Begin typing your search above and press return to search.

అమరావతి ఏడేళ్ల ప్రయాణం@ 2014 టు 2021

By:  Tupaki Desk   |   23 Nov 2021 7:30 AM GMT
అమరావతి ఏడేళ్ల ప్రయాణం@ 2014 టు 2021
X
ఆరంభం నుంచి ఇప్పటివరకు చోటు చేసుకున్న అన్ని పరిణామాలు ఆసక్తికరమే కాదు సంచలనం కూడా. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీకి లేని రాజధానిని ఏర్పాటు చేసేందుకు జరిగిన కసరత్తు.. ఆ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు ఒక ఎత్తు అయితే.. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోచారిత్రక గెలుపుతో అధికారిక పగ్గాలు చేపట్టిన జగన్.. అమరావతి విషయంలో తీసుకున్న షాకింగ్ నిర్ణయం పెను మలుపునకు కారణమైంది.

కట్ చేస్తే.. ఎన్నో పరిణామాల అనంతరం.. తాజాగా తాము తీసుకొచ్చిన మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్న వైనం మరింత షాకింగ్ గా మారింది. ఒకసారి ఒక నిర్ణయాన్ని తీసుకుంటే.. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకోవటమన్నది ఉండన్న మాటను అదే పనిగా చెప్పటం తెలిసిందే.

అందుకు భిన్నంగా తాజా నిర్ణయం వెలువడటం విశేషం. 2014లో మొదలైన అమరావతి కథ ఎన్నో మలుపులు తిరిగి.. ఏడేళ్ల అనంతరం మరో కీలక మలుపు తిరిగింది. మరి.. ఈ ఏడేళ్లలో అమరావతిప్రస్థానంలో ఏమేం జరిగాయి? కీలక అంశాలు ఏమేం ఉన్నాయన్నది చూస్తే..

2014లో..

రాష్ట్ర విభజన నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ.. బీజేపీ.. జనసేన పార్టీలు ఉమ్మడిగా కలిసి ఒక జట్టుగా పోటీ చేసి విజయాన్ని సాధించాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఏపీ రాజధాని ఏర్పాటు మీద ప్రత్యేక శ్రద్ధ వహించారు. ప్రపంచ స్థాయి రాజధాని నగరంగా ఏపీ రాజధానిని తీర్చి దిద్దుతానని చెప్పారు. అధికారంలోకి వచ్చిన దాదాపు ఆర్నెల్ల తర్వాత రాజధానికి సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది.

సెప్టెంబరు 3: రాజధాని అమరావతి ప్రాంతాన్ని నిర్ణయిస్తూ అసెంబ్లీలో తీర్మానం

డిసెంబరు 23: సీఆర్డీఏ చట్టాన్ని ఆమోదించిన ఏపీ అసెంబ్లీ

డిసెంబరు 30: చట్టంలో పేర్కొన్నట్లే సీఆర్డీఏను ఏర్పాటు చేసి.. 7317 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కేపిటల్ రీజియన్ ను.. 217.23 చదరపుకిలోమీటర్లలో రాజధాని నగరాన్ని నోటిఫై చేసిన ఏపీ సర్కారు

2015లో..

రాజధాని నిర్మాణానికి అవసరమైన భూమిని ఎంపిక చేయటం.. దానిని రైతుల వద్ద నుంచి తీసుకోవాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. నాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రాజధాని పరిధిలోని రైతులు స్పందించారు. అమరావతి భావనకు ఒక దారి ఏర్పడింది.

ఫిబ్రవరి 28: రెండు నెలల వ్యవధిలో అమరావతి ప్రాంతానికి చెందిన 20,510మంది రైతులు 32,469 ఎకరాలను ప్రభుత్వానికి ఇచ్చేశారు.

అక్టోబరు 22: ఉద్ధండరాయునిపాలెం వద్ద రాజధాని నిర్మణానికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన. ఈ కార్యక్రమానికి పలువురు అతిధులతోపాటు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

2016లో

ఏపీ రాజధానిగా అమరావతిని డిసైడ్ చేయటం.. అందుకు కీలకమైన భూసేకరణ వాయువేగంతో పూర్తి చేయటం.. విధివిధానాల్ని ఖరారు చేయటంతో పాటు.. రాజధాని ప్రాంతంలోరోడ్లతో పాలుకీలక నిర్మాణాల్ని షురూ చేయటం ప్రారంభమైంది.

ఏప్రిల్ 25: వెలగపూడి సచివాలయం ప్రారంభం

జూన్ 6: సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు లాటరీ ద్వారా స్థలాల కేటాయింపు. తొలుత నేలపాడు గ్రామంతో షురూ చేశారు.

అక్టోబరు 28: ఆడ్మినిస్ట్రేటివ్ సిటీని అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో ప్రారంభం.

2017లో

రాజధాని అమరావతి నగరానికి సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల నాటికి రాజధాని అమరావతిని ఒక కొలిక్కి తీసుకురావాలన్న యోచనలో చంద్రబాబు ప్రభుత్వం పని చేస్తోంది. అందుకు కొన్ని ఆటంకాలు ఎదురైనా.. అమరావతిని ప్రచారాంశంగా ఎన్నికల్లో ప్రస్తావించటం ద్వారా మైలేజీ పొందాలన్న యోచనలో చంద్రబాబు సర్కారు ఉంది. అందుకు తగ్గట్లే అక్కడి పనులు వేగంగా సాగాయి.

మార్చి 2: వెలగపూడిలో అసెంబ్లీ భవనాన్ని నాటి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం
డిసెంబరు 27: రాజధాని నగరమైన అమరావతిని సందర్శించిన రాష్ట్రపతి కోవింద్

2018లో

ఏపీ రాజధానిగా అమరావతిని డిసైడ్ చేసిన నాటి నుంచి ప్రతి ఏడాది ఏదో ఒక ప్రత్యేకమైన ఈవెంట్ ఒకటి జరిగేది. అందుకు భిన్నంగా 2018లో మాత్రం ఎలాంటి ప్రారంభోత్సవాలు చోటు చేసుకోలేదు. దీనికి కారణం నిర్మాణాలు పూర్తి కాకపోవటమే. ఎంత వేగంగా పనులు పూర్తి చేయాలనుకున్నా.. అందుకు తగ్గట్లు జరగకపోవటంతో.. 2018లో ఎలాంటి ప్రారంభోత్సవాలు జరగలేదు. కాకుంటే.. అప్పటివరకు ప్రారంభించిన అన్ని కూడా తాత్కాలికం అనే మాటను సీఎం చంద్రబాబు తరచూ చెప్పటం ప్రజల్లో విమర్శలకు తావిచ్చింది. ఇన్నేసి కోట్లు ఖర్చుచేసి.. తాత్కాలికం అయితే.. శాశ్వితం ఎప్పటికన్న ప్రశ్న మొదలైంది.

2019లో

అనూహ్య పరిణామాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. ఈ ఏడాది ఆరంభంలో చంద్రబాబు ప్రభుత్వం ఉంటే.. ఏడాది మధ్యకు వచ్చేసరికి జగన్ ముఖ్యమంత్రి కావటం.. రాజధాని అమరావతిపై కొత్త అనుమానాలు.. సందేహాలకు తెర లేచింది. అమరావతిని రాజధాని నగరంగా కొనసాగించే ఆలోచన జగన్ సర్కారుకు లేదన్న ప్రచారం అంతకంతకూ పెరిగిపెద్దది కావటమే కాదు.. ఏడాది చివర్లో సీఎం జగన్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు.

ఫిబ్రవరి 3: జ్యుడిషియల్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా అప్పటి సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయ్ చేతుల మీదుగా ప్రారంభం.

డిసెంబరు 17: అమరావతికి బదులుగా మూడు రాజధానుల ప్రతిపాదనను అసెంబ్లీలో సీఎం జగన్ చేశారు
డిసెంబరు 18: సీఎం జగన్ ప్రకటనకు నిరసనగా ఉద్యమాన్ని షురూ చేసిన రాజధాని రైతులు

2020లో

ఏపీ రాజధానిగా నిర్ణయించిన అమరావతి కోసం వేలాది ఎకరాలు ఇచ్చిన రైతులు ఒక్కసారిగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో షాక్ తిన్నారు. మూడు ప్రాంతాల్ని సమంగా చూడాలన్న పేరుతో మొదలైన మూడు రాజధానుల కాన్సెప్టు కొత్త గందరగోళానికి తెర తీయటమే కాదు.. లేనిపోని సమస్యలకు.. రాజధాని నగరాన్ని నిర్మించాలన్న ఆలోచనకు దెబ్బ తీస్తుందన్న ప్రచారానికి తగ్గట్లే పరిణామలు చోటు చేసుకున్నాయి.

జనవరి 3: మూడు రాజధానుల్ని సిఫార్సు చేస్తూ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక
జనవరి 20: మూడు రాజధానుల నిర్ణయానికి నిరసనగా అసెంబ్లీకి చేరుకున్న రైతులపై లాఠీ ఛార్జి. మూడు రాజధానులు.. సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లుల్ని ఆమోదించిన ఏపీ అసెంబ్లీ.

ఫిబ్రవరి 10: ఏ పద్దతిని ఫాలో కావాలో.. అదేమీ పాటించని కారణంగా బిల్లుల్నిసెలక్ట్ కమిటీకి పంపలేనని మండలి ఛైర్మన్ కు తిప్పి పంపిన ఇన్ ఛార్జి సెక్రటరీ.

జూన్ 16: రెండు బిల్లుల్ని మళ్లీ అసెంబ్లీలో ప్రవేశ పెట్టి ఆమోదం పొందిన ప్రభుత్వం
జూన్ 17: శాసన మండలిలో టీడీపీ ఆందోళనతో చర్చకు నోచుకోని బిల్లులు
జులై 31: బిల్లులకు ఆమోదముద్ర వేసిన గవర్నర్.

అనంతరం రాజధాని రైతులతోపాటు.. పలువురు ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. న్యాయవివాదం పూర్తి అయ్యాక.. ప్రభుత్వం అనుకున్న ప్రకారం మూడు రాజధానుల ఏర్పాటు చేయాలని భావించారు. అందుకు తగ్గట్లు గ్రౌండ్ వర్కును స్పీడప్ చేయసాగారు.

నవంబరు 1: రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో తుళ్లూరు నుంచి తిరుమలకు మహాపాదయాత్ర ప్రారంభం.

నవంబరు 22: కొత్త బిల్లుల్ని తీసుకొస్తామంటూ ఇప్పటికే తాము చేసిన మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లుగా చెప్పి సంచలనంగా మారింది ఏపీ సీఎం జగన్ ప్రకటన.