Begin typing your search above and press return to search.

ఆ చెట్టు 24 గంటలూ పటిష్ట భద్రత.. నెలకి ఖర్చు ఎన్ని లక్షలంటే

By:  Tupaki Desk   |   25 Oct 2021 8:47 AM GMT
ఆ చెట్టు 24 గంటలూ పటిష్ట భద్రత.. నెలకి ఖర్చు ఎన్ని లక్షలంటే
X
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ దగ్గర్లోని సాంచి, సలామత్ పుర మధ్య ఉన్న చిన్న గుట్ట మీద ఈ చెట్టు ఉంది. దీనిని అత్యంత జాగ్రత్తతో చూసుకుంటున్నారు. ఈ చెట్టు దరిదాపుల్లోకి ఎవరినీ రానివ్వరు. వారు వీఐపీ, వీవీఐపీ అయినా సరే ముందస్తు అనుమతి తీసుకోవాల్సిందే. అంతేకాదు.. ఒక్క ఆకు రాలినా ఆ రోజు అధికారులకు కంటిమీద నిద్ర కరువే అని చెప్పాలి. ఇంతకీ అదేం చెట్టు చెప్పలేదు కదా, అది బోధి చెట్టు. ఈ చెట్టుకు సాంచి నగర పాలికే నుంచి ప్రత్యేకమైన ట్యాంకులో నీటిని సరఫరా చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీరు, ఎరువు తదితరాలు తక్కువ కాకుండా చూస్తుంటారు. ఈ బోధి చెట్టు సంరక్షణకు అవసరమైన నిపుణులను ఒక్కొక్కసారి శ్రీలంక నుంచి కూడా ఇక్కడికి రప్పిస్తుంటారు.

బుద్ధునికి జ్జానోదయం అయిన బోధి చెట్టు చిన్న కొమ్మను క్రీస్తు పూర్వం 3వ శతబ్దంలో భారత్ నుంచి శ్రీలంకకు తీసుకువెళ్లారు. అక్కడ అనురాధాపురంలో నాటి సంరక్షించారు. అప్పటి నుంచి ఆ ప్రాంతం అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో భారత దేశం నుంచి అక్కడికి పర్యాటకులు వెలుతున్నారు. ఆ చెట్టును అక్కడి వారు పరమ పవిత్రమైన చెట్టుగా భావిస్తారు. ఇక ప్రస్తుతం ఆ చెట్టు కొమ్మనే తిరిగి భారత దేశానికి తీసుకువచ్చారు. చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన బౌద్ధ విశ్వవిద్యాలయం కలిగిన సాంచిలోని సలామత్‌ పూర్‌ కొండపై ఈ బోధి వృక్షాన్ని నాటారు.

దీనిని సెప్టెంబర్ 21 సెప్టెంబర్ 2012లో అప్పటి శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్స నాటారు. అది కాస్తా 15 అడుగుల మేరకు పెరిగింది. ఇది బౌద్ధమతంలో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన చెట్టు గనుక.. దీనికి ప్రత్యేకంగా రక్షణ చర్యలు చేపడుతున్నారు. బౌద్ధ మత గ్రంథాల ప్రకారం.. బుద్దుడు బోధ్ గయలోని బోధి చెట్టు కిందే జ్ఞానోదయం పొందాడు. అశోక చక్రవర్తి కూడా బోధి చెట్టు కిందే ఆశ్రయం పొందాడు. అందుకే ఈ బోధి చెట్టును అంత్యంత పటిష్ట భద్రత నడుమ సంరక్షిస్తున్నారు.

ఈ చెట్టును రక్షించేందుకు ఐదుగురు భద్రతా సిబ్బంది నిరంతరం అక్కడ కాపలా ఉంటారు. ఇక ఈ చెట్టును ప్రతీ 15 రోజులకు ఒకసారి వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీ చేసి, దాని ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తారు. అంతేకాదు. దీని మొత్తం నిర్వహణకు ప్రతి నెలా లక్షల రూపాయలు ఖర్చు అవుతోందట. 15 అడుగుల ఎత్తులో ఉన్న చెట్టు చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేశారు. దీనికి రక్షణగా ఎప్పుడూ ఐదుగురు సెక్యూరిటీ గార్డులు ఉంటారు. ఈ చెట్టు నిర్వహణ కోసం ప్రతీ సంవత్సరం 12 నుంచి 15 లక్షల రూపాయల మేర ఖర్చు అవుతుందట. కాగా, ఈ చెట్టును చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున అక్కడికి వస్తారట.