Begin typing your search above and press return to search.

రష్యా–ఉక్రెయిన్‌ వార్‌.. ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ఇక కనిపించదు!

By:  Tupaki Desk   |   4 April 2023 10:51 AM GMT
రష్యా–ఉక్రెయిన్‌ వార్‌.. ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ఇక కనిపించదు!
X
అమెరికా ఆధ్వర్యంలోని నాటో కూటమిలో చేరడానికి ఉక్రెయిన్‌ ప్రయత్నిస్తోందంటూ ఆ దేశం పై రష్యా యుద్ధానికి దిగిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌ పై రష్యా యుద్ధం మొదలుపెట్టి ఏడాది దాటిపోయింది. అయినా ఇంతవరకు ఉక్రెయిన్‌ లొంగలేదు. యుద్ధం మొదలైనప్పుడు ఉక్రెయిన్‌ కొద్దిరోజుల్లోనే రష్యాకు లొంగిపోవడం ఖాయంగా కనిపించింది. ఇందుకు తగ్గట్టే రష్యా వరుసగా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్లింది.

అయితే అమెరికా, బ్రిటన్‌ తదితర దేశాలు అందిస్తున్న ఆయుధాలతో ఉక్రెయిన్‌.. రష్యా పై గట్టి పోరాటమే చేస్తోంది. రష్యా తమ నుంచి స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను ఒక్కొక్కటి గా వరుసగా చేజిక్కించుకుంటోంది.

కాగా ఉక్రెయిన్‌ పై రష్యా దాడిలో అనేక చారిత్రక ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు, వస్తువులు, కళాఖండాలు నాశనమయ్యాయి. ఇందులో ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం కూడా ఉంది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నగరానికి బయట హొస్టోమెల్‌ విమానాశ్రయం ఉంది. గతేడాది ఫిబ్రవరిలో మరమ్మతుల కోసం ప్రపంచంలోనే అతి పెద్ద కార్గో విమానం ఏఎన్‌–225 మ్రియాను ఈ ఎయిర్‌ పోర్టులో నిలిపి ఉంచారు. ఈ క్రమంలో రష్యా ఈ ప్రాంతం పై అత్యంత శక్తిమంతమైన క్షిపణులు, శతఘ్నులు, రాకెట్లతో విరుచుకుపడింది. దీంతో విమానం కాలిపోయింది.

రష్యా దాడికి గురికాకుండా వేరే చోటకు ఈ విమానాన్ని తరలించాలని చూసినా అప్పటికే రిపేర్లు కోసం విమానంలో ఒక ఇంజన్‌ ను తొలగించారు. దీంతో ఈ ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానాన్ని తరలించడం కుదరలేదు.

కాగా కార్గో కు సంబంధించి ప్రపంచంలో ఉన్న ఏఎన్‌–225 మ్రియా విమానం ఇదొక్కటేనని చెబుతున్నారు. 1980వ దశకంలో ఉక్రెయిన్‌.. సోవియట్‌ యూనియన్‌లో భాగంగా ఉన్నప్పుడు దీని నిర్మాణం ప్రారంభించారు. మ్రియాను ఆంటోనోవ్‌ స్టేట్‌ కంపెనీ రూపొందించింది. పెద్ద విమానాలను తయారు చేయడంలో ఈ కంపెనీకి మంచి గుర్తింపు ఉందని తెలుస్తోంది. 1988 డిసెంబరు 21న ఈ విమానం తొలిసారి గాల్లో ఎగిరింది. ఈ క్రమంలో ఇలాంటి దే మరొకటి తయారు చేయాలని ప్రయత్నించినా వర్కవుట్‌ కాలేదు. దీంతో 2009లో దీన్ని మధ్యలోనే వదిలేశారు.

కాగా ఏఎన్‌–225 మ్రియా విమానం పొడవు 84 మీటర్లు. విమానం లోపల ఒకేసారి 50 కార్లను ఉంచి తరలించవచ్చు. 36 వేల అడుగుల ఎత్తులో సైతం గంటకు 849 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయగల సామర్థ్యం ఈ విమానం సొంతం. ఇంధన ట్యాంకు సామర్థ్యం ఫలితంగా లండన్‌– ఆస్ట్రేలియా మధ్యనున్న 9569 మైళ్ల దూరాన్ని ఎక్కడా బ్రేక్‌ లేకుండా చేరుకోవచ్చు. గరిష్టంగా 640 టన్నుల టేకాఫ్‌ బరువును మోసుకెళ్లగల కెపాసిటీ దీని సొంతం. ఈ విమానాన్ని నిలిపి ఉంచాలంటే ఒక ఫుట్‌బాల్‌ మైదానానికి సమానమైన స్థలం కావాల్సి ఉంటుంది.

1991లో సోవియట్‌ యూనియన్‌ విచ్చిన్నమయ్యాక ఉక్రెయిన్‌ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానమైన ఏఎన్‌–225 ఆ దేశం దగ్గరే ఉండిపోయింది. నాటి నుంచి మ్రియాను భారీ సరకులను చేరవేయడానికి వినియోగిస్తున్నారు. ముఖ్యంగా పొరుగు దేశాల్లో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సహాయ సామగ్రిని చేరవేయడానికి మ్రియాను ఎక్కువగా ఉపయోగించారు. కోవిడ్‌ విజృంభించినప్పుడు అనేక దేశాలకు వైద్య పరికరాలను చేరవేయడంలో ఏఎన్‌–225 విమానం కీలక పాత్ర పోషించింది. 2016లో విమానం హైదరాబాద్‌ కూడా రావడం విశేషం.

ఏఎన్‌–225 గతేడాది ఫిబ్రవరిలో రష్యా దాడిలో ధ్వంసమైంది. ఈ విమానాన్ని మళ్లీ నిర్మించాలంటే 3 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.