Begin typing your search above and press return to search.

తెలంగాణలో ఆ ఊరు.. తమకు తాముగాలాక్ డౌన్ విధించుకుంది

By:  Tupaki Desk   |   23 Dec 2021 5:02 PM IST
తెలంగాణలో ఆ ఊరు.. తమకు తాముగాలాక్ డౌన్ విధించుకుంది
X
కరోనా పుణ్యమా అని జన జీవితాలకు సుపరిచితంగా మారింది లాక్ డౌన్. మొదట్లో సరదాగా అనిపించినా.. లాక్ డౌన్ లాంటి వాటితో జరిగే నష్టం ఎంతన్న విషయం చాలామందికి అర్థమైంది. అందుకే.. కరోనా లాంటివి మళ్లీ రాకూడదని కోట్లాదిమంది కోరుకుంటున్నారు. అయినప్పటికీ మాయదారి కరోనా.. ఎప్పటికప్పుడు తన రూపం మార్చుకుంటే.. కొత్త వేరియంట్లతో విరుచుకుపడుతోంది. తాజాగా ఒమిక్రాన్ పేరుతో మొదలైన కొత్త వేరియంట్ సౌతాఫ్రికాలో షురూ అయి.. ఇప్పుడుప్రపంచ దేశాల్ని గడగడలాడిస్తోంది.

చూస్తుండగానే మన దేశానికి.. రెండు తెలుగు రాష్ట్రాలకు వచ్చేసింది. ఏపీతో పోలిస్తే తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు అంతకంతకూ ఎక్కువగా నమోదవుతున్నాయి. తాజాగా తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఒమిక్రాన్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇటీవల గల్ఫ్ నుంచి వచ్చిన వ్యక్తికి మూడురోజుల క్రితం ఒమిక్రాన్ అన్నది నిర్దారణ అయ్యింది. బాధితుడ్ని హైదరాబాద్ కు తరలించి చికిత్స చేస్తున్నారు.

బాధితుడి కుటుంబ సభ్యులతో పాటు మొత్తంగా 64 శాంపిల్స్ సేకరించిన వైద్యాధికారులు.. పరీక్షలకు పంపారు. ఇప్పటికే బాధితుడి తల్లికి.. భార్యకు కొవిడ్ పాజిటివ్ గా తేల్చారు కానీ.. ఒమిక్రాన్ లెక్క తేల్లేదు. దీని పరీక్షా ఫలితాలు త్వరలోనే వస్తాయని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. వీరి ఉదంతం గురించి తెలుసుకున్న గ్రామస్తులు.. పది రోజుల పాటు తమ గ్రామంతో మరెవరికి సంబంధాల్ని తెంచుకుంటూ స్వీయ లాక్ డౌన్ విధించుకున్నారు. వైరస్ ను తమ ఊళ్లోనే ఖతం చేసే ఆలోచన చేసిన ఆ గ్రామస్తుల తీరుకు పలువురు అభినందిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే వారు మరింత జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ఇలాంటి వారి విషయంలో ప్రభుత్వం తక్షణం కొన్ని పరిమితులు విధించాల్సి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.