Begin typing your search above and press return to search.

వర్షాలతో ఇబ్బందులు తప్పవు , నేనున్నా అంటూ అమ్మవారు భరోసా !

By:  Tupaki Desk   |   26 July 2021 9:22 AM GMT
వర్షాలతో ఇబ్బందులు తప్పవు , నేనున్నా అంటూ అమ్మవారు భరోసా !
X
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగ అంగరంగవైభవంగా జరుగుతుంది. రాష్ట్రానికి తలమానికమైన సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి దర్శించుకొని బోనాలు సమర్పించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. సీఎం కేసీఆర్ సతీమణి సహా పలువురు మంత్రులు ఇతర పార్టీల నేతలు, ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆషాఢ మాసాన, సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు అత్యంత కీలకఘట్టమైన రంగం కార్యక్రమం నిర్వహించారు.

మాతంగి పచ్చికుండపై నిలబడి తనలోకి అమ్మవారిని ఆవహించుకొని భవిష్యవాణి చెప్పడం ఆనవాయితీగా వస్తోంది. ఆ ఆనవాయితీ ప్రకారం ఈ రోజు మాతాంగి స్వర్ణలత రంగం వినిపించారు. దేశంలో జరిగే , జరగబోయే విషయాలను రంగం ద్వారా స్వయంగా అమ్మవారే చెబుతారనే విశ్వాసం భక్తుల్లో ఉంది. తన భక్తులకు ఎటువంటి కష్టం రాకుండా కాపాడుకునేందుకు ఎప్పుడూ ఉంటానంది అమ్మవారు.
ఈ మహమ్మారి వల్ల ఎన్ని కష్టాలు వచ్చినా ఎటు సంకోచించకుండా ఇంత పెద్దగా ఉత్సవాలు జరిపించారు చాలా సంతోషంగా ఉందని తెలిపింది. భక్తులు సంతోషంగా ఉండే విధంగా చూసుకొనే బాధ్యత తనదేనని, ఎంత పెద్ద ఆపద వచ్చినా మీ వెంటే ఉండి కాపాడుతానన్నారు. కరోనా మహమ్మారి ప్రజలను చాలా ఇబ్బందులు పెట్టిందని, వర్షాలతో రైతులు కొంత ఇబ్బందులు పడతారని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా భక్తులు తనను నమ్మి పూజలు చేశారని, వారిని కాపాడే బాధ్యత తనదేనని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. అమ్మకు ఇంత చేసినా తమకేమి చేయలేదన్న భావన వీడాలన్నారు. నేడు రంగం కార్యక్రమంలో భాగంగా స్వర్ణలత భవిష్య వాణి వినేందుకు భక్తులు పోటెత్తారు. జాతరలో భాగంగా పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకోనున్నాయి. ఇవాళ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని అంబారి(ఏనుగు)పై ఊరేగింపు జరుగనుంది.

అంతకుముందు గత సంవత్సరం బోనాలు కార్యక్రమం నిర్వహించలేదని, ఈసారి మాత్రం బోనాలు, పూజలు సమర్పించారని..ఇందుకు సంతోషం ఉందా ? అని పండితులు ప్రశ్నించారు. ఎంత ఇబ్బంది పెట్టినా..తనను నమ్మిన వారు పూజలు జరిపించినందుకు సంతోషంగా ఉందన్నారు స్వర్ణలత. అంతకు ముందు స్వర్ణలతకు చీర, ఒడిబియ్యం సమర్పించారు అధికారులు. భవిష్యవాణి కార్యక్రమం ముగియటంతో అంబారీపై అమ్మవారి ఊరేగింపు, పోతరాజుల గావు కార్యక్రమం జరగనుంది. మరోవైపు ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, అ‍మ్మవారి భక్తులు పాల్గొన్నారు. సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఆదివారం వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.