Begin typing your search above and press return to search.

బంగాళ‌దుంప‌ల‌తో బంగారం చేయుడేంది రాహుల్‌?

By:  Tupaki Desk   |   17 Nov 2017 11:06 AM IST
బంగాళ‌దుంప‌ల‌తో బంగారం చేయుడేంది రాహుల్‌?
X
ఇవాల్టి రోజున దేన్ని న‌మ్మాలో దేనిని న‌మ్మ‌కూడ‌దో అస్స‌లు అర్థం కాని ప‌రిస్థితి. టెక్నాల‌జీని ఉప‌యోగించి మ‌న క‌ళ్ల‌తో మ‌నం చూసే దానిని.. మ‌న చెవుల‌తో మ‌నం వినే దానిని న‌మ్మ‌లేనంతగా మార్చేస్తున్నారు. సోష‌ల్ మీడియాను ఉప‌యోగించి బుర‌డీ కొట్టించేస్తున్న వైనం అంత‌కంత‌కూ ఎక్కువ అవుతోంది. ఇదిలా ఉంటే.. పోటీ ప్ర‌పంచంలో ప‌రుగులు తీస్తూ వార్త‌లు రాసే ధోర‌ణి పెరిగిపోయింది. దీంతో.. ఎప్పుడో కానీ త‌ప్పులు దొర్ల‌ని మీడియాలోనూ ఇప్పుడు ప‌దే ప‌దే త‌ప్పులు దొర్లుతున్నాయి.

సోష‌ల్ మీడియాలో వ‌చ్చే త‌ప్పుల్ని య‌థాత‌దంగా మొయిన్ స్ట్రీమ్ మీడియా సైతం వాడేయ‌టంతో త‌ప్పులు అంత‌కంత‌కూ పెరిగిపోతున్నాయి. క్రాస్ వెరిఫికేష‌న్ అన్న‌ది త‌క్కువైపోతోంది. దీంతో.. చాలా త‌ప్పులు రైట్ గా ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లిపోతున్నాయి. ఇప్పుడు రాహుల్ ప్ర‌సంగానికి సంబంధించిన ఒక వీడియో సోష‌ల్ మీడియాలో పోస్ట్ అవుతోంది. ఇది నిజ‌మా.. అబ‌ద్ధ‌మా అన్న‌ది తేల‌టం లేదు కానీ.. కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ మ‌రీ అంత అజాగ్ర‌త్త‌గా మాట్లాడ‌తారా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

కీల‌క నేత‌ల నోటి నుంచి వచ్చే ప్ర‌తి మాట రికార్డు అవుతుంటుంది. అందుకే వారు ఆచితూచి మాట్లాడుతుంటారు. అయిన‌ప్ప‌టికీ కొన్ని సంద‌ర్భాల్లో య‌ధాలాపంగా త‌ప్పులు దొర్లుతుంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు ఆ మ‌ధ్య‌న బెంగ‌ళూరులో స్టార్ట్ చేసిన ఇందిరా క్యాంటీన్లను ప్రారంభించే స‌మ‌యంలో ఇందిరా క్యాంటిన్లు అన‌బోయి క్యాంపెయిన్ అనేశారు రాహుల్‌. బెంగ‌ళూరులోని అన్ని ప్రాంతాల్లో ఈ త‌ర‌హా క్యాంటీన్ల‌ను ఓపెన్ చేస్తామ‌న్న మాట‌ను చెప్ప‌బోయి.. అన్ని రాష్ట్రాల్లో అంటూ అచ్చు త‌ప్పు ప‌లికేశారు.

ఇలాంటివ‌న్నీ ఒక ఎత్తు.. ఏ మాత్రం సంద‌ర్భం లేకుండా మాట్లాడిన మాట‌లు మ‌రో ఎత్తు. ఇందుకు సంబంధించిన ఒక వీడియో క్లిప్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోను క‌ట్ చేసిన విధానం కాస్త అనుమానాస్పందంగా ఉంది. ఇక‌.. ఇందులో వినిపించే కంటెంట్ వింటే దిమ్మ తిరిగిపోవ‌టం ఖాయం. గుజ‌రాత్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా రాహుల్ ప్ర‌సంగిస్తూ బంగాళ‌దుంప‌ల్ని మెషీన్లో వేస్తే మ‌రోవైపు నుంచి బంగారం వ‌చ్చేలా యంత్రం త‌యారు చేస్తామ‌న్న‌ట్లుగా క్లిప్ ఉంది. దీంతో రైతుల‌కు బాగా డ‌బ్బులు వ‌స్తాయ‌న్న మాట రాహుల్ నోట వ‌చ్చిన‌ట్లుగా ఈ వీడియో ఉంది.

అక్ష‌ర దోషాలు.. అన్వ‌య‌దోషాల్ని అర్థం చేసుకోవ‌చ్చు కానీ మ‌రీ ఇంత దారుణంగా సంబంధం లేని మాట రాహుల్ నోటి నుంచి వ‌స్తుందా? అన్న‌ది క్వ‌శ్చ‌న్‌. బంగాళ‌దుంప రైతుల‌కు క‌ష్టం లేకుండా.. వారికి మేలు చేకూరేలా ఏదైనా చేస్తామంటూ చెప్పిన క్లిప్ ను.. టెక్నాల‌జీ సాయంతో ఇలా అడ్డ‌దిడ్డంగా మార్చేశారా? అన్న‌ది ఇప్పుడు సందేహంగా మారింది. ఇక‌.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న క్లిప్ ను చూస్తే.. బంగాళ‌దుంప‌ల్ని యంత్రంలో పెట్ట‌గానే బంగారం వ‌చ్చేలా ఒక యంత్రాన్ని త‌యారు చేస్తా.. దీంతో రైతుల‌కు బాగా డ‌బ్బులు వ‌స్తాయ‌న్నట్లుగా రాహుల్ మాట్లాడ‌టం క‌నిపిస్తుంది. రాహుల్ మాట‌ల్లో త‌ప్పులు దొర్లి ఉండొచ్చు.. కానీ ఇంత దారుణంగా మాట్లాడ‌రు క‌దా?