Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ పై ధిక్కారం మొదలైందా?

By:  Tupaki Desk   |   17 July 2021 7:31 AM GMT
కాంగ్రెస్ పై ధిక్కారం మొదలైందా?
X
ఏదో మా రాష్ట్రంలో మేం పాలన చేసుకుంటుంటే ప్రతిసారి అధిష్టానం ఎంట్రీ ఇవ్వడం పుల్లలు పెట్టడం.. వైరివర్గాలకు కీలక పదవులు కట్టబెట్టడాన్ని ఆ సీఎం జీర్ణించుకోలేదు. అందుకే అధిష్టానం తీరుపై ఘాటు లేఖ రాశాడు. పాలనలో, రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం పెరిగిపోయిందంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి పంజాబ్ సీఎం లేఖ రాయడం సంచలనమైంది.

పంజాబ్ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం దుమ్ము దుమారాన్నే రేపుతోంది. సీఎంగా కెప్టెన్ అమరీందర్ ను కొనసాగిస్తూనే పీసీసీ అధ్యక్ష బాధ్యతలు సిద్దూకు అప్పజెప్పాలని కాంగ్రెస్ అధిష్టానం ఇటీవల నిర్ణయించింది. ఈ నిర్ణయంపైనే పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ నిప్పులు చెరిగారు. అధినేత్రి సోనియాకు శుక్రవారం ఓ లేఖ రాశారు.

పంజాబ్ విషయంలో అధిష్టానం మితిమీరిన జోక్యం చేసుకుంటోందని సీఎం అమరీందర్ సంచలన లేఖ రాశారు. దీనిపై తీవ్రంగా దుయ్యబట్టారు. పంజాబ్ లో పరిస్థితి ఇంత అనుకూలంగా ఏమీ లేదని లేఖలో పేర్కొన్నారు. అటు పార్టీ, ఇటు ప్రభుత్వం అధిష్టానం వ్యవహారశైలితో భారీ మూల్యాన్నే చెల్లించాల్సి ఉంటుందని ఏకంగా అధిష్టానాన్ని తీవ్రంగా హెచ్చరించారు.

పార్టీలోని సీనియర్లను తక్కువగా అంచనావేయవద్దని.. అలా తక్కువగా అంచనా వేస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఘెర పరాభవాన్ని మూటగట్టుకోవాల్సి ఉంటుందని సీఎం అమరీందర్ సింగ్ లేఖలో పేర్కొన్నారు.

మొత్తంగా కాంగ్రెస్ అధిష్టానంపై పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ఒక తిరుగుబావుటా ఎగరవేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే సిద్దూనే పీసీసీ చీఫ్ గా అధిష్టానం చేయడాన్ని అమరీందర్ జీర్ణించుకోవడం లేదు. దీంతో ఏకంగా కాంగ్రెస్ తో అమీతుమీ తేల్చుకోవడానికి రెడీ అయ్యారు. ఇది ఎటువైపు దారితీస్తుందనేది ఆసక్తిగా మారింది.