Begin typing your search above and press return to search.

మున్సిపల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ఎన్నికల సంఘం !

By:  Tupaki Desk   |   8 Jan 2020 6:34 AM GMT
మున్సిపల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పిన  రాష్ట్ర ఎన్నికల సంఘం !
X
తెలంగాణా లో మున్సిపల్ ఎన్నికల గంట మోగింది. ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంతో అందరూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఎవరు ఈ ఎన్నికలలో పోటీ చేయడానికి అర్హులు , ఎవరు అనర్హులు అంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు విడుదల చేసింది. సాధారణంగా ఇప్పటివరకు ఇద్దరు పిల్లలకు మించి సంతానం ఉంటే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హత ఉండేది. కొత్త మున్సిపల్‌ చట్టం ప్రకారం ఈ నిబంధనను ఎత్తి వేశారు. దీంతో ఎంతమంది సంతానం ఉన్నా ఈ ఎన్నికల్లో పోటీ చేయొచ్చు.

ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు, సాగునీటి వినియోగ దారుల సంఘం సభ్యులు, అంగన్‌వాడీ వర్కర్లు, దేవాలయాలు, మత సంస్థల చైర్మన్లు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. టీఎస్‌ ఆర్టీసీ, సింగరేణి కాలరీస్‌ ఉద్యోగుల్లో మేనేజింగ్‌ ఏజెంట్లు, మేనేజర్, సెక్రటరీలు మినహా మిగిలినవారు పోటీ చేయొచ్చు. క్రిమినల్‌ కోర్టు దోషిగా నిర్ధారించిన వ్యక్తి, శిక్ష ఖరారైన రోజు నుంచి ఐదేళ్ల వరకు స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు అనర్హుడు అని తెలిపింది. ఒక కోర్టు దోషిగా నిర్ధారించిన తర్వాత సదరు వ్యక్తి పై కోర్టులో అప్పీల్‌ చేసిన సందర్భం లో స్టే ఇవ్వకుండా.. బెయిల్‌ పై విడుదలైనప్పటికీ పోటీ చేయడానికి అవకాశం లేదు అంటూ తెలిపింది. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కాంట్రాక్ట్‌లు చేస్తున్నవారు కూడా స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదు.

ఇక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు చెల్లించాల్సిన ధరావత్తును ఎస్‌ ఈసీ ఖరారు చేసింది. గ్రేటర్, కార్పొరేషన్‌ తోపాటు మున్సిపల్‌ వార్డు స్థానానికి పోటీ చేసే జనరల్‌ అభ్యర్థులు రూ.2,500 ఎస్‌ ఈసీ పేరిట డీడీ తీసుకోవాలి. వార్డు స్థానాలకు పోటీచేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1,250 చెల్లించాలి అని వెల్లడించారు. ఇక గ్రేటర్‌ హైదరాబాద్, గ్రేటర్‌ వరంగల్, గ్రేటర్‌ ఖమ్మంలలోని డివిజన్లలో అభ్యర్థుల ప్రచార వ్యయాన్ని రూ.5 లక్షలకు పరిమితం చేశారు. మిగతా కార్పొరేషన్ల లో రూ.1.50 లక్షలు, మున్సిపాలిటీ ల్లో రూ.లక్ష వరకు ప్రచారం కోసం ఖర్చు చేసుకోవచ్చు అని ఎస్ ఈసీ తెలిపింది. అలాగే ఎన్నికల నియమావళి లో తెలిపిన నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు.