Begin typing your search above and press return to search.

స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ తప్పదు...పక్కా క్లారిటీ ఇచ్చిన కేంద్రం

By:  Tupaki Desk   |   23 March 2022 10:33 AM GMT
స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ తప్పదు...పక్కా క్లారిటీ ఇచ్చిన కేంద్రం
X
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాబోతోంది. ఈ విషయంలో ఎవరైనా ఇంకా డౌట్లు పెట్టుకుంటే పార్లమెంట్ లో ఉక్కు శాఖ మంత్రి రామచంద్ర ప్రసాద్ సింగ్ మాట్లాడిన మాటలు చూస్తే అన్ని మబ్బులూ తొలగిపోతాయి. ఉక్కుని మేము ప్రైవేట్ పరం చేసి తీరుతాం, ఈ విషయంలో రెండవ మాట లేదు అన్నట్లుగా ఆయన మాట్లాడారు. అంతే కాదు, విశాఖ ఉక్కు దాదాపుగా ఏడు వేల కోట్ల రూపాయల నష్టంలో ఉందని కూడా కేంద్ర మంత్రి చెప్పడం విశేషం.

ఇక విశాఖ ఉక్కు ఉత్పాదకత తక్కువ అని కూడా మరో సరికొత్త పాయింట్ ఒకటి చెప్పుకొచ్చారు. విశాఖ ఉక్కు విషయంలో సొంత గనులు సమస్య కాదని నష్టాలకు అనేక కారణాలు ఉన్నాయని కూడా చెప్పడం విశేషం. ఇక సొంత గనులు లేని సందర్భాల్లో కూడా విశాఖ ఉక్కు గతంలో లాభాలు గడించిందని ఆయన గుర్తు చేస్తూ ఇపుడు అలాంటి పరిస్థితి అయితే లేదని పేర్కొనడంతో విశాఖ ఉక్కు కచ్చితంగా వద్య శిల మీదకు వెళ్ళిపోయినట్లే అంటున్నారు.

ఇక కేంద్ర ఉక్కు మంత్రి మరో మాట కూడా చెప్పారు. విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేసే విషయంలో చాలా ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అంటే ఒక విధంగా కేంద్రం పక్కా డెసిషన్ తీసుకుందని ఆయన చెప్పారన్న మాట. ఈ నేపధ్యంలో విశాఖ ఉక్కు విషయంలో ఎవరెన్ని చెప్పినా కేంద్రం ఇక పరిగణనలోకి తీసుకునే ప్రసక్తి ఉండదని కూడా కేంద్ర మంత్రి భావనగా అర్ధం చేసుకోవాలి.

ఇదిలా ఉండగా విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం అవుతోందన్న ఆందోళన అంతటా వ్యక్తం అవుతున్న నేపధ్యంలో నిన్నటికి నిన్న వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి ఢిల్లీలో మాట్లాడుతూ మొత్తం 120 మంది ఎంపీల లేఖలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించి ప్రధానికి అందచేస్తామని చెప్పుకొచ్చారు. ఆయన అలా అన్నారో లేదో ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే కేంద్ర ఉక్కు మంత్రి తమ ప్రభుత్వ విధానం ఇదే అని చెప్పేశారు.

ఇక్కడ మరో విషయం కూడా ఉంది. అదేంటి అంటే ఇప్పటిదాకా విడివిడిగానే టీడీపీ, వైసీపీ ఎంపీలు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి పార్లమెంట్ లో ప్రస్థావిస్తూ వచ్చాయి. కానీ ఫస్ట్ టైం టీడీపీ ఎంపీలు కేశినేని నాని, కింజరాపు ఎర్రన్నాయుడు విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయవద్దు అని కేంద్రాన్ని కోరితే వారికి మద్దతుగా రాజమండ్రీ వైసీపీ ఎంపీ మార్గాని భరత్ కూడా గొంతు కలిపారు.

ఇలా ఏపీకి చెందిన రెండు బలమైన పార్టీలు ఒక్కటిగా నిలిచి ఉక్కుని ప్రైవేట్ పరం చేయవద్దు అని కోరినా కూడా కేంద్ర మంత్రి కూడా అది కాదు, కుదరదు అని స్పష్టం చేయడం బట్టి చూస్తూంటే ఇక విశాఖ ఉక్కు మీద ఆశలు అన్నీ వదిలేసుకోవాల్సిందే అని అర్ధమవుతోంది. మరో వైపు ఇప్పటికి నాలుగు వందల రోజుల పాటు కార్మికులు ఉక్కుని కాపాడుకునేందుకు ఉద్యమిస్తున్నారు. ఈ నెల 28న విశాఖ బంద్ కి కూడా వారు పిలుపు ఇచ్చారు.

ఇవన్నీ ఇలా ఉంటే కేంద్రం మాత్రం ప్రైవేట్ పరం చేస్తేనే విశాఖ ఉక్కు కర్మాగారం బాగుపడుతోంది అంటోంది. మొత్తానికి ఇదంతా చూస్తూంటే విశాఖ ఉక్కు ఉసురు తీసే విధంగానే కధ సాగుతోంది అనుకోవాలి. మరి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఇంత కీలక దశకు చేరాక ఆపడం ఎవరి తరం అన్న చర్చ కూడా వస్తోంది. కేంద్రం ఒక పాలసీగా పెట్టుకుని మరీ విశాఖ ఉక్కు సహా అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ కి అప్పగిస్తోంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదం ఇపుడు కరిగిపోయిన కలగా మారుతోంది.