Begin typing your search above and press return to search.
ఈ మాత్రం దానికి అంత పెద్ద మాటలేంది కేసీఆర్?
By: Tupaki Desk | 12 Dec 2020 11:30 AM GMTనేను లేస్తే మనిషిని కాదని కొందరు చెబుతుంటారు. లేచే అవకాశం లేనోళ్ల నోటి నుంచే ఇలాంటి మాటలు వస్తుంటాయి. సంగతి చూసే బ్యాచ్.. లేస్తానన్న మాట చెప్పకుండానే చూసేస్తారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు ఇప్పుడు ఇలానే ఉంది. సాయం కోరాలనుకునే వారు.. ఒద్దికగా అడగాల్సిన రీతిలో అడిగితే అడిగినంత కాకున్నా.. అంతో ఇంతో సాయం చేయటం ఉంటుంది. అందుకు భిన్నంగా.. రూల్స్ మాట్లాడి.. మీరు కర్ణాటకలో ఏం చేశారు? గుజరాత్ లో ఏం చేశారు? తెలంగాణ వచ్చేసరికి మాత్రం హ్యాండిచ్చారంటూ ఫైర్ అయిపోతే.. ఫలితం ఉంటుందా? పైసలు రాలతాయా? అంటే లేదనే చెప్పాలి.
ఇదంతా చూసినోళ్లకు.. కేసీఆర్ మాటల్లో కనిపించే కరకుదనం చేతలకు వచ్చేసరికి లేకపోవటం చూసినప్పుడు.. ఆ మాత్రం దానికి అడ్డం.. పొడువు మాటలు మాట్లాడటం ఎందుకు కేసీఆర్? అన్న ప్రశ్న మదిలో మెదలక మానదు. తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి.. నమస్కరించి వరద సాయం ఇవ్వాల్సిందిగా అడిగేదానికి.. ఎన్నికల వేళ అంత ఆవేశంగా మాట్లాడాల్సిన అవసరం ఉందా? అన్న సందేహం కలుగక మానదు.
అన్నిసార్లు అదిలింపులు.. బెదిరింపు మాటలు పని చేయవు. అందునా.. మోడీ లాంటి నేత ప్రధానిగా ఉన్నప్పుడు కేంద్రాన్ని కంట్రోల్ చేయటం అంత తేలికైన విషయం కాదు. ఆ విషయం కేసీఆర్ మాస్టర్ మైండ్ కు ఎందుకు తట్టలేదన్నది ప్రశ్న. అంతేకాదు.. తాను అడ్డం.. పొడుగు మాటలు మాట్లాడితే.. తన మాటలకు కేంద్రం నుంచి నిధులు రాకున్నా.. కనీసం ఓట్లు అయినా రాలతాయనుకుంటే అది కూడా రాని పరిస్థితి. దీంతో..తెలంగాణ సారుకు తత్త్వం బోధ పడినట్లుగా చెబుతున్నారు. అందుకే..కాస్త తగ్గి హస్తినకు ప్రయాణం కట్టిన కేసీఆర్.. ప్రస్తుతం రాజీ బాటలో ఉన్నట్లు చెబుతున్నారు.