Begin typing your search above and press return to search.

లోక్ సభ స్పీకర్ అంతలా హర్ట్ అయ్యారా?

By:  Tupaki Desk   |   5 March 2020 6:30 AM GMT
లోక్ సభ స్పీకర్ అంతలా హర్ట్ అయ్యారా?
X
పార్లమెంటులో ఊహకు అందని రీతిలో పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే. విపక్షాలకు చెందిన ఎంపీలు వ్యవహరిస్తున్న తీరుపై లోక్ సభ స్పీకర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తానెంత చెప్పినా.. వారు వ్యవహరిస్తున్న తీరుతో ఆయన హర్ట్ అయ్యారు. తనదైన శైలిలో గాంధీగిరి మొదలు పెట్టిన వైనం విపక్ష ఎంపీలు ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేస్తోంది.

స్పీకర్ కుర్చీలో కూర్చున్న వారు.. అధికార.. విపక్షాలకు అతీతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. దానికి తగ్గట్లే స్పీకర్ ఓం బిర్లా వ్యవహరిస్తూ తక్కువ వ్యవధిలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. అయినప్పటికీ తన మాటకు విలువ ఇవ్వకుండా బేఖాతరు చేస్తున్న రీతిలో సభ్యులు వ్యవహరిస్తున్న తీరుతో ఆయన తీవ్రమైన మనస్తాపానికి గురయ్యారు. తన మాటను లక్ష్య పెట్టని ఎంపీలకు తన వ్యవహారశైలితో షాకిస్తున్నారు.

వెల్ లోకి దూసుకెళ్లటం.. తోపులాటలు.. నెట్టుకోవటాలు లాంటి వాటిని తీవ్రంగా పరిగణించిన ఆయన.. సభా కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయారు. ఎప్పటిలానే తన ఛాంబర్ కు వచ్చిన ఆయన లోక్ సభకు మాత్రం రాలేదు. గడిచిన రెండు రోజులుగా పార్లమెంటుకు వస్తున్నా.. లోక్ సభకు మాత్రం రాకుండా తన ఆఫీసులోనే ఉండిపోవటం ఆసక్తికరంగా మారింది.

స్పీకర్ సభకు హాజరు కాకపోవటం వెనుక కారణం తెలుసుకునేందుకు పలువురు ఎంపీలు ఎవరికి వారు ఆయన వద్దకు వెళ్లారు. సభకు రాకపోవటంపై ఆరా తీయగా.. తనకున్న అభ్యంతరాల్ని వారి ముందు పెట్టినట్లుగా తెలుస్తోంది. స్పీకర్ మాటలతో సదరు ఎంపీలు షాక్ తిన్నారని చెబుతున్నారు. సభను నిర్వహించే విషయంపై విపరీతమైన ఆసక్తిని చూపించే స్పీకర్.. ఎంత హర్ట్ అయితే సభా కార్యక్రమాలకు దూరంగా ఉంటారో అర్థం చేసుకోవచ్చని ఓం బిర్లా సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నాయి. స్పీకర్ వారి గాంధీగిరి ఎంపీల్లో ఎంతమేర మార్పు తెస్తుందో చూడాలి.