Begin typing your search above and press return to search.

జగన్ మౌనానికి కారణం తెలుసా ?

By:  Tupaki Desk   |   15 July 2021 4:30 AM GMT
జగన్ మౌనానికి కారణం తెలుసా ?
X
జల వివాదాల్లో తెలంగాణ మంత్రులు, నేతలు ఎంతగా రెచ్చగొడుతున్నా జగన్మోహన్ రెడ్డి మాత్రం మౌనంగా చాలా ఓప్పిగ్గా ఉన్నారు. మంత్రులు, నేతలు డైరెక్టుగా దివంగత సీఎం వైఎస్సార్ తో పాటు జగన్ను డైరెక్టుగానే ఎటాక్ చేశారు. నోటికొచ్చినట్లు తిట్టారు. అయినా జగన్ ఎక్కడా తొందరపడకుండా మంత్రులను ఏమీ మాట్లాడలేదు. జగన్ మౌనం వెనుక ప్రధానంగా రెండు కారణాలున్నట్లు తెలుస్తోంది.

మొదటిదేమో తెలంగాణాలో సెంటిమెంటును వీలైనంతలో తగ్గించేయటం. తెలంగాణాలో ఎప్పుడు ఎన్నికలన్నా, ఉపఎన్నికలన్నా కేసీయార్ మొదలుకొని మంత్రులు, నేతల వరకు చేసే మొదటిపనేమిటంటే తెలంగాణా సెంటిమెంటును రెచ్చగొట్టడం. అధికారంలోకి వచ్చి ఏడేళ్ళయినా ఇంకా సెంటిమెంటును రెచ్చగొట్టందే తమకు ఓట్లు రావని కేసీయార్ అండ్ కో భావిస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది.

ఏడేళ్ళల్లో టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి చెప్పుకోకుండా ఇంకా సెంటిమెంటునే హైలైట్ చేసుకునే అవకాశం ఇవ్వకూడదన్నది జగన్ ప్లాన్ గా చెబుతున్నారు. ఇదే సందర్భంలో తన సోదరి షర్మిల తెలంగాణాలో పార్టీ పెట్టిన కారణంగా ఆమెకు కూడా తనపై ఆరోపణలు చేసే అవకాశం ఇవ్వకూడదని అనుకున్నారు. తాను తెలంగాణా గురించి ఏమన్నా గట్టిగా మాట్లాడితే ప్రస్తుత అవసరాలకు తగ్గట్లుగా షర్మిల కూడా జగన్ పై డైరెక్టుగా ఆరోపణలు చేసే అవకాశం ఉంది.

కేసీయార్ అండ్ కో తో పాటు షర్మిలకు కూడా తనపై నేరుగా ఆరోపణలు, విమర్శలు చేసే అవకాశం ఇవ్వకూడదనే జగన్ మౌనంగా ఉంటున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. అయితే జల వివాదంపై తన వాదనను నేరుగా ప్రధానమంత్రి, జల వనరుల శాఖ మంత్రి, హోంశాఖ మంత్రికి లేఖల రూపంలో వినిపిస్తున్నారు. దీనికి అదనంగా తెలంగాణా వాదనను తప్పుపడుతు సుప్రింకోర్టులో కేసు కూడా వేశారు. కాబట్టి సుప్రింకోర్టు విచారణలో ఏం జరుగుతుందో చూడాల్సిందే.

ఇక ఈ విషయంలో రెండో వ్యూహం ఇలా ఉంది. రాజకీయ మాటల వల్ల ప్రయోజనం కూడా ఉండదని జగన్ నిర్ణయించుకున్నారు. అందుకే దీనికి లీగల్ పోరాటం మాత్రమే మార్గమని జగన్మోహన్ రెడ్డి ఫిక్సయ్యారు. నదీ జలాల వివాదాల నేపథ్యంలో వాటికి చెక్ చెప్పేందుకు వీలుగా అంతర్రాష్ట్ర నదులపై ఉండే రిజర్వాయర్లు.. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్వహణ.. భద్రతలను ఆయా నదీ యాజమాన్య బోర్డులకే అప్పగించేలాపోరాటం చేయడం.

నిర్దేశించిన వాటా కంటే అధికంగా నీటిని వినియోగిస్తే.. అది అక్రమమని తేల్చటం.. ఒప్పందాలకు విరుద్ధంగా కొత్త ప్రాజెక్టులు కట్టటం.. లేదంటే ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యాన్ని విస్తరించటం లాంటివి కూడా అక్రమ చర్యలుగా గుర్తించటంతో పాటు.. అలాంటి వివాదాలకు శాశ్వత పరిష్కారం అవసరమన్న విషయాన్ని కోర్టుకు తెలపటం. నదీ జలాల వివాదాల్ని ఎవరు పరిష్కరించాలన్న విషయాన్ని రాజ్యాంగంలో స్పష్టంగా పొందుపర్చిన నేపథ్యంలో కేంద్రమే వాటిని పరిష్కరించాలని కోరడం. వీటన్నింటికి మించి అంతర్రాష్ట్ర నదీ జలాలపై ఉండే రిజర్వాయర్లు.. వాటికి సంబంధించిన విద్యుత్ కేంద్రాలన్ని కూడా బోర్డు పరిధిలోనే ఉండాలని కోరడం ఏపీ తాజా వ్యూహం.