Begin typing your search above and press return to search.

ఆ ముగ్గురు షార్ట్ లిస్టు.. పీసీసీ పీఠం దక్కేదెవరికి?

By:  Tupaki Desk   |   13 Dec 2020 11:20 AM IST
ఆ ముగ్గురు షార్ట్ లిస్టు.. పీసీసీ పీఠం దక్కేదెవరికి?
X
పవర్ లేకున్నా..పార్టీ చీఫ్ పదవి కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న పోటీ తెలిసిందే. ఇప్పటికే వరుస దెబ్బలతో బేజారెత్తిన పార్టీని బతికించేందుకు సరైన నాయకుడి కోసం పార్టీ పెద్ద ఎత్తున వెతుకుతోంది. ఇందుకోసంభారీ ఎత్తున వడబోతను అభిప్రాయ సేకరణ రూపంలో నిర్వహించటం తెలిసిందే. రోజుల తరబడి..కాంగ్రెస్ సీనియర్ నేతలతో పాటు.. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పార్టీ జిల్లాఅధ్యక్షులతో భేటీ అయిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల బాధ్యుడు మాణిక్యం ఠాకూర్.. ఎట్టకేలకు మూడు పేర్లను షార్ట్ లిస్టు చేసినట్లుగా తెలుస్తోంది.

టీపీసీసీ చీఫ్ పదవి కోసం మూడు పేర్లను ఫైనల్ చేసి అధిష్ఠానానికి చేరవేసినట్లుగా తెలుస్తోంది. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరంటే..పార్టీ ఎంపీలు రేవంత్.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. మాజీ మంత్రి శ్రీధర్ బాబు. దూకుడుగా వ్యవహరించటం.. ఇచ్చిన టాస్కును పూర్తి చేయటం కోసం దేనికైనా రెఢీ అన్నట్లుగా వ్యవహరించే గుణం రేవంత్ లో ఎక్కువ. అయితే.. పార్టీలో ఈ మధ్యనే చేరటం ఆయనకున్న మైనస్. అదే విషయంలో కోమటిరెడ్డికి ప్లస్ గా ఉంది. అయితే.. రేవంత్ మాదిరి దూకుడుగా పార్టీని నడిపే గుణం తక్కువని చెబుతారు. అయితే.. పార్టీలో రేవంత్ మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నట్లుగా తెలుస్తోంది.

రేవంత్ ను అధ్యక్షుడిగా ఎంపిక చేస్తే.. పార్టీలో చీలిక రావొచ్చని చెబుతున్నారు. అదే సమయంలో కోమటిరెడ్డిని అధ్యక్షుడిగా ఎంపికచేస్తే.. ఆయన ఆ పదవిని సరిగా హ్యాండిల్ చేయగలరా? అన్నది క్వశ్చన్ గా మారింది. ఇక.. ఈ ఇద్దరు నేతలకు మధ్యే మార్గంగా దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉన్నారు. మరి.. ఈ ముగ్గురిలో కాంగ్రెస్ అధినాయకత్వం ఎవరిని ఎంపిక చేస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. పార్టీ నేతలు అత్యధికులు ప్రతిపాదించిన వ్యక్తికే పీసీసీ పీఠం కట్టబెట్టాలన్న ప్రచారం సాగుతోంది. మరి.. పార్టీ అధిష్ఠానం ఏం చేస్తుందో చూడాలి.