Begin typing your search above and press return to search.

సైన్స్ కి చిక్కని అద్భుతం ... స్వరాలను పలికే మెట్లు,ఐరావతేశ్వర ఆలయం విశిష్టత !

By:  Tupaki Desk   |   11 March 2021 7:00 AM IST
సైన్స్ కి చిక్కని అద్భుతం ...  స్వరాలను పలికే మెట్లు,ఐరావతేశ్వర ఆలయం విశిష్టత  !
X
భారతదేశంలో సంప్రదాయలకు ఎక్కువ విలువనిస్తుంటారు.ముఖ్యంగా హిందుమతానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. సంప్రదాయాలకు ముఖ్యంగా పట్టుకొమ్మవంటివి దేవాలయాలు. ఉత్తర, దక్షిణ భారతదేశంలో రెండు వేరువేరు రకాల శైలిలో దేవాలయాల నిర్మాణ జరిగింది. ముఖ్యంగా దక్షిణ భారతదేశ దేవాలయాల రూపకల్పన ద్రవిడ శైలిలో ఉంటుంది. అందుకే ఇక్కడ ఆలయాలను చూసేందుకు ఏటా వేల సంఖ్యలో భక్తులు, సందర్శకులు తరలివస్తుంటారు. దక్షిణ భారతదేశంలోని దేవాలయాలు ద్రవిడ, విజయనగర శైలి నిర్మాణానికి ప్రసిద్ధి చెందాయి. అందులోనూ ఎక్కువగా దేవాలయాలను ఇసుకరాయి, సబ్బు రాయి మరియు గ్రానైట్‌ తో నిర్మించారు. ఇక్కడి దేవాలయాలు అందమైనవి మాత్రమే కాదు, ఆధ్యాత్మిక, ఇతిహాస గాథాలను కూడా ప్రస్ఫూటకరిస్తాయి.

చోళరాజుల ప్రసిద్ధ నిర్మాణాల్లో ఒకటి శ్రీ ఐరావతేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం దారాసురంలో ఉంది. ఇక్కడి శివుని పేరు ఐరావతేశ్వరుడు. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో చోళులు నిర్మించారు. ఇప్పటికీ నిత్యం దూప, ధీప నైవేద్యాలు జరుగుతున్న దేవాలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయంలోని మెట్లు సంగీతాన్ని వినిపించడం విశేషం. తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలో దారాసురం అనే పట్టణంలో ఈ ఆలయం ఉంటుంది. ఈ దేవాలయ ప్రవేశానికి రాళ్లతో చేసిన మెట్లు ఉన్నాయి. వీటిపై తడితే ఏడు రకాల శబ్ధాలు వినిపిస్తాయి. మెట్లలోని వివిధ పాయింట్ల వద్ద ఈ ఏడు స్వరాలను వినవచ్చు. అయితే , ఇవి స్వరాలను ఎలా పలుకుతున్నాయనేది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే..

యమ ధర్మ రాజుకి ఓ యోగి ఇచ్చిన శాపంతో శరీరం అంతా మంటపుడుతున్నట్లు ఇబ్బంది పడుతుంటే.. అప్పుడు ఈ ఆలయంలో ఉన్న పవిత్ర కోనేరులో మునిగి శాపం విమోచనం పొందినట్లు భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకనే ఇక్కడ ఉన్న పుష్కరిణికి యమతీర్ధం అనే పేరు వచ్చింది.ఈ ఆలయ స్థల పురాణం గురించి ఒకసారి చూస్తే .. ఐరావతం దుర్వాస మహాముని కోపానికి గురై శాపం తో తెలుపు రంగుని కోల్పోయింది. అప్పుడు ఈ ఆలయంలోని శివుడిని ఆరాధించి అక్కడ ఉన్న కోనేరులో స్నానమాచరించగా పూర్వపు రంగైన తెలుపు రంగుని పొందినట్లు పురాణాల్లో ఉంది. అందుకనే అప్పటి నుంచి ఈ ఆలయంలో ఉన్న శివుడిని ఐరావతేశ్వరాలయం అని పిలుస్తారని స్థల పురాణం చెప్తుంది.