Begin typing your search above and press return to search.

లైవ్ లో ఉన్నవేళ.. కారు ఢీ కొట్టినా.. రిపోర్టు చేసిన రిపోర్టర్

By:  Tupaki Desk   |   22 Jan 2022 4:34 AM GMT
లైవ్ లో ఉన్నవేళ.. కారు ఢీ కొట్టినా.. రిపోర్టు చేసిన రిపోర్టర్
X
ఒక వీడియో వైరల్ గా మారింది. రిపోర్టర్ జీవితం ఎంత కష్టంగా ఉంటుంది? సవాళ్ల మయంగా ఉంటుందనటానికి ఈ వీడియో ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. టీవీ ఛానల్ కు రిపోర్టు చేసే వేళ.. ఒక మహిళా రిపోర్టర్ కు ఎదురైన షాకింగ్ ఉదంతం చూస్తే నోట మాట రాదు. ఊహించని రీతిలో ఎదురైన ప్రమాదంలోనూ తాను చేసే పని విషయంలో ఆమె ప్రదర్శించిన కమిట్ మెంట్ కు హేట్సాఫ్ చెప్పకుండా ఉండలేం. ఇంతకీ అసలేం జరిగిందంటే..

అమెరికాలోని వర్జీనియాకు చెందిన ఒక న్యూస్ చానల్ కు చెందిన రిపోర్టర్ యోర్గీ. తాజాగా ఆమె ఒక రోడ్డు ప్రమాదం గురించి వార్తను అందించే క్రమంలో.. యాక్సిడెంట్ జరిగిన ప్రాంతానికి వెళ్లి.. రిపోర్టు చేస్తున్నారు. చీకటిగా ఉన్న ఆ ప్రాంతం నుంచి తాను పని చేస్తున్న చానల్ కు లైవ్ రిపోర్టు ఇస్తున్నారు. ఇలాంటి వేళ.. అకస్మాత్తుగా వచ్చిన కారు.. ఆమె వెనుక భాగాన్ని ఢీ కొనటం.. ఆమె వెంటనే కింద పడిపోవటం జరిగింది.

ఓ మైగాడ్.. నన్ను ఇప్పుడుకారు ఢీ కొట్టింది.. అయినప్పటికీ నేను క్షేమంగానే ఉన్నానంటూ.. లైవ్ ను కొనసాగించటం విశేషం. మరోవైపు స్టూడియోలో ఉన్న న్యూస్ రీడర్ ఆమె బాగోగులు అడిగారు. తాను బాగానే ఉన్నందుకుసంతోషంగా ఉన్నట్లు చెప్పారు. ఆమె రిపోర్టు చేసే క్రమంలో కారు వెనుక భాగాన్ని కొట్టటం చూశానని.. ఆ తర్వాత స్క్రీన్ నుంచి కనిపించలేదన్న న్యూస్ రీడర్.. దెబ్బలు బాగా తగిలాయా? అని ప్రశ్నించారు.

అందుకు బదులిచ్చిన మహిళా రిపోర్టర్.. తనకేమీ తెలీదని.. కారు ఢీ కొట్టినంతనే.. తన జీవితమంతా కళ్ల ముందు మెరిసిందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. కమిట్ మెంట్ అనే మాటను విని ఉంటాం కానీ.. ఈ మహిళా జర్నలిస్టు కమిట్ మెంట్ చూసినప్పుడు మాత్రం ఇదే అసలుసిసలు కమిట్ మెంట్ అన్న భావన కలుగక మానదు.