Begin typing your search above and press return to search.

టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ ఇదే: ఇండియా, పాక్ ఫస్ట్ పోరు

By:  Tupaki Desk   |   17 Aug 2021 2:00 PM IST
టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ ఇదే: ఇండియా, పాక్ ఫస్ట్ పోరు
X
అక్టోబర్ నుంచి నవంబర్ వరకు జరగబోయే ప్రపంచ టీ20 కప్ కు రంగం సిద్ధమైంది. మొదటిగా ఈ టోర్నమెంట్ ను భారతదేశంలో నిర్వహించాల్సి ఉండగా.. కరోనా కారణంగా అది కాస్తా యూఏఈకి తరలించారు.

అత్యంత బయోబబుల్ నిబంధనల నడుమ ఈ టోర్నీని నిర్వహించనున్నారు. ఐపీఎల్ రెండో అంకం పూర్తికాగానే అనంతరం రెండు రోజులకు అక్టోబర్ 17 నుంచి ఈ ఐసీసీ టీ20 ప్రపంచకప్ షురూ కానుంది. నవంబర్ 14న ఫైనల్ జరుగుతుంది.

ఈ క్రమంలోనే టీంలను రెండు గ్రూపులుగా విభించారు. గ్రూప్ 1లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు తలపడుతుండగా.. గ్రూప్ 2లో ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, అప్ఘనిస్తాన్ జట్లు పోటీపడనున్నాయి. ఈ రెండు గ్రూపులలోని స్లాట్స్ కోసం రౌండ్ 1 లో గ్రూప్ఏ, గ్రూప్ బీ టీమ్స్ తలపడుతున్నాయి.

ఇక దాయాది దేశాలు భారత్-పాకిస్తాన్ జట్లు ఒకే గ్రూప్ 2లో ఉండడం సంచలనంగా మారింది. టీమిండియా, పాకిస్తాన్ మధ్య దుబాయ్ వేదికగా అక్టోబర్ 24న మ్యాచ్ జరుగబోతోంది. ఇక చిరకాల శత్రువులు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా కూడా దుబాయ్ వేదికగానే అక్టోబర్30 తలపడనున్నాయి.

ఈ టోర్నమెంట్ లో టీమిండియా ఐదు మ్యాచ్ లు ఆడనుంది. అక్టోబర్ 24వ తేదీన పాకిస్తాన్ తో మ్యాచ్ తో టీమిండియా టీ20 సంగ్రామం మొదలు కానుంది. నవంబర్ 8న గ్రూపులో చివరి మ్యాచ్ ఆడనుంది.

ఇక సెమీఫైనల్స్, ఫైనల్స్ కోసం ఈసారి రిజర్వ్ డేను ఐసీసీ ప్రకటించింది. ఈ మ్యాచ్ లన్నీ రాత్రి 7.30 గంటలకు ప్రసారం కానున్నాయి. కాగా టీ20 ప్రపంచకప్ లో తలపడ్డ ప్రతీసారి పాకిస్తాన్ పై టీమిండియానే గెలిచింది. ఈసారి ఏం జరుగుతుందనేది వేచిచూడాలి.