అధికార.. విపక్షాలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన మునుగోడు ఉప ఎన్నిక వ్యవహారంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సాధారణంగా ప్రతిష్ఠాత్మకంగా సాగే ఎన్నికల వేళ.. ఎన్నికల సంఘం అధికారులు ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తారు. ఏ చిన్న తేడా వచ్చినా మొదటికే మోసం వస్తుందన్న సంగతి వారికి తెలిసిందే.
అందుకే.. విమర్శలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతి విషయంలోనూ ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తూ రూల్ బుక్ కు కించిత్ తేడా రాకుండా నిర్ణయాలు వెల్లడిస్తూ ఉంటారు.
అందుకు భిన్నంగా మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న యుగతులసి పార్టీ అభ్యర్థికి రోడ్ రోలర్ గుర్తును కేటాయించి.. ఆ తర్వాత ఆ గుర్తును తొలగించిన వైనం ఇప్పుడో ఇష్యూగా మారింది.
ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించటం.. దీనికి స్పందించిన కోర్టు.. ఎన్నికల గుర్తుల విషయంలో తుది నిర్ణయం ఎన్నికల సంఘానిదేనని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. ఒక అభ్యర్థికి కేటాయించిన రోడ్ రోలర్ గుర్తును తొలగిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్ నిర్ణయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తప్పు పట్టింది.
అసలు ఒక అభ్యర్థికి కేటాయించిన గుర్తును ఎలా మారుస్తారు? అంతా మీ ఇష్టమేనా? అంటూ సీరియస్ అయ్యింది. అంతేకాదు.. దీనిపై గురువారం సాయంత్రం 5 గంటల లోపు వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. గుర్తుల కేటాయింపులో నిబంధనల్ని పాటించలేదన్న విషయాన్ని గుర్తించినట్లుగా సీఈసీ పేర్కొనటంతో పాటు.. రూల్ ను ఫాలో కాని వారిపై చర్యలు తప్పవన్నట్లుగా పరిస్థితి ఉందంటున్నారు.
తాజా ఇష్యూ నేపథ్యంలో చర్యలు ఖాయమని.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి చెందిన అధికారులకు షాకులు తప్పవన్న మాట వినిపిస్తోంది. దీనికి సంబంధించి ఏమేం జరుగుతుందన్న విషయంపై ఈ సాయంత్రానికి క్లారిటీ రావొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.