Begin typing your search above and press return to search.

లాక్డౌన్ పై సందిగ్ధంలో కేసీఆర్?

By:  Tupaki Desk   |   2 July 2020 11:53 AM GMT
లాక్డౌన్ పై సందిగ్ధంలో కేసీఆర్?
X
తెలంగాణ అంతటా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ జోన్‌లో విపరీతంగా నమోదు కావడంపై తెలంగాణ సిఎం కేసీఆర్ చాలా ఆందోళన చెందుతున్నారు. వివిధ వర్గాల నుంచి వచ్చిన అనేక అభ్యర్థనల ఆధారంగా జీహెచ్‌ఎంసిలో లాక్‌డౌన్ విధించడంపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని ఇంతకుముందు సూచించిన కేసీఆర్ ఇప్పుడు ఆ నిర్ణయంపై సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది.

ఒక వైపు పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వం నియంత్రించలేని పరిస్థితుల్లో ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత ఐసీఎంఆర్ వంటి సంస్థలు కూడా రాబోయే రోజుల్లో కేసులు జూలైలో గరిష్ట స్థాయికి చేరుకుంటాయని హెచ్చరించాయి. ఇవన్నీ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఆయువు పట్టులా ఉన్న హైదరాబాద్ లో లాక్ డౌన్ విధిస్తే మళ్లీ మొదటికొస్తుంది. ఆదాయం కుప్పకూలుతుంది.

గత 3 నెలలుగా రాష్ట్ర ఆదాయం తీవ్రంగా ప్రభావితమైంది. లాక్ డౌన్ తో అనేక వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. లాక్డౌన్ విధించినప్పటికీ కేసులు తగ్గలేదు. హైదరాబాద్ లో మరోసారి లాక్ డౌన్ విధిస్తే పరిస్థితులు మరింత దిగజారుతాయని ప్రభుత్వం భావిస్తోంది. లాక్ డౌన్ విధిస్తే ప్రభుత్వం కరోనా కట్టడిలో విఫలమైందనే అపవాదు ప్రజల్లోకి వెళుతుంది. అంతేకాదు.. హైదరాబాద్ లో లాక్డౌన్తో రాష్ట్ర ఖజానాపై భారీగా పడుతుంది. మళ్లీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఏర్పడుతుంది. ప్రజలకు ఉపాధి లేకపోతే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే ప్రమాదం లేకపోలేదు.

ఈ కారణాలన్నీ సీఎం కేసీఆర్ యోచిస్తున్నారు. లాక్డౌన్ విధించాలా లేదా వ్యాప్తిని ఆపడానికి ప్రత్యామ్నాయ మార్గదర్శకాలను విధించాలా అనే దానిపై కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. నివేదికల ప్రకారం.. మూడు విధాలుగా లాక్ డౌన్ పై తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకటి కఠినమైన లాక్డౌన్. రెండోది హాఫ్-డే లాక్‌డౌన్.. -సగం రోజుల మినహాయింపు మూడోది ట్రాక్ ట్రీట్ టెస్ట్ (టిటిటి) మోడల్.

ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఈ రోజు తన ప్రత్యేక నివేదికను సీఎం కేసీఆర్ కు సమర్పించబోతున్నారు. నివేదిక ఆధారంగా సిఎం కేసీఆర్ ఒక నిర్ణయానికి వస్తారని తెలుస్తోంది. హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్ వచ్చినప్పటి నుండి, ఇతర మంత్రులు సిఎం కెసిఆర్ కూడా ఆందోళన చెందుతున్నారు. అందువల్ల, కేబినెట్ సమావేశం ఈసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగవచ్చు.అందులోనే హైదరాబాద్ లాక్డౌన్ పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.