Begin typing your search above and press return to search.

విశాఖ ఉక్కు: పరిపాలన భవనం ముట్టడించిన కార్మికులు..భయంతో పరుగులు తీసిన డైరెక్టర్‌ !

By:  Tupaki Desk   |   9 March 2021 6:30 AM GMT
విశాఖ ఉక్కు: పరిపాలన భవనం ముట్టడించిన కార్మికులు..భయంతో పరుగులు తీసిన డైరెక్టర్‌ !
X
‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ .. అయితే తాజాగా దీన్ని వంద శాతం ప్రైవేట్ పరం చేయబోతున్నాం అంటూ కేంద్రం మరోసారి స్పష్టమైన ప్రకటన చేయడంతో కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని తప్పుపడుతూ ఏపీలో పెద్ద ఎత్తున ప్రజలు ఉద్యమిస్తున్నారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గత కొద్దిరోజులుగా ఉద్యమం జరుగుతుండగా.. కేంద్రం మాత్రం మెట్టు దిగడం లేదు. స్టీల్ ప్లాంట్ ‌ను ప్రైవేటీకరిస్తామని సోమవారం కేంద్ర ప్రభుత్వం బహిరంగంగా ప్రకటన చేసింది. దీంతో ఏపీలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. కేంద్ర ప్రకటనతో విశాఖ ఉడికిపోతోంది. కేంద్ర ప్రకటనను వ్యతిరేకిస్తూ ఆగ్రహజ్వాలలు ఎగిసిపడుతున్నాయి. స్టీల్ ఫ్యాక్టరీ ఆర్చీ ముందు అర్థరాత్రి నుంచి ఆందోళనకారులు నిరసన చేపడుతుండగా తాజాగా రోడ్లపైన టైర్లను తగలబెట్టి నిరసన చేపట్టారు.

విశాఖ ఉక్కు ప్రైవేటికరణకు వ్యతిరేకంగా అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం ముట్టడికి ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపునిచ్చింది. ప్లాంట్‌లో ఉద్యోగులను ఎవరినీ వెళ్లనీయకుండా అడ్డుకుంటూ తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. స్టీల్ ప్లాంట్ లోపలకి వెళుతున్న డైరెక్టర్ ఫైనాన్స్ అధికారి కారును పరిరక్షణ పోరాట కమిటీ ఆందోళనకారులు అడ్డుకున్నారు. స్టీల్‌ ప్లాంట్ పరిపాలనా భవనం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫైనాన్స్‌ డైరెక్టర్స్‌ ను ఉద్యమకారులు అడ్డుకోవడంతో పరిస్థితి అదుపుతప్పింది. సీఐఎస్‌ ఎఫ్ సిబ్బంది జోక్యం చేసుకొని ఆయనకు రక్షణ వలయంగా మారారు. వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఉద్యమకారులు అయినా వాళ్లను విడిచిపెట్టలేదు. ఫైనాన్స్‌ డైరెక్టర్‌ వెనుక పరుగులు తీశారు. ఆయన్ని లాగే ప్రయత్నం చేశారు. రహదారుల దిగ్భంధంతో చాలా చోట్ల ట్రాఫిక్‌ను డైవర్ట్ చేస్తున్నారు. తుని వైపు వెళ్లాల్సిన వాహనాలను లంకెలపాలెం నుంచి మళ్లిస్తున్నారు. సబ్బవరం మీదుగా పంపిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను ఎన్‌ ఏడీ జంక్షన్, పెందుర్తి మీదుగా మళ్లిస్తున్నారు. ఎన్‌ ఏడీ నుంచి కూర్మన్నపాలెం వరకు, అనకాపల్లి నుంచి లంకెలపాలెం వరకు వన్‌ వే లో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. కార్మికులు ఒక్కసారిగా పెద్దఎత్తున ఆందోళనకు దిగడంతో స్టీల్ ప్లాంట్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.