Begin typing your search above and press return to search.

‘రీజనల్ ఫ్రంట్’... మోదీని ఎదుర్కోవాలంటే ఇదొక్కటే మార్గం

By:  Tupaki Desk   |   13 Jan 2022 4:42 AM GMT
‘రీజనల్ ఫ్రంట్’... మోదీని ఎదుర్కోవాలంటే ఇదొక్కటే మార్గం
X
బీజేపీకి దేశవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతోందనేది అందరూ గుర్తిస్తున్న సత్యం. కానీ, బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడంలో మాత్రం ప్రత్యర్థి పార్టీలు సఫలం కాలేకపోతున్నాయి. దీనికి ప్రధానంగా రెండు కారణాలుండగా అంతకంటే ప్రధానమైన మూడో కారణం మరోటి ఉంది. ప్రధాన కారణాల్లో మొదటిది.... కాంగ్రెస్ అత్యంత బలహీన దశలో ఉండడం... రెండోది ఉత్తరాది పార్టీలు, దక్షిణాది పార్టీలు ఏకతాటిపైకి రాలేకపోవడం.

ఇక ఈ రెండింటికీ మించిన మూడో కారణం... కాంగ్రెస్ లేకుండా బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు చేయలేమన్న పిచ్చి భయం.

అవును... మోదీ, బీజేపీలను ఎలాగైనా అడ్డుకోవాలన్న ఆలోచన ప్రాంతీయ పార్టీల నేతలు కలుస్తున్నా ఎన్నికల కూటమిగా ఏర్పడి కలిసికట్టుగా పోరాడలేకపోవడానికి కారణం ఈ భయమే. కాంగ్రెస్ ఉంటేనే మోదీ వ్యతిరేక కూటమి విజయం సాధిస్తుందని.... కానీ, కాంగ్రెస్ ఆ కూటమిలో ఉంటే ప్రధాని పదవి కాంగ్రెస్‌కి అప్పగించేయాలన్న ఆలోచనే థర్డ్ ఫ్రంట్ దిశగా అడుగులుపడకపోవడానికి కారణం.

నిజానికి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు ప్రాంతీయ పార్టీల కంటే దీనంగా ఉంది. ఆ పార్టీ స్వయంగా అధికారంలో ఉన్నది కేవలం మూడు రాష్ట్రాలలోనే. పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో మాత్రమే అధికారంలో ఉంది.

జార్ఖండ్, తమిళనాడు, మహారాష్ట్రలలో అధికారంలో ఉన్న పార్టీలకు మద్దతు ఇస్తోంది.

ప్రస్తుతం అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల పరిస్థితి చూస్తే పంజాబ్‌లో ఆ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయిన అమరీందర్ సింగ్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టి బీజేపీ పంచన చేరారు. రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, కీలక నేత సచిన్ పైలట్‌లు వర్గాలుగా చీలిపోయ పార్టీని నాశనం చేసేశారు.

సచిన్ పైలట్ అధికారికంగా బీజేపీలో చేరడం ఒక్కటే తక్కువ అన్నట్లుగా ఉంది అక్కడి పరిస్థితి. ఉన్నంతలో మెరుగు ఛత్తీస్‌గఢ్ మాత్రమే. అక్కడ కాంగ్రెస్ కాస్త జాగ్రత్త పడితే లోక్ సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడంతో పాటు మళ్లీ అధికారం నిలబెట్టుకునే అవకాశం ఉంది. 90లో 68 సీట్లు గెలుచుకుని ఛత్తీస్‌గడ్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అదే ఊపులో ప్రస్తుతం లేకపోయినా బలంగానే ఉంది.

ఇక మిగతా మూడు చోట్ల పాలక ప్రభుత్వాల కూటమిలో భాగస్వామిగా ఉన్నా అక్కడ మైక్రో పార్ట్‌నరే.

మరోవైపు త్వరలో ఎన్నికలు జరగనున్న అయిదు రాష్ట్రాల సంగతే తీసుకుంటే.... పెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్ ఏమీ పుంజుకోలేదు. అక్కడ సీఎం యోగి, పాలక పార్టీ బీజేపపై వ్యతిరేకత ఉన్నప్పటికీ అది కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చే స్థాయిలో లేదు.

పంజాబ్ సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ విజయం అందుకోవడానికి సిద్ధంగా ఉందనే చెప్పుకోవాలి. ఉత్తరాంఖండ్ బీజేపీదే. గోవా, మణిపుర్‌లు దేశ రాజకీయాలను మలుపు తిప్పేసే రేంజ్‌లో అయితే ఉండవు.


నాయకుల లెక్కేంటి?

జీవితంలో ఒక్కసారైనా ప్రధాని పీఠంపై కూర్చోవాలని కోరుకుంటున్న నాయకులు దేశంలో చాలామందే ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకుల సంగతి పక్కన పెడితే ఉత్తరాది పార్టీలు, ఇతర ప్రాంతీయ పార్టీల నాయకుల్లోనూ చాలామందికి ఈ ఆశ ఉంది. కొందరు ప్రయత్నాలు చేసిచేసి ప్రయత్నాలు మానుకుని అదృష్టంపై ఆశ పెట్టుకుని నిరీక్షిస్తుండగా మరికొందరు మాత్రం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. అందులో ముందు వరుస మమతా బెనర్జీది. ప్రధాని కావాలన్నది ఆమె లక్ష్యం. ఇక బిహార్ సీఎం నితీశ్ కుమార్, తెలంగాణ సీఎం కేసీఆర్, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌, ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌దీ అదే లక్ష్యం.

వీరిలో తృణమూల్ అధినేత్రి మమత బెనర్జీ గట్టి ప్రయత్నాలు చేస్తుండగా టీఆర్ఎస్ అధినేత గతంలో ఫెడరల్ ఫ్రంట్ అని కాలికి బలపం కట్టుకుని తిరిగినా ఎన్నికల తరువాత ఫాం హౌస్‌లో తన నిత్యకృత్యాలలో నిమగ్నమైపోయారు.

బీజేపీతో తనకు తంటా వచ్చినప్పుడంతా యాక్టివేట్ అవుతున్న కేసీఆర్ ఇటీవల తమిళనాడు వెళ్లి డీఎంకే అధినేత స్టాలిన్‌ను కలిశారు. కేరళ సీఎం సహా వామపక్ష పెద్దలు వచ్చి హైదరాబాద్‌లో కేసీఆర్‌ను కలిశారు. తాజాగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కూడా కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఇవన్నీ చూస్తుంటే కేసీఆర్ మళ్లీ దేశ రాజకీయాలపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తున్నా స్పష్టమైన అడుగులు కనిపించడం లేదు. ఆయన ట్రాక్ రికార్డ్ బట్టి ఆయన్ను నమ్మి వచ్చేవారు ఎవరన్నదీ అనుమానమే.

మిగతా వారిలో నితీశ్ కుమార్ బీజేపీతోనే సాగుతూ ప్రస్తుతం బిహార్‌లో అధికారం కాపాడుకుంటూ వస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ అప్పుడప్పుడూ విభేదించి, అప్పుడప్పుడూ తలూపుతూ... ఇంకొన్నిసార్లు కాషాయ ట్రిక్కులే కాపీ కొడుతూ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇప్పుడు గోవాలో పోటీలో నిలుస్తున్న కేజ్రీవాల్ పార్టీ పంజాబ్‌లో ఏకంగా అధికారం సాధిస్తుందన్న అంచనాలున్నాయి.

మమతా బెనర్జీ విషయానికొస్తే ఆమె కేంద్రంలోని బీజేపీని ఢీకొడుతున్నారు. దేశానికి తూర్పు దిక్కున ఉన్న రాష్ట్రాన్ని పాలిస్తున్న ఆమె తన విస్తరణ ప్రయత్నాలలో భాగంగా ఏకంగా పశ్చిమ దిక్కుకు భారీ అంగ వేసి గోవాలో పోటీపడుతున్నారు. దేశం గర్వించే టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ అక్కడ తృణమూల్ తరఫున కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. గోవాలో తృణమూల్ గెలుపోటములు ఎలా ఉన్నా ఇకపై మిగతా రాష్ట్రాలలోనూ పోటీ చేసి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న లక్ష్యంతో ఆమె గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.

వీరందరి కంటే ముందు నుంచే ప్రధాని పీఠంపై కన్నేసి అంతవరకు వచ్చి అదృష్టం కలిసిరాక అవకాశం అందుకోలేకపోయిన శరద్ పవార్ కూడా ఇప్పుడు ఆ ప్రయత్నాలలో ఉన్నారు. బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాకపోతే... సంకీర్ణ రాజకీయాలొస్తే తాను అవకాశం అందుకోవాలని చూస్తున్నారు. అంతేకానీ... ఆయన ముందుండి ప్రత్యామ్నాయ కూటములు ఏర్పాటు చేసే ప్రయత్నాలలో మాత్రం లేరు.

వీరందరితో పాటు ఎస్పీ, బీఎస్పీ నేతలూ అవకాశం కోసం చూస్తూ రాజకీయాలు చేస్తున్నారే కానీ అవకాశాలు సృష్టించుకోవడం లేదు. పైగా వీళ్లలో ఎక్కువ మంది కాంగ్రెస్‌తో కలిసి బీజేపీపై పోరాడాలనుకుంటున్నవారే.

కాంగ్రెస్ మద్దతు లేకుండా కేంద్రంలో బీజేపీని ఎదిరించి అధికారంలోకి ఏ ఫ్రంటూ రాలేదని నమ్మేవారే. కానీ, మారిన పరిస్థితులలో పార్టీలన్నీ కలిస్తే కాంగ్రెస్ అవసరం లేకుండానే ఫ్రంట్ కీలకం కాగలదు. కావాల్సిందే కలసిపనిచేయడమే.


‘రీజనల్ ఫ్రంట్’ రీజన్ ఇదే

తమిళనాడులో స్టాలిన్, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్, కర్ణాటకలో కుమారస్వామి, పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ, ఒడిశాలో నవీన్ పట్నాయక్, దిల్లీ-పంజాబ్‌లో అరవింద్ కేజ్రీవాల్, బిహార్‌లో తేజస్వి యాదవ్, ఉత్తర్ ప్రదేశ్‌లో అఖిలేశ్ యాదవ్, మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్‌లు ఏకతాటిపైకి రాగలిగి ఎన్నికలకు ముందే కూటమిగా ఏర్పడితే కాంగ్రెస్ అవసరం ఉండదు.

తమిళనాడు -39, ఏపీ – 25, తెలంగాణ, 17, కర్ణాటక -28 , పశ్చిమ బెంగాల్ -41, దిల్లీ -7, పంజాబ్ -13, బిహార్ - 40, మహారాష్ట్ర – 48, కేరళ – 20, ఒడిశా – 21, ఉత్తర ప్రదేశ్ - 80 రాష్ట్రాలలో మొత్తం 379 లోక్ సభ సీట్లున్నాయి.

ఎన్నికలకు ముందు నుంచే కూటమిగా ఏర్పడి పనిచేస్తే ఈ కూటమి నిర్ణయాత్మక శక్తిగా అవతరించడం ఖాయం. అంతేకానీ, కాంగ్రెస్‌తో కలిసి కూటమి కట్టాలని చూస్తే మాత్రం ఆ పార్టీపై ఉన్న తీవ్ర వ్యతిరేకతను వీరంతా తమ నెత్తి మీద మోయాల్సి ఉంటుంది.