Begin typing your search above and press return to search.

చేగువేరా ను కాల్చి చంపిన సైనికుడు మృతి.. కారణం ఇదే!

By:  Tupaki Desk   |   12 March 2022 4:04 AM GMT
చేగువేరా ను కాల్చి చంపిన సైనికుడు మృతి.. కారణం ఇదే!
X
చేగువేరా.. ప్రపంచంలో చాలా మందికి పరిచయం అక్కర్లేని పేరు. ఓ మనిషి చేసిన పనులు అతడ్ని ఎన్నో ఏళ్ల పాటు బతికిస్తాయి అనేందుకు చేగువేరానే సాక్ష్యం. నిజం చెప్పాలి అంటే ఓ వర్గానికి ఓ వ్యక్తి ఆదర్శంగా నిలవడం అనేది చాలా అసాధారణం అయిన విషయం. కానీ కార్మికులైన ప్రజలకు చేగువేరా ఆదర్శం. ఇప్పటికీ ఆయన్ని స్మరించే వారు చాలా మంది ఉంటారు.

సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ వర్గాల్లో ఉన్న దోపిడికి ఎదురు నిలిచిన వ్యక్తి చేగువేరా. ఆ కార్మిక ప్రజలను ఉన్నత వర్గాల దోపిడీ నుంచి విడుదల చేయాలని తాను బతికి ఉన్నంత కాలం ఆలోచించే వారు. ప్రపంచ స్థాయిలో కష్ట జీవుల పోరాటాలకు కొత్త భాష్యం చెప్పిన వ్యక్తి చేగువేరా. ఈ పోరాటానికి సరైన మార్గం గెరిల్లా సాయుధ పోరాటమే అని భావించాడు. ఇందుకు తగ్గట్టుగానే బొలీవియా శత్రు బలగాలతో పోరాటం మొదలు పెట్టాడు. బొలీవియా సైనిక నియంతకు ఓ విధంగా కొద్ది రోజుల్లోనే చుక్కలు చూపించాడు. కానీ అనుకోని కొన్ని పరిస్థితుల్లో శత్రు సేనలకు చిక్కి వీర మరణం పొందారు.

అయితే ఈ విప్లవ యోధుడు చేగువేరాను ఓ సైనికుడు కాల్చి చంపారు అని బొలీవియా చెప్పుకొచ్చింది. అయితే చే ను కాల్చి చంపిన ఆ దేశ సైనికుడు ప్రస్తుతం చనిపోయినట్లు తెలుస్తోంది. అతని పేరు మారియో టెరాన్ సలాజర్. ఈ బొలివియా కు చెందిన సైనికుడు చేగువేరాను కాల్చి చంపినట్లు చెప్తారు. అయితే ఆ వ్యక్తి గురువారం చనిపోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. బొలీవియా సైనిక నియంత పై పోరాటం చేస్తున్న సమయంలోనే మారియో టెరాన్ సలాజర్ అనే సైనికుడు 9 అక్టోబరు 1967న బొలీవియాలోని తూర్పు శాంటా క్రజ్ ప్రాంతంలో చేగువేరాను కాల్చిచంపాడు.

చేగువేరా చనిపోయే ముందుగా బొలివియా సైనికులు అతన్ని బంధించారు. చేగువేరా ను పట్టించడానికి కొందరు బొలీవియా కు సహాయపడ్డారనే చెప్పాలి. దీనిలో అమెరికా గూఢచార సంస్థ సీఐఏ ది ప్రధాన పాత్ర అని చాలా మంది చెప్తారు. ఆ తర్వాత క్యూబాకు చెందిన కొందరు ఏజెంట్లు కూడా దీనిలో భాగమైనారు అని కూడా అంటారు. ఇలా వీరు చేసిన సహాయం కారణంగా చేగువేరా వారికి చిక్కినట్లు ఈ వృత్తాంతం అంతా తెలిసిన బొలీవియన్ మాజీ సైనికుడు గ్యారీ ప్రాడో చెప్పారు.

ఇక్కడ ఆయన చెప్పిన మరో విషయం ఏంటంటే చేగువేరా బొలీవియా సైన్యాన్నికి పడ్డుబడే సమయంలో ఆయన తీవ్రమైన ఆనారోగ్యంతో ఉన్నట్లు పేర్కొన్నారు. అందుకే ఆ సమయంలో ఆయన సైనికులకు దొరికినట్లు చెప్పుకొచ్చారు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని చంపడం అనేది భావ్యం కాదని భావించినా... కానీ ఆ దేశ అధ్యక్షుడు ఆదేశాల ప్రకారం చేగువేరా ను చంపాల్సి వచ్చింది అంటూ అప్పటి సైనికులు చెప్పారు. దీంతో మారియో టెరాన్ సలాజర్ చే ను కాల్చి చంపినట్లు పేర్కొన్నారు.

ఇలా చేగువేరాను చంపిన మారియో టెరాన్ సలాజర్ కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా 80 ఏళ్ల వయసులో చనిపోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కానీ ఆయన చనిపోయిన విషయం పై సంబంధిత ఆసుపత్రి వర్గాలు మాత్రం స్పందించలేదు.