Begin typing your search above and press return to search.

జీడీపీ అంటేఏంటి? దాన్ని ఎవరు? ఎలా లెక్కిస్తారు?

By:  Tupaki Desk   |   2 Sep 2020 12:30 AM GMT
జీడీపీ అంటేఏంటి? దాన్ని ఎవరు? ఎలా లెక్కిస్తారు?
X
కరోనా మహమ్మారి విజృంభణతో స్థూల దేశీయోత్పత్తి భారీగా పతనమైంది. ఏప్రిల్-జూన్ క్వార్టర్‌ లో జీడీపీ 23.9% క్షీణించింది. ఇప్పటివరకు ఇదే అత్యల్పం. అప్పటికే మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు 2020-21 ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే కరోనా గట్టి షాక్ ఇచ్చింది. కరోనా కారణంగా ప్రజల ప్రాణాల కోసం లాక్ డౌన్ తప్పనిసరిగా మారింది. కానీ, దీని కారణంగా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోయింది. గత ఏడాది ఇదే క్వార్టర్‌ లో జీడీపీ 5.2% పెరిగింది. ఈసారి కరోనా దెబ్బతో కనీవినీ ఎరుగని విధంగా ప్రతికూలత నమోదు చేసింది.

జీడీపీ అంటే ఏమిటి.. జీడీపీ ఎలా లెక్కిస్తారు.. అనే అంశాల గురించి ఇప్పుడు చూద్దాం. ఒక్కమాటలో చెప్పాలంటే ఒక నిర్దిష్ట కాలంలో దేశంలో ఉత్పత్తి అయిన సరుకులు, సేవల మొత్తం వ్యాల్యూను స్థూల జాతియోత్పత్తి అని పిలుస్తారు. గత ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలల్లో భారత్‌లో ఉత్పత్తి చేయబడిన వస్తువులు, సేవల మొత్తం విలువతో ఈ ఏడాది అదే కాలంలో ఉత్పత్తి చేయబడిన వస్తువులు, సేవలను పోల్చుతారు. 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్ (ఏప్రిల్-జూన్) లో జీడీపీ 23.9 శాతం క్షీణించడం అంటే గత ఏడాది ఇదే కాలం కంటే ఆ మేరకు తక్కువ అని అర్థం. సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ప్రతి ఏడాది నాలుగుసార్లు జీడీపీని లెక్క కడుతుంది. ప్రతి మూడు నెలలకు ఓసారి లెక్కించే ఈ గణాంకాలను ఆర్థిక పరిభాషలో త్రైమాసిక గణాంకాలు అంటారు. నాలుగు త్రైమాసికాలతో పాటు ప్రతి సంవత్సరం వార్షిక జీడీపీ వృద్ధి గణాంకాలను కూడా వెల్లడిస్తుంది.

సరళీకృత ఆర్థిక విధానాల అనంతరం భారత జీడీపీ 7 శాతం నుండి మధ్యలో 1 శాతానికి పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల 8 శాతానికి చేరుకుంది. అయితే గత ఏడాది మందగమనం, ఇప్పుడు కరోనా కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 7 శాతం ప్రతికూలత నమోదు చేస్తుందని ఆర్థిక నిపుణుల అంచనా. సిమెంట్, బొగ్గు, స్టీల్, టెలిఫోన్, కమర్షియల్ వెహికిల్ సేల్స్, మేజర్ సీపోర్ట్స్, విమనానాశ్రయాలు, రైల్వే తదితర ఉత్పత్తులు, సేవలు కీలకం. ఇక జీడీపీని లెక్కించడానికి నాలుగు విస్తృత అంశాలు కూడాలి. 1.వినిమయ వ్యయం అంటే దేశ జనాభా వస్తువులు, సేవలను కొనుగోలు చేసేందుకు చేసిన మొత్తం ఖర్చు, 2.ప్రభుత్వ వ్యయం, 3.పెట్టుబడి వ్యయం, 4.నికర ఎగుమతుల వ్యాల్యూ. జీడీపీని నామినల్ జీడీపీ, రియల్ జీడీపీ అని రెండు రకాలుగా లెక్కిస్తారు

జీడీపీ గణాంకాలను ప్రధాన రంగాల నుండి సేకరిస్తారు. వ్యవసాయం, తయారీ, విద్యుత్, గ్యాస్, గనులు, అడవులు, చేపల వేట, హోటల్, నిర్మాణం, వాణిజ్యం, సమాచార సంబంధాలు, బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్, ఇన్సురెన్స్, వాణిజ్య సేవలు వంటి వివిధ రంగాల నుండి సేకరిస్తారు. జీడీపీ వృద్ధి చెందుతుందంటే ఆర్థిక కార్యకలాపాల విషయంలో దేశానికి డోకా లేదని అర్థం. జీడీపీ నిరాశాజనకంగా ఉంటే పెట్టుబడులు తగ్గుతాయి. ఆర్థిక వృద్ధి మందగిస్తుంది. ఇక్కడ మరో అంశం ఉంది. జీడీపీని లెక్కించేందుకు సంఘటిత రంగాన్ని పరిగణలోకి తీసుకుంటారు. అసంఘటిత రంగంలోని పరిస్థితి జీడీపీ గణాంకాల్లో ప్రతిఫలించదు. దేశంలో ఎక్కువ శాతం ఉపాధి అసంఘటిత రంగంలోనే ఉంది. కరోనా కారణంగా సంఘటిత రంగాల కంటే అసంఘటిత రంగం ఎక్కువగా దెబ్బతింది.