Begin typing your search above and press return to search.

అందరూ అనుకున్నట్లే వణికిస్తున్న ‘గులాబ్’..హైదరాబాద్‌లో హై అలర్ట్

By:  Tupaki Desk   |   27 Sep 2021 6:58 AM GMT
అందరూ అనుకున్నట్లే వణికిస్తున్న ‘గులాబ్’..హైదరాబాద్‌లో హై అలర్ట్
X
అందరూ అనుకున్నట్లు ‘గులాబ్’ వణికిస్తోంది. గులాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర హడలిపోతోంది. కుండపోత వర్షాలతో శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. విశాఖ, విజయనగరంలో జిల్లాల్లోనూ భారీవర్షాలు వణికిస్తున్నాయి. అయితే శ్రీకాకుళం, విజయనగరంపై గులాబ్ ప్రభావం అధికంగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గాలులకు వృక్షాలు నెలకొరిగాయి. విద్యత్ స్థంభాలు విరిగపడ్డాయి. సముద్రంలో రెండు మత్స్యకారుల పడవలు బోల్తా పడ్డాయి. వీరిలో ఒకరు గల్లంతు కాగా, మిగిలినవారు ఒడ్డుకు చేరుకున్నారు.

తీరం దాటిన తుఫాన్‌ బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. కళింగపట్నానికి 50 కి.మీ దూరంలో, గోపాల్‌పూర్‌కు 170 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని తెలిపింది. సోమవారం ఉత్తరకోస్తాలో భారీ భారీ వర్షాలు కురుస్తాయని, దక్షిణ కోస్తా, రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తుఫాన్‌ ప్రభావంతో రైల్వే అధికారులు సోమవారం కొన్ని రైళ్లను రద్దు చేశారు. జగదల్‌పూర్‌-భువనేశ్వర్‌ (08445), జునాగఢ్‌ రోడ్డు-భువనేశ్వర్‌ (02098), గుణుపూర్‌-రూర్కెలా (08128) ప్రత్యేక రైలును రద్దు చేశారు.

జేఎన్టీయూహెచ్ పరిధిలో జరగాల్సిన బీటెక్, బీఫార్మసీ పరీక్షలను వాయిదా వేశారు. వాయిదా పడిన పరీక్షల షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తామని జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ తెలిపారు. తుఫాను ప్రభావం విశాఖ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఎజెన్సీ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయినట్లు చెబుతున్నారు. విశాఖ నగరంలో పలుచోట్లు భారీ పడింది. విశాఖలోని జ్ఞానాపురం కూడలి రైల్వే ప్రవేశద్వారం వద్ద భారీగా వరద నీరు నిలిపోయింది.

ఆదివారం ముఖ్యమంత్రి జగన్‌తో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. గులాబ్‌ తుఫాన్‌ పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని, కేంద్రం నుంచి తక్షణ సహాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. తుఫాన్‌ ప్రభావంపై అప్రమత్తంగా ఉన్నామని, ప్రభావిత ప్రాంతాల జిల్లాల కలెక్టర్లు, యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని మోదీకి జగన్‌ చెప్పారు.


హైదరాబాద్‎లో హై అలర్ట్

హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘గులాబ్’ తుఫాన్ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం హైఅలర్ట్ అయింది. నేడు, రేపు జీహెచ్ఎంసీ హైఅలర్ట్ ప్రకటించింది. గులాబ్‌ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో సోమవారం, మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. జీడిమెట్ల, కొంపెల్లి, కుత్బుల్లాపూర్, అంబర్ పేట్, కాచిగూడ, ఉప్పల్, బోడుప్పల్, పీర్జాజీగూడ, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్‌లో ప్రాంతాల్లో వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండేలా అధికారుల చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. తుఫాన్ నేపథ్యంలో హైదరాబాద్‌లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు కంట్రోల్‌ రూమ్ 040-23202813 నంబర్లకు ఫిర్యాదు చేయాలని సూచించారు. హైదరాబాద్‎తో పాటు రాష్ట్రంలో పలు చోట్ల వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. మూడు రోజుల పాటు రెడ్ అలెర్ట్ ఏరియాలో బడులకు సెలవులు ఇవ్వాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులు ఇవ్వకపోవడంతో విద్యార్థులను బడికి పంపాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు.