Begin typing your search above and press return to search.

దేశంలో ధ‌నికులు పెరుగుతున్నారు..రూ.200 కోట్ల ఆస్తులున్న‌వారు ఎంద‌రంటే..?

By:  Tupaki Desk   |   25 Feb 2021 5:30 PM GMT
దేశంలో ధ‌నికులు పెరుగుతున్నారు..రూ.200 కోట్ల ఆస్తులున్న‌వారు ఎంద‌రంటే..?
X
‘భార‌త‌దేశం అత్యంత సంప‌న్న‌మైన‌ది.. కానీ మెజారిటీ భార‌తీయులు నిరుపేద‌లు.’ ఇదీ.. ప్రపంచం ఎప్పటి నుంచో చెబుతున్న మాట. ఇవి మాట‌లు కావు.. క‌ఠిన వాస్త‌వాలు. ఇది ద‌శాబ్దాలుగా నిరూపితం అవుతూనే ఉంది. సంప‌న్నుల‌కు, నిరుపేద‌లకు మ‌ధ్య ఉన్న దూరం ఇంకా ఇంకా పెరిగిపోతూనే ఉంది. ధ‌నవంతులు మ‌రింత‌గా ధ‌నం పోగేసుకుంటూ పోతుండ‌గా.. నిరుపేద‌లు మాత్రం మ‌రింత క‌టిక ద‌రిద్రంలోకి కూరుకుపోతున్నారు. ఈ విష‌యాన్ని తాజా నివేదిక ఒక‌టి మ‌రోసారి బ‌య‌ట‌పెట్టింది.

దేశంలో పెరిగిపోతున్న సంప‌న్నులు..
మ‌న దేశంలో అవాంఛ‌నీయ‌మైన వృద్ధిరేటు న‌మోద‌వుతోంద‌నే విమ‌ర్శ‌లు చాలా కాలంగా చేస్తున్నారు మేధావులు. దీనికి ఆధారాలు కూడా చూపిస్తున్నారు. దేశంలో సంప‌న్నులుగా ఉన్న‌వారే మ‌రింత ధ‌న‌వంతులుగా మారిపోతున్నార‌ని.. అదే స‌మ‌యంలో మూడు పూట‌లా తిండిలేక అల్లాడుతున్న‌వారు మ‌రింత పేద‌రికంలో కూరుకుపోతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. దీనికి కార‌ణం సంప‌ద స‌మానంగా పంపిణీ కాక‌పోవ‌డ‌మే అని చెబుతున్నారు. ప్ర‌స్తుతం భార‌త దేశంలో 6,884 మంది అత్యంత సంప‌న్నులు ఉన్నారని తాజా లెక్క‌లు చెబుతున్నాయి.

గ‌డిచిన ప‌దిహేనేళ్ల‌లోనే అధికంగా..
వీరంతా గ‌డిచిన ప‌ది నుంచి ప‌దిహేను సంవ‌త్స‌రాల్లోనే అత్యంత కోటీశ్వ‌రులుగా మారిపోయార‌ని నివేదిక‌లు చెబుతున్నాయి. అదే స‌మ‌యంలో స‌రైన తిండిలేక‌, వైద్యం అంద‌క‌, స‌గ‌టు జీవ‌న ప్ర‌మాణ రేఖను నుంచి కిందకు పడిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంద‌ని లెక్క‌లు చెబుతున్నాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని కేంద్ర‌, రాష్ట్ర‌ ప్ర‌భుత్వాలు చెబుతున్న‌ప్ప‌టికీ.. క్షేత్ర‌స్థాయిలో ఫ‌లితాలు విరుద్ధంగా ఉండ‌డం వాస్త‌వ ప‌రిస్థితిని చాటి చెబుతున్నాయి.

వ‌చ్చే ఐదేళ్ల‌లో మ‌రింత పెరుగుద‌ల‌..
రూ.220 కోట్లకు పైగా నిక‌ర ఆస్తి క‌లిగిన వారిని అత్యంత సంప‌న్నుల జాబితాలో చేరుస్తారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచంలో ఇంత‌కు మించిన ఆదాయం క‌లిగిన వారు 5,21,653మంది ఉన్నారు. వీరిలో 6,884 మంది భార‌త్ లోనే ఉన్నారు. అంతేకాదు.. వీరి సంఖ్య వ‌చ్చే ఐదేళ్ల‌లో 11,198 మందికి చేర‌బోతోందని అంచ‌నా వేస్తున్నాయి నివేదిక‌లు. ఇది ప్ర‌పంచంలోనే రెండో వేగ‌వంత‌మైన వృద్ధిరేటుగా అభివ‌ర్ణిస్తున్నారు. అవును.. దేశం వృద్ధి చెందుతోంది కానీ.. అది కొంద‌రికే ప‌రిమితం అవుతోంది. 130 కోట్ల జ‌నాభా క‌లిగిన దేశంలో.. స‌గానికిపైగా సంప‌ద కొన్ని వేల మంది చేతుల్లోనే బందీ అయిపోయింద‌ని, దానివ‌ల్లే అభాగ్యులు క‌ఠిన పేద‌రికంలో చ‌స్తూ బ‌తుకుతుండ‌గా.. నిర్భాగ్యులు ఆక‌లి చావులు చ‌స్తున్నార‌నే ఆవేద‌న వ్య‌క్త‌మ‌వుతోంది.