Begin typing your search above and press return to search.

బాత్రూం లో జారి పడటం తో గతాన్ని మర్చి పోయానన్న దేశాధ్యక్షుడు

By:  Tupaki Desk   |   25 Dec 2019 4:35 PM IST
బాత్రూం లో జారి పడటం తో గతాన్ని మర్చి పోయానన్న దేశాధ్యక్షుడు
X
ఆయనో దేశాధ్యక్షుడు. కానీ.. ఆయన చేసే వ్యాఖ్యలు తరచూ ఆయన్ను వార్తల్లో నిలిచేలా చేస్తుంటాయి. ఆయన నోటి నుంచి వచ్చే మాటలు సంచలనంగా మారటమే కాదు.. దేశాధ్యక్ష స్థానంలో ఉండి ఇలా మాట్లాడొచ్చా? అన్నట్లు ఆయన వైఖరి ఉంటుంది. ఇంతకీ ఆయన ఎవరంటారా? అక్కడికే వస్తున్నాం. బ్రెజిల్ కు చెందిన దేశాధ్యక్షుడు 64 ఏళ్ల జెయిర్ బోల్సోనారో కాస్త భిన్నమైన వ్యక్తి.

అమెజాన్ అడవులు తగలబడిపోతున్న సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా ఆయనకో కొత్త తరహా ఇమేజ్ ను తెచ్చిపెట్టాయి. అమెజాన్ లోని కార్చిచ్చుకు హాలీవుడ్ హీరో లియనార్డో డికాప్రియో పరోక్ష కారణమంటూ సంచలనంగా మారారు. తాజాగా ఆయనో టీవీ చానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన సంచలన విషయాన్ని చెప్పుకొచ్చారు.

బాత్రూంలో తాను కాలు జారి వెల్లకిలా పడటం తో తలకు దెబ్బ తగిలిందన్నారు. దీంతో తాను కాసేపు గతాన్ని మర్చిపోయినట్లు చెప్పారు. అల్వోరాడో ప్యాలెస్ లో బస చేసిన సమయంలో ఇదంతా జరిగిందన్నారు. అయితే..తర్వాతి రోజుకు అంతా బాగైపోయినట్లుగా చెప్పటం గమనార్హం.

ఒక రోజంతా ఆసుపత్రిలో గడిపిన ఆయన తర్వాతి రోజు సాయంత్రాని కి డిశ్చార్జ్ అయి పోయారు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని ఫ్యాన్స్ కు భరోసా ఇచ్చారు. నిజానికి బ్రెజిల్ అధ్యక్షుడి ఆరోగ్యం మీద తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. ఆయన అనారోగ్యానికి గురయ్యారని.. స్కిన్ క్యాన్సర్ కు గురయ్యారన్న వార్త ప్రచారంలోకి వచ్చింది. కానీ.. అది నిజం కాదని తేల్చారు. 2018లో నిర్వహించిన ఎన్నికల ప్రచారం సందర్భంగా కత్తిపోటుకుగురయ్యారు. ఇలా తరచూ ఏదో అంశానికి సంబంధించి వార్తల్లోకి నిలవటం బ్రెజిల్ దేశాధ్యక్షుడి ప్రత్యేకత గా చెప్పాలి.