Begin typing your search above and press return to search.

బ్రహ్మచారికి బంపర్ ఇచ్చిన రాజకీయ పార్టీ .. మద్దతు ఇస్తే పిల్లనిచ్చి పెళ్లి చేస్తారట !

By:  Tupaki Desk   |   6 Feb 2021 12:50 PM GMT
బ్రహ్మచారికి బంపర్ ఇచ్చిన రాజకీయ పార్టీ .. మద్దతు ఇస్తే పిల్లనిచ్చి పెళ్లి చేస్తారట !
X
గతంలో అయితే ఓ ఆడపిల్ల ఇంట్లో ఉంటే , ఆ ఆడపిల్లకి పెళ్లి చేసి , అత్తారింటికి పంపేవరకు నిద్రపట్టేది కాదు. కానీ, ఇప్పుడు కాలం మారిపోయింది. అబ్బాయిలకి అమ్మాయిలు దొరకడం కష్టంగా మారింది. అయితే , ఓ రాజకీయ పార్టీ , మరో పార్టీ నాయకుడికి బంపర్ ఆఫర్ ఇచ్చింది. నువ్వు బ్రహ్మచారిగా ఉన్నావు , నువ్వు కనుక మా పార్టీకి మద్దతు ఇచ్చినట్టు అయితే నీకు మంచి పిల్లని వెదికి పెళ్లి చేసే భాద్యత నాది అంటూ హామీ ఇచ్చాడు. దీనితో ఉన్నపళంగా అప్పటివరకు ఉన్న పార్టీ కి గుడ్ బై చెప్పి , ఆ పార్టీలోకి జంప్ అయ్యాడు. అతడిని పార్టీలో కొనసాగేలా చేయడానికి కొందరు పెద్దలు ప్రయత్నాలు చేసినా కూడా ..పెళ్లి కంటే నాకు ఏదీ ఎక్కువకాదు అంటూ పార్టీ మారడానికే సిద్ధమైయ్యాడు. దీంతో ఏకంగా మాజీ సీఎం రంగంలోకి దిగి ఫోన్ చేసి మాట్లాడినా వినలేదు.

పెళ్లి చేసుకోవటాని ఏనాటినుంచో అనుకుంటూ పెళ్లి సంబంధాలు చూస్తున్నా కుదరని ఆ చోటామోటా యువకుడికి మరో పార్టీ ఇచ్చిన పిల్లనిచ్చే ఆఫర్ తెగ నచ్చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే .. కర్ణాటకలో ఇటీవల గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగాయి. రామనగర్‌ జిల్లా కోడంబళ్లి అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకునేందుకు జనవరి 11న షెడ్యూలు ఖరారు చేశారు. బీసీ ఏ కేటగిరికి అధ్యక్ష స్థానం రిజర్వు కాగా, కాంగ్రెస్ కు చెందిన ఓ వ్యక్తి రేసులో ఉన్నారు. అతనికి ఇదే పంచాయతీలో జేడీఎస్ ‌కు చెందిన వార్డు సభ్యుడు రవి మద్దతు అవసరమైంది. రవి బ్రహ్మచారి. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎన్ని సంబంధాలు చూసినా కుదరటం లేదు. ఈ విషయం తెలుసుకున్న రామనగర్‌ జిల్లా గ్రామీణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ‘మాకు మద్దతు ఇస్తే..నీకు మంచి పిల్లను చూసి పెళ్లి చేసే బాధ్యత మాది’ అంటూ రవికి బంపర్‌ ఆఫర్‌ ఇచ్చాడు. దీనికి రవి ఒప్పుకున్నాడు.

కానీ , పెళ్లి కోసం పార్టీకి వ్యతిరేకంగా పనిచేయొద్దంటూ జేడీఎస్‌ నాయకులు హెచ్చరించారు. చివరికి మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి చేత కూడా ఫోన్‌ చేయించారు. అయినా రవి ససేమిరా అన్నాడు. నాకు రాజకీయం కంటే పెళ్లిపీటలే ముఖ్యమని తేల్చిచెప్పేశాడు. ఈ జగమొండి బ్రహ్మచారి తీరుతో మండిపడ్డ కుమారస్వామి అతడిపై వేటు వేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. కానీ..స్థానిక నాయకత్వం మాత్రం కొన్నిరోజులు వేచి చూద్దాం అనే ధోరణి లో ఉన్నట్టు సమాచారం.