Begin typing your search above and press return to search.

జర్నలిస్టు సిద్దిఖీ దుర్మరణం ..కరోనా టైంలో ఆ కీలక విషయాలని బయటపెట్టింది ఇతనే ?

By:  Tupaki Desk   |   17 July 2021 4:45 AM GMT
జర్నలిస్టు  సిద్దిఖీ దుర్మరణం ..కరోనా టైంలో ఆ కీలక విషయాలని బయటపెట్టింది ఇతనే ?
X
ప్రముఖ ఫోటో జర్నలిస్ట్, పులిట్జర్‌ అవార్డ్‌ గ్రహీత డానిష్‌ సిద్దిఖీ ఊహించని రీతిలో అకస్మాత్తుగా కన్నుమూశారు. అయన మరణవార్త విని దేశ వ్యాప్తంగా జర్నలిస్టులు , ఫోటో గ్రాఫర్స్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అదృష్టవశాత్తూ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నా అంటూ ట్వీట్‌ చేసిన కేవలం మూడు రోజుల్లోనే మళ్లీ అయన మృత్యువాత పడటం అందరిని తీవ్ర విషాదానికి గురిచేసింది. అఫ్గాన్ నుండి అమెరికా సైన్యం వెనక్కి తగ్గిన తర్వాత అఫ్గానిస్థాన్‌ కాందహార్‌ లోని స్పిన్ బొల్డాక్ సరిహద్దు ప్రాంతాన్ని తాలిబన్లు ఆధీనంలోకి తీసుకున్నారు. దీనితో అఫ్గాన్‌సైన్యానికి తాలిబన్లకు మధ్య కొన్ని రోజులుగా ఘర్షణలు జరుగుతున్నాయి. కొంచెం కొంచెం గా అఫ్గాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్ళిపోతుంది.

ఈ గొడవల నేపథ్యంలోనే రాయిటర్స్ సంస్థలో పని చేస్తున్న డానిష్‌ సిద్దిఖీ ఘటనలు కవర్ చేస్తున్న సమయంలో కన్నుమూశారు. సిద్దిఖీ మృతి చెందినట్లు ఆఫ్ఘనిస్తాన్ భారతదేశ రాయబారి తెలిపారు. సిద్ధిఖి మరణం తీవ్ర విచారకరమని రాయబారి ఫరీద్ మముండ్జాయ్ ప్రకటించారు. ఈయన మరణించారు అనగానే సోషల్ మీడియా మొత్తం డానిష్‌ సిద్దిఖీ పేరే. సాధారణంగా ఓ ఫోటో జర్నలిస్ట్ మృతి చెందితే జర్నలిస్టులు , ఫోటో గ్రాఫర్స్ దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం అనేది కామన్ , అయితే సిద్దిఖీ మరణవార్త విని యావత్ దేశం కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. దీనికి ప్రధాన కారణం వేరే ఉంది.

అదేమిటి అంటే .. డానిష్‌ సిద్దిఖీ దేశంలో కరోనా వైరస్ మహమ్మారి స్వైరవిహారం చేస్తున్న సమయంలో ప్రధాని మోదీ , కేంద్ర ప్రభుత్వ డొల్లతనాన్ని అందరికి కళ్లకి కట్టినట్టు చూపించాడు. ప్రపంచం ముందుకి మోడీ చేతగానితనాన్ని నిర్భయంగా తీసుకువచ్చారు. దేశంలో కరోనా వైరస్ అదుపులోనే ఉంది అంటూ దేశాన్ని , దేశ ప్రజానీకాన్ని , ప్రపంచాన్ని మోసం చేస్తుంటే .. ఢిల్లీలోని ఓ శ్మశాన వాటికలో పదుల సంఖ్యలో ఒకేసారి కాలుతున్న శవాల ఫొటోలను అద్భుతమైన పలు యాంగిల్లో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఆ తర్వాతే దేశంలో కరోనా మహమ్మారి ఏ రేంజ్ లో వ్యాప్తి చెందుతుందో , ఎంతమంది చనిపోతున్నారో బయటకి వచ్చింది. అలాగే , ఆ ఫోటోలు ఇప్పటికి కూడా సోషల్ మీడియా లో వైరల్ అవుతూనే ఉంటాయి.

కరోనా మృతుల ఫోటోలు మాత్రమే కాదు. కరోనా మహమ్మారి కట్టడి కోసం మోడీ ప్రభుత్వం తీసుకున్న సంచలనమైన నిర్ణయం లాక్ డౌన్. కరోనా కట్టడికి లాక్ డౌన్ అనేది మంచిదే అయినప్పటికీ , అదే లాక్ డౌన్ ఎంతోమంది జీవితాల్లో చీకటిని నింపింది. ఏ మాత్రం ముందస్తు ప్రణాళికలు లేకుండా ప్రకటించిన లాక్ డౌన్ కారణంగా రవాణా వ్యవస్థ ఎక్కడిక్కడే ఆగిపోయింది. దీనితో తినడానికి తిండి , చేయడానికి పనిలేక ఎంతోమంది వలస కార్మికులు రోడ్ల వెంబడి వేల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లే ఫోటోలు ఎన్నో తీశాడు. లాక్ డౌన్ టైంలో ప్రభుత్వాల బాధ్యతా రాహిత్యాన్ని, అభాగ్యుల కష్టాలను అతను కళ్లకు కట్టినట్లు చూపించాడు తన ఫొటోల ద్వారా. ఇలా జనాల్లో మంచి పేరు సంపాదించిన డానిష్‌ , మోడీ మద్దతుదారుల నుంచి మాత్రం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. అలాగే, అతడికి బెదిరింపులు కూడా వచ్చాయి. అయినా ఏ మాత్రం భయపడకుండా దైర్యంగా నిజాన్ని చూపించడానికి చివరి వరకు ఎంతో తహతహలాడాడు. ఇప్పుడు అఫ్గానిస్థాన్‌లో ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు కోల్పోయాడు. డానిష్ ను అభిమానించే వారు అయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

కాగా, డానిష్ సిద్దిఖీ టెలివిజన్ న్యూస్ కరస్పాండెంట్‌ గా తన వృత్తిని ప్రారంభించి, ఆ తర్వాత ఫోటో జర్నలిస్టుగా మారారు. అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్‌ ఫోటో జర్నలిస్ట్‌ గా ఉన్నారు. అలాగే ఇండియాటుడే గ్రూప్‌ లో కొంతకాలం కరస్పాండెంట్‌ గా పనిచేశారు. ప్రపంచవ్యాప్తంగా అనేక సంక్షోభ సమయాలను అతి సాహసోపేతంగా కవర్ చేసిన ఘనత సిద్ధిఖీ సొంతం. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్‌ లలో యుద్ధాలు, రోహింగ్యా శరణార్థుల సంక్షోభం, నేపాల్ భూకంపాలు, హాంకాంగ్ నిరసనలు మొదలైనవాటిని కవర్ చేశారు. శ్రీలంక పేలుళ్ల సమయంలో పోలీసు కేసును కూడా సిద్ధిఖీ ఎదుర్కొన్నారు.