లు చెప్పింది. ఆ మేరకు ట్వీట్ విడుదల చేసింది.

చిన్న దేశం.. వలసదారుల కేంద్రం మాల్దీవులు చాలా చిన్న దేశం. పేరులోనే ఉన్నట్లు దీవులతో కూడిన దేశం. ఇక్కడ 2,50,000 మంది విదేశీ కార్మికులు పనిచేస్తున్నారు. దీవుల మొత్తం జనాభాలో వీరు దాదాపు 50 శాతం. కాగా, విదేశీ కార్మికుల్లో అత్యధికులు భారత్, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంకకు చెందినవారే. అయితే, వీరందరూ చాలా తక్కువ జీవన ప్రమాణాలతో జీవిస్తుంటారు. నివాస వసతులు సరిగా ఉండవు. కొవిడ్ సమయంలో దీని ప్రభావం తీవ్రంగా కనిపించింది. మాల్దీవుల్లో సాధారణ వ్యాప్తి కంటే విదేశీ కార్మికుల్లో మూడు రెట్లు వైరస్ వ్యాప్తి జరిగింది.

సాయం కావాలంటే.. ఈ నంబర్లకు ఫోన్ చేయండి మాల్దీవుల ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన భారత హై కమిషనర్.. అక్కడ చనిపోయిన వారి విషయంలో ఏమైనా సందేహాలుంటే సంప్రదించాల్సిందిగా ఫోన్ నంబర్లను ఇచ్చింది. +9607361452 ; +9607790701 నంబర్లలో సంప్రదించాలని సూచించింది


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.