Begin typing your search above and press return to search.

రాహుల్ కోసం ఆ జట్టు రూ.16 కోట్లు ... పంజాబ్‌ కింగ్స్‌ సంచలన నిర్ణయం

By:  Tupaki Desk   |   27 Nov 2021 6:48 AM GMT
రాహుల్ కోసం ఆ జట్టు రూ.16 కోట్లు ... పంజాబ్‌ కింగ్స్‌ సంచలన నిర్ణయం
X
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్, పంజాబ్ కింగ్స్‌ తో తెగదెంపులు చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. లీగ్‌ లోకి కొత్తగా రెండు జట్లు రావడంతో మెగా వేలం నిర్వహణ అనివార్యమైంది.

ఈ నేపథ్యంలోనే పంజాబ్‌ ను వీడేందుకు సిద్దమైన కేఎల్ రాహుల్, సంజీవ్ గోయెంకాకు చెందిన లక్నో ఫ్రాంచైజీ తో ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. వచ్చే సీజన్‌ లో లక్నో టీమ్‌ ను రాహులే నడిపించనున్నాడని వార్తలు వస్తున్నాయి.

ఇక ఐపీఎల్‌-2021లోనూ పంజాబ్‌ కింగ్స్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆడిన 14 మ్యాచ్‌లలో ఆరింటిలో గెలిచినప్పటికీ నాకౌట్‌ దశకు చేరకుండానే లీగ్‌ నుంచి నిష్క్రమించింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ 13 ఇన్నింగ్స్‌లో 626 పరుగులు సాధించి బ్యాటర్‌గా అద్భుతంగా రాణించినప్పటికీ.. జట్టును విజేతగా నిలపాలన్న అతడి కోరిక మాత్రం నెరవేరలేదు.

ఇక ఐపీఎల్‌ 2022 మెగా వేలానికి సమయం ఆసన్నమవుతున్న తరుణంలో రాహుల్‌ పంజాబ్‌ను వీడటం ఖాయమని.. కొత్త ఫ్రాంఛైజీ లక్నోకు అతడు కెప్టెన్‌ గా వ్యవహరించబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఒకవేళ రాహుల్‌ పంజాబ్‌ను వీడితే ఆ జట్టుకు నిజంగా పెద్ద షాకే. ఈ నేపథ్యంలో పంజాబ్‌ కింగ్స్‌ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒక్క ఆటగాడిని కూడా రీటైన్‌ చేసుకోకూడదని ఫ్రాంఛైజీ నిర్ణయించుకుందట. పూర్తిగా కొత్త జట్టుతో ఐపీఎల్‌ 2022 బరిలో దిగాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.

తొలుత.. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, రవి బిష్ణోయి, అర్ష్‌దీప్‌ సింగ్‌ను రీటైన్‌ చేసుకోవాలని భావించినా.. రాహుల్‌ అందుకు సుముఖంగా లేకపోవడంతో ఏ ఒక్క ఆటగాడిని కూడా రీటైన్‌ చేసుకునేందుకు ఇష్టపడటం లేదని తెలుస్తోంది.

కేఎల్‌ రాహుల్‌ జట్టును వీడనుండటంతో పంజాబ్‌ ఒకవేళ మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ను రీటైన్‌ చేసుకోవాలని భావించినా.. బీసీసీఐ నిబంధనల కోసం మొదటి రిటెన్షన్‌ కోసం 16 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. నిజానికి మయాంక్‌ను కేవలం కోటి రూపాయలకు మాత్రమే ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది.

అలాంటపుడు అతడి కోసం ఏకంగా భారీ మొత్తం ఖర్చు చేయడం వృథా ప్రయాసే అవుతుందనే భావనలో యాజమాన్యం ఉండటం సహజం. మయాంక్‌ అగర్వాల్‌ వ్యక్తిగత ప్రదర్శన బాగానే (12 ఇన్నింగ్స్‌లో 441 పరుగులు) బాగానే ఉన్నప్పటికీ మరీ ఈ స్థాయిలో ఖర్చు పెట్టడానికి సుముఖంగా లేనట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో జట్టు మొత్తాన్నే మార్చేసేందుకు పంజాబ్‌ ఫ్రాంఛైజీ యాజమాన్యం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాహుల్ కోసం ఎన్ని కోట్లు పోయడానికైనా లక్నో సిద్ధంగా ఉంది. రిటెన్షన్ జాబితాలో లేని ఆటగాళ్ల నుంచి ముగ్గురిని ఎంచుకునే అవకాశం కొత్త జట్లకు కల్పించింది.

ఈ ప్రక్రియను డిసెంబర్ తొలి వారంలో పూర్తి చేయాలని చెప్పింది. అయితే పాత ఫ్రాంచైజీలో కొనసాగాలా, లేక వేలంలో వెళ్లాలా, అనేది ఆటగాళ్లకే వదిలేసింది. దాంతో కొత్త జట్లు టీమిండియా స్టార్ ఆటగాళ్లతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు సిద్దమవుతున్నాయి.