Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ గెలుపున‌కు... టీడీపీ నిధుల‌ట‌!

By:  Tupaki Desk   |   28 March 2018 11:21 AM GMT
కాంగ్రెస్ గెలుపున‌కు... టీడీపీ నిధుల‌ట‌!
X
తెలుగు దేశం పార్టీ... మ‌న‌మంతా టీడీపీగా పిలుచుకునే ఈ తెలుగు నేల పార్టీ తెలుగు ప్ర‌జ‌ల ఆత్మ గౌర‌వ ప‌రిర‌క్ష‌ణే ల‌క్ష్యంగా దివంగ‌త సీఎం, తెలుగు ప్ర‌జ‌ల గుండెల్లో చిర‌స్థాయిని సంపాదించుకున్న అన్న‌గారు నంద‌మూరి తార‌క‌రామారావు స్థాపించారు. నాడు ఢిల్లీ వీధుల్లో గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ ఏలుబ‌డిలో తెలుగు వాళ్ల‌కు తీవ్ర అవ‌మానం జ‌రుగుతున్న వైనాన్ని చూసిన ఎన్టీఆర్ గుండె ర‌గిలిపోయింది. ఇంకేముంది... తెలుగు ప్ర‌జ‌ల ఆత్మ గౌర‌వాన్ని కాపాడాలంటూ ఆయ‌న రంగంలోకి దిగేశారు. కాంగ్రెస్ పార్టీ అప‌జ‌య‌మే ల‌క్ష్యంగా టీడీపీ స్థాపించారు. అనుకున్న‌ట్లుగానే తెలుగు నాట రాజ‌కీయ రంగంలోకి దిగిన అన‌తికాలంలోనే కాంగ్రెస్ పార్టీని ఈడ్చి అవ‌త‌ల పారేశారు. అప్ప‌టినుంచి కాంగ్రెస్, టీడీపీలు ఉప్పూనిప్పులానే వ్య‌వ‌హ‌రించాయి. ఇప్ప‌టికీ అదే త‌ర‌హా రాజ‌కీయం నెల‌కొన్నా... ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం సాగుతున్న పోరులో భాగంగా ఈ రెండు పార్టీలు ఏక‌తాటిపైకి వ‌చ్చేశాయ‌నే చెప్పాలి. ఏపీకి అన్యాయం చేసిన న‌రేంద్ర మోదీ స‌ర్కారుపై తొలుత వైసీపీ, ఆ త‌ర్వాత టీడీపీ అవిశ్వాస తీర్మానాలు ప్ర‌వేశ‌పెట్ట‌గా... కాంగ్రెస్ పార్టీ కూడా అవిశ్వాస తీర్మానం ఇచ్చేసిన విష‌యం తెలిసిందే.

ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా... ఇప్పుడు క‌న్న‌డ‌నాట జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అత్యంత కీల‌క‌మ‌నే చెప్పాఇ. క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిస్తే... 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కేన‌న్న భావ‌న‌లో బీజేపీ ఉంది. అయితే 2014 ఎన్నిక‌ల నాడు క‌లిసి పోటీ చేసిన టీడీపీ, బీజేపీ... ఏపీకి జ‌రిగిన అన్యాయంతో ఒక్క‌సారిగా బ‌ద్ధ శ‌త్రువులైపోయాయి. బీజేపీని దెబ్బ తీసేందుకు టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు అందుబాటులో ఉన్న ఏ ఒక్క అస్త్రాన్ని విడిచిపెట్ట‌రాద‌న్న భావ‌న‌తో ఉన్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ఓ ప‌క్కా ప్ర‌ణాళిక ర‌చించిన‌ట్లుగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ గుస‌గుస‌ల్లో భాగంగా ఇప్పుడు క‌ర్ణాట‌క ఎన్నిక‌లే కేంద్రంగా చ‌క్రం తిప్పేందుకు చంద్ర‌బాబు ఓ పెద్ద వ్యూహాన్నే అమ‌లు చేయ‌నున్నార‌ట‌. బీజేపీతో తెగ‌దెంపులు చేసుకోక‌ముందు నాడే ర‌చించిన వ్యూహాన్ని చంద్ర‌బాబు ఇప్ప‌టికే అమ‌లు పెట్టేసిన‌ట్లుగా ఇప్ప‌డు స‌రికొత్త ప్ర‌చారం సాగుతోంది.

ఆ వ్యూహం ఏమిట‌న్న విష‌యానికి వ‌స్తే... రాజ‌కీయంగా బ‌ద్ధ శ‌త్రువులుగా ఉన్న కాంగ్రెస్ కు క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో ఇతోదికంగా స‌హ‌క‌రించేందుకు టీడీపీ స‌ర్వం సిద్ధంగా ఉంద‌ట‌. క‌ర్ణాట‌క ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున నిధులు ముట్ట‌జెప్పేందుకు చంద్ర‌బాబు నిర్ణ‌యించార‌ట‌. ఊహ‌కు అంద‌ని మొత్తం నిధుల‌ను ఆయ‌న సిద్ధ‌రామ‌య్య‌కు పంపేందుకు ఏర్పాట్లు కూడా చేశార‌ట‌. అయితే టీడీపీ - కాంగ్రెస్‌ల మ‌ధ్య ఆది నుంచి స‌ఖ్య‌త లేక‌పోవ‌డంతో ఇప్పుడు ఆ ప‌నిని ఎవ‌రికి అప్ప‌జెప్పాల‌న్న కోణంలోనూ ముందుగానే ఆలోచించిన చంద్ర‌బాబు... ఆ ప‌నిని గుంటూరు ఎంపీగా ఉన్న గ‌ల్లా జ‌య‌దేవ్‌కు అప్ప‌గించార‌ట‌. గ‌ల్లా జ‌య‌దేవ్ గుంటూరు ఎంపీగా ఉన్న ఆయ‌న స్వ‌స్థ‌లం మాత్రం చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరు. చిత్తూరులోని చంద్ర‌బాబు స్వ‌గ్రామం నారావారిప‌ల్లె ఉన్న అసెంబ్లీ నియోజక‌వ‌ర్గం చంద్ర‌గిరి గ‌ల్లా స్వ‌స్థ‌లం. అంతేకాకుండా మొన్న‌టిదాకా గ‌ల్లా ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీలో ఉండేది. దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కేబినెట్ లో గ‌ల్లా అరుణ‌కుమారి మంత్రిగా కూడా ఓ వెలుగు వెలిగారు. ఈ క్ర‌మంలో గ‌ల్లా ఫ్యామిలీకి కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌తో మంచి సంబంధాలే ఉన్నాయి.

రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీని వీడిన గల్లా ఫ్యామిలీ టీడీపీలో చేరిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో గ‌ల్లా ఫ్యామిలీకి ఉన్న పాత ప‌రిచ‌యాల‌ను బ‌య‌ట‌కు తీసిన చంద్ర‌బాబు... క‌ర్ణాట‌క కాంగ్రెస్‌కు పంపాల్సిన నిధుల‌ను గ‌ల్లా జ‌య‌దేవ్ ద్వారానే పంపుతున్నార‌ట‌. ఇక ఈ నిధుల‌ను ఎలా సేక‌రించార‌న్న విష‌యానికి వ‌స్తే... గల్లా ఫ్యామిలీ రాజ‌కీయంలోనే కాకుండా పారిశ్రామిక రంగంలోనూ పేరెన్నిక‌గ‌న్న ఫ్యామిలీనే అమ‌ర‌రాజా ఫ్యాక్ట‌రీ ఈ కుటుంబం ఆధ్వ‌ర్యంలోనే న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. ఆర్థికంగా స్థితిమంతులుగా ఉన్న గ‌ల్లా జ‌య‌దేవ్... త‌న‌దైన శైలిలో నిధులు స‌ర్దేందుకు సై అన్నార‌ట‌. ఇప్ప‌టికే ఈ నిధులు ఓ కంటైన‌ర్‌ లో చిత్తూరుకు చేరుకున్నాయ‌ని... నేడో - రేపో ఈ మొత్తం నిధులు క‌ర్ణాట‌క కాంగ్రెస్ నేత‌ల‌కు చేరిపోనున్నాయ‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగుతోంది. ఈ వార్త‌ల్లో ఎంత‌మేర నిజ‌ముందో తెలియదు గానీ... బీజేపీని దెబ్బ తీసేందుకు ఏకంగా త‌న‌కు రాజ‌కీయ శ‌త్రువుగా ఉన్న కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు చంద్ర‌బాబు భారీ మొత్తం నిధులు పంపుతున్నార‌న్న వార్త మాత్రం సోష‌ల్ మీడియాలో ఇప్పుడు వైర‌ల్ గా మారిపోయింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.