Begin typing your search above and press return to search.

విశాఖ గ్యాస్ లీక్: రెండో ట్యాంక్ మరింత డేంజరట

By:  Tupaki Desk   |   9 May 2020 3:30 PM GMT
విశాఖ గ్యాస్ లీక్: రెండో ట్యాంక్ మరింత డేంజరట
X
విశాఖపట్నంలోని ఎల్.జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీక్ అయ్యి 12 మంది చనిపోయారు. ఇంకా చాలా మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ వెలువడిన విషవాయువును తటస్థీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిపుణులను ఆదేశించింది. కానీ అందులో ఉన్న నిల్వలు చూశాక ఇప్పుడు నిపుణులనే కాదు.. సమీప గ్రామాల్లోని ప్రజల్లోనూ భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

విశాఖ ఎల్.జీ పాలిమర్స్ పరిశ్రమలో రెండు ట్యాంకులున్నాయి. మొదటి ట్యాంకు నుంచే గ్యాస్ లీక్ ఇంతమంది చనిపోయారు. ఇంత ఉపద్రవం జరిగింది. ఈ మొదటి ట్యాంక్ సామర్థ్యం 2500 టన్నులు. అయితే ప్రమాదానికి ముందు ఈ ట్యాంక్ లో 1800 టన్నుల స్టైరీన్ గ్యాస్ ఉంది. 25 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలో దీన్ని నిల్వ ఉంచాలి. కానీ లాక్ డౌన్ కారణంగా నిల్వలు పెరిగిపోవడంతో.. లోపలి ఉష్ణోగ్రత క్రమంగా పెరిగింది. పీడనం పెరిగి గ్యాస్ లీక్ అయ్యింది. ప్రమాదం జరిగిన రోజులు దీన్నుంచి స్టైరీన్ ను పక్కనున్న రెండో ట్యాంక్ లోకి మళ్లించాలని ప్రయత్నించి విఫలమయ్యారు. అప్పటికే గ్యాస్ లీక్ అయ్యి వెళ్లలేకపోయారు. దీంతో ఫైర్ టెండర్స్ ద్వారా యాంటీ డోస్ పంపించారు.

ప్రమాదం జరిగిన ట్యాంకర్ పక్కనే కొత్తగా ఏర్పాటు చేసిన మరో ట్యాంక్ కూడా ఉంది. ఇందులో 3వేల టన్నుల స్టైరీన్ మోనోమర్ నిల్వలున్నాయి. ఈ ట్యాంక్ ను చూసే అందరూ భయపడుతున్నారు. లీకవుతున్న సమయంలో ఏ చిన్నపేలుడు జరిగినా మొదటి ట్యాంకులో కన్నా రెండో ట్యాంకులో పెద్ద ఎత్తున స్టైరీన్ ఉంది. కాబట్టి తీవ్రత చాలా అధికంగా ఉండేది. ప్రాణాలు పిట్టల్లా రాలేవి.

రెండో ట్యాంక్ లో భారీగా స్టైరీన్ గ్యాస్ నిల్వ ఉంది. దీన్ని తటస్థీకరించబడకపోతే, ఖాళీ చేయబడిన ప్రజలను తిరిగి వారి నివాసాలకు తరలించలేమని అధికారులు చెబుతున్నారు. రెండవ నిల్వ ట్యాంక్ సామర్థ్యం 3వేల మెట్రిక్ టన్నులు పైనే.. దానిలో పూర్తి స్థాయి నిల్వ ఉంది. ఇది లీకేజీ అయితే పెను ప్రమాదమే.. రెండవ ట్యాంక్ తటస్థీకరించబడే వరకు ఆపాయం ముగియలేదు అని అధికారులు అంటున్నారు.

ఈ సంఘటన జరిగి రెండున్నర రోజులకు పైగా గడిచినప్పటికీ, ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. మరోవైపు, ఈ లీకేజీ వల్ల పర్యావరణంపై ప్రభావం కనీసం ఒక దశాబ్దం పాటు ఉంటుందని నిపుణులు అంటున్నారు.

ఇంతమంది ప్రాణాలు తీసి భయం గొలుపుతున్న ఈ కంపెనీని వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబాలు ఈ ఉదయం కంపెనీ ముందు నిరసన చేపట్టాయి.