Begin typing your search above and press return to search.

చంద్రబాబు కన్నీటి విలువ... ?

By:  Tupaki Desk   |   19 Nov 2021 10:31 AM GMT
చంద్రబాబు కన్నీటి విలువ... ?
X
ఏపీలో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీనియర్ మోస్ట్ నేత, 1989 నుంచి ఈ రోజు దాకా శాసనసభకు ఏ రోజూ గైర్ హాజర్ కాని చంద్రబాబు సభకు నమస్కారం అనేశారు. తాను మళ్ళీ సభలో అడుగుపెట్టేది ముఖ్యమంత్రిగానే అని కూడా చెప్పారు. నిజానికి 2024లో ఎన్నికలు అంటే ఈ రోజుకు కచ్చితంగా మరో రెండున్నరేళ్ల వ్యవధి ఉంది. అపుడు టీడీపీ నెగ్గితే బాబు ముఖ్యమంత్రిగా సభలోకి వస్తారు. అంటే ఈ రెండున్నరేళ్ల కాలం ఆయన అసెంబ్లీ ముఖం అసలు చూడరన్న మాట. నిజానికి చంద్రబాబుకు తన కొడుకు వయసు ఉన్న జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా సభలో అతి తక్కువ మంది సభ్యులతో విపక్షంలో ఉండడం ఇబ్బందికరంగానే ఉంది. 23 మంది ఎమ్మెల్యేలతో సభకు వెళ్లడమేంటని తొలి రోజుల్లోనే బాబు భావించారు అంటారు.

అయితే కొడుకు లోకేష్ మంగళగిరిలో గెలిచి ఉంటే ఆయనకే బాధ్యతలు అప్పగించి బాబు ఈసారి సభలో పెద్దగా కనిపించేవారు కాదు, లోకేష్ ఓటమితో తప్పనిసరి పరిస్థితుల్లో బాబు సభ ముఖం చూడాల్సి వచ్చింది. మరో వైపు చూస్తే సభలో చూస్తే టీడీపీ ఎమ్మెల్యేలలో కొందరు వైసీపీ వైపున్నారు. మరికొందరు హాజరు కావడంలేదు. అంటే కనీసం పది మంది కూడా టీడీపీ వైపు కనిపించడం లేదు. అధికార పక్షం చూస్తే మొత్తం ఆక్రమించి ఉంది. దాంతో ఏ అంశం తీసుకున్నా సహజంగానే అటు నుంచి దాడి గట్టిగానే ఉంటోంది.

ఈ రెండున్నరేళ్లలో టీడీపీ పెద్దగా ఎత్తిగిల్లలేదు అది జరిగితే బాబు వాయిస్ పెంచి వైసీపీని ధీటుగా ఎదిరించేవారు. 2019 నాటి ఫలితాలే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా రిపీట్ కావడంతో ఆ జోష్ లో అధికార పార్టీ ఉంది. ఈ పరిణామాలు అన్నీ ఇబ్బందిపెడుతున్న వేళ ఏకంగా కుప్పం లోనూ బాబుకు వ్యతిరేక ఫలితాలు రావడంతో ఆయన తట్టుకోలేకపోయారు. ఇవన్నీ చూసిన చంద్రబాబు సభలో ఉండడం కంటే తప్పుకుంటే బెటర్ అన్న నిర్ణయానికి వచ్చేశారని చెప్పుకోవాలి. మరి చంద్రబాబు అసెంబ్లీ బాయ్ కాట్ మంచి పరిణామమేనా అంటే రాజకీయంగా ఒక ఎత్తుగడగా చూడాలి. సానుభూతి కోణంలో కూడా దీన్ని ఆలోచించాలి.

అయితే గతంలో ఎన్టీయార్, జయలలిత, జగన్ వంటి వారు సభను బహిష్కరించి తిరిగి ముఖ్యమంత్రులుగానే అడుగు పెట్టారు. అయితే ఎన్టీయార్ చరిష్మాటిక్ లీడర్. ఇక జయలలిత ఆ శపధానికి ముందు విపక్ష నేత మాత్రమే. ఆ తరువాత ఆమె సీఎం గా పవర్ లోకి వచ్చారు. జగన్ కూడా అంతే. ఆయనకు సభలో మైకు ఇవ్వలేదని, అధికార పక్షం టార్చర్ చేస్తోంది అని సభకు నమస్కారం అనేశారు. ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబుది వీరికి భిన్నమైన వ్యవహారం. ఆయన మూడు సార్లు సీఎం గా చేశారు.

పై ముగ్గురి కంటే కూడా అసెంబ్లీ తీరుతెన్నులు ఆయనకు ఎక్కువగా తెలుసు. అన్నీ తెలిసిన బాబు సభలో అవమానం జరిగింది అంటే సింపతీ యాంగిల్ కంటే కూడా దాన్నిపక్కా వ్యూహంగానే చూసే వారే ఎక్కువ మంది ఉంటారు. ఇపుడు చంద్రబాబు రాజకీయ చరమాంకంలో ఉన్నారు. ఆయన మళ్లీ సీఎం అయి సభలో అడుగుపెడతాను అంటే అది జనం చేతిలో ఉంది. దానికి ఆయన వద్ద ఉన్న ఆయుధం సానుభూతి. ఏనాడూ కంటతడి పెట్టని బాబు కన్నీటితో అసెంబ్లీ వీడారు. జయలలిత ఒక మహిళగా కన్నీరు పెట్టుకుంటే జనాలు కరుణానిధిని ఓడించారు. ఎన్టీయార్ విషయం సెపరేట్. వెండి తెర వేలుపు. జగన్ అయితే అసెంబ్లీని వీడిన తరువాత దాన్ని సానుభూతిగా మార్చుకోలేదు. మరి చంద్రబాబు మాత్రం సింపతీ కార్డుతో జనాల్లోకి వెళ్లాలని అనుకుంటున్నారు. ఆయనకు సభలో ఎంతటి అవమానం జరిగింది అన్నది జనాలకు అయితే తెలియదు. ఇక ప్రస్తుత సభల తీరుతెన్నులు గురించి కూడా జనాలు పెదవి విరుపే సమాధానంగా ఉంటుంది.

అయితే బాబు ఈ వయసులో కన్నీటితో జనాల వద్దకు వెళ్తే ఎంతో కొంత సానుభూతి అయితే ఉంటుంది. మరి దాని విలువ ఎంత, దాని వల్ల టీడీపీకి జరిగే మేలు ఏంటి అన్నది కాలమే చెబుతుంది. ఇక్కడో విషయం ఉంది. ఈ సానుభూతులు కన్నీటి లెక్కల కంటే కూడా పార్టీని చక్కదిద్దుకుని గట్టి ప్రతిపక్షంగా చేసుకుని జనం పక్షాన పోరాడితేనే చంద్రబాబుకూ టీడీపీకి గరిష్టంగా మేలు జరుగుతుంది. అలా కాకుండా ఎత్తుగడలతోనే సైకిల్ కి జోరు తెప్పిస్తామనుకుంటే ఫలితం ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు.